ముగిసిన ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలు

0
309

హైదరాబాద్, మార్చి 28 (న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ ప్రపంచ రంగస్థల దినోత్సవం-2021 వేడుకలను అత్యంత వైభవంగా మూడు రోజుల పాటు రవీంద్ర భారతి వేదికపై నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి గౌరవ అతిథిగా కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ విజయ భాస్కర్ సమక్షంలో మూడవరోజు ముగింపు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్ అధ్యక్షత వహించగా, ప్రముఖ దర్శకులు బి.యం. రెడ్డి, తెలంగాణ నాటక సమాజ అధ్యక్షులు తడక మళ్ల రామచంద్ర రావు తెలంగాణ సంగీత నాటక అకాడమీ కార్యదర్శి వసుంధర పాల్గొన్నారు. డామె హెలెనీ లిడియా మిర్రెనీ, ఆర్లో నటి. యూకే వారు ఇచ్చిన ఈ సంవత్సరం ప్రపంచ రంగస్థల దినోత్సవం సందేశాన్ని తెలంగాణ సంగీత నాటక అకాడమీ సెక్రెటరీ జీ వసుంధర చదివి వినిపించారు. నృత్య ప్రదర్శనలతో ఆరంభించిన ఈ సభ చిరంజీవి రవళి ప్రదర్శించిన ఏక పాత్రాభినయం ప్రేక్షకులను అలరించింది. బి.యం. రెడ్డి దర్శకత్వంలో ఆది విష్ణు రచించిన సత్య పీఠం నాటిక నేటి సమాజానికి అద్దం పట్టింది. ఈ సందర్బంగా క్రీడా యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నాటకం విశిష్ఠతను తెలియజేశారు. కేవలం ఒక్క గంట లేక రెండు గంటల్లోనే ఒక జీవితకాల విశేషాలను ఎన్నో సంవత్సరాల చరిత్రను మన కళ్లకు కట్టినట్టుగా చేసి మన జీవితాలపై చెరగని ముద్ర వేసేదే నాటకం అన్నారు. కళాకారులు అంటేనే ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా నిలబడి తమ జీవితాన్ని కళలకు అంకితం చేసిన వారని, కళాకారులకు రంగస్థలం దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వారికి నెలవారీ ఇచ్చే పింఛనును పెంచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దృష్టికి తేనున్నట్లు తెలిపారు. జీవిత కాలం వారి వివరాలు గుర్తిండిపోయేలా తెలంగాణ సంగీత నాటక అకాడమీ వెబ్‌సైట్‌లో రంగస్థల కళాకారుల వివరాలు పొందుపరుస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక వారందరి సేవలను గుర్తించి గుర్తింపు కార్డులను కూడా అందజేస్తామన్నారు. నాటకం, ఇతర కళాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. పిల్లలకి కళల పట్ల ఆసక్తి కల్పించాలని, అందుకు తగిన విధంగా ప్రోత్సహకాలనందిస్తామని, ఆపై కళలు అభివృద్ధి చెందుతాయని, తద్వారానే పిల్లల్లో సంపూర్ణ మూర్తిమత్యాన్ని పెంపొందించగలమని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ, సినిమాల్లో నంది అవార్డులు ఇస్తున్నారని, అదేవిదంగా రంగస్థల రంగానికి చెందిన కళాకారులకి కూడా నంది అవార్డులు ఇచ్చి,నాటకరంగాన్ని ప్రోత్సహించు కోవాలన్న అవసరం ఎంతో ఉందన్నారు. ప్రతి ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజు ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్ వారు నాటక రంగాలలో ప్రముఖులైన ఒకరిని సమన్వయకర్తగా ఎంపిక చేసుకొని, వారి సందేశాన్ని ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశంగా ప్రపంచానికి అందిస్తుంది. ఆ సందేశాన్ని ప్రపంచ దేశాలు వారి వారి ప్రాంతీయ భాషల్లోకి అనువదించి, ప్రపంచ రంగస్థల దినోత్సవం నాడు నాటక ప్రదర్శనలు సందర్బంగా ప్రముఖ నటుల సందేశాన్ని చదవడం ఆనవాయితీగా వస్తుంది. తొలి సందేశాన్ని ప్రముఖ నటులు బేనే కాక్టే (పారిస్) అందించగా, ఈనాటి ప్రపంచ రంగస్థల దినోత్సవం సందేశాన్ని హెలెన్ మిర్రెన్ యునైటెడ్ కింగ్డమ్‌కి చెందిన ప్రముఖ సినిమా, టీవీ, రంగస్థల నటి పంపారు.