యాదాద్రిలో పెరుగుతున్న కరోనా

536

యాదాద్రి, మార్చి 28 (న్యూస్‌టైమ్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తోంది. యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత ఆలయ అర్చకులు, సిబ్బంది కరోనా బారినపడ్డారు. ఇవాళ కొత్తగా 26 మందికి కరోనా సోకింది. దీంతో యాదాద్రి ఆలయంలో 62కి కరోనా కేసులు చేరాయి. అర్చకులు, సిబ్బంది, జర్నలిస్టులు కరోనా బారినపడ్డారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నవారిలో ఆందోళన నెలకొంది. కరోనా సెకండ్‌వేవ్‌ ప్రబలుతున్న నేపథ్యంలో కొవిడ్‌-19 మార్గదర్శకాల అమలులో ఆలయ అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహించారు. మహోత్సవాల నిర్వహణలో కనీస భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించని భక్తులపై ఆలయ ప్రవేశంపై ఆంక్షలు విధించడంతోపాటు ఆలయ ప్రవే శమార్గంలో థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేయకుండా స్వామివారి దర్శనాలు, విశేష పూజలకు అనుమతించారు. క్షేత్రానికి వచ్చే భక్తజనులు సగంకంటే ఎక్కువ మంది మాస్క్‌లు లేకుండానే రద్దీలో సంచరించడం కనిపించింది. దేవస్థాన అధికారులు కనీసం పట్టించుకోకపోగా, కొండపై తిరువీధులు, దర్శన క్యూలైన్లు, ఆర్జిత సేవల ప్రదేశాల్లో గుంపుగుంపులుగానే భక్తులు సంచరించడంతో ఒక్కసారిగా కరోనా విజృంభించినట్లు తెలుస్తోంది.