కఠినంగా కోవిడ్ ఆంక్షల అమలు

531

ఖమ్మం, మార్చి 29 (న్యూస్‌టైమ్): కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులలో కరోనా బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆంక్షలు ఖచ్చితంగా అమలు చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో మాస్కులు క్రియాశీలకంగా పనిచేస్తాయని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారంతా ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు. మాస్కులు అందుబాటులో లేనప్పుడు చేతి రుమాలును కట్టుకోవాలని, మాస్క్‌ ధరించడం, భౌతిక ధూరాన్ని పాటించే అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కావాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాల్లో, ప్రజారవాణా వాహనాల్లో (ఆర్టీసీ, ప్రవేటు బస్సులు, ఆటోలు ఇతర వాహనాలు) మాస్కులు లేకుండా తిరిగితే జరిమానా తప్పదని హెచ్చరించారు. మతపరమైన పండుగ పర్వదినాలలో సమ్మేళనాలు, బహిరంగ వేడుకలు, ఆచారాలకు, సమావేశాలకు, ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. పోలీస్ శాఖ చేసిన సూచనలు పక్కాగా అమలు చేస్తూ కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలు తమ వంతు బాధ్యతను గుర్తించి పోలీసు శాఖకు సహకరించాలని సూచించారు. కొందరు వాహనదారులు, ప్రజలు నోరు, ముక్కు కప్పి ఉంచేలా మాస్కు కట్టుకోకుండా అలంకారప్రాయంగా తగిలించుకోవడం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమేనన్నారు. ఎవరి ఆరోగ్య సంరక్షణ వారి చేతుల్లోనే ఉందని, ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి మాట్లాడాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి, మాస్కులు ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం 2005లోని 51 నుండి 60 వరకు గల సెక్షన్ల కింద అదేవిధంగా ఐపీసీ 188తో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.