బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఏపీ గవర్నర్ ఆమోదం

157

అమరావతి, మార్చి 28 (న్యూస్‌టైమ్): ఏపీ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం ఆమోదం తెలిపారు. మూడు నెలల కాలానికి ఏపీ రూపొందించిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదించారు. దీంతో బడ్జెట్ ఆర్డినెన్స్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మూడు నెలల కాలానికి మొత్తం రూ.70,994.98 కోట్ల వ్యయానికి అనుమతించారు. గవర్నర్ ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చినట్టయ్యింది. మూడు నెలల కాలానికి ఏపీ ప్రభుత్వ బడ్జెట్ ఆర్డినెన్స్‌ను రూపొందించగా శుక్రవారం దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ మేరకు ఆమోదం లభించింది. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ పథకాల అమలుకు ఈ నిధులు వినియోగిస్తారు. వరుసగా రెండో ఏడాది ఆర్డినెన్స్ రూపంలోనే ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. తాజా ఆర్డినెన్స్‌తో ఏప్రిల్‌లోనూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహణపై సందిగ్ధత నెలకుంది. అసెంబ్లీ సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రభుత్వం ఆమోదించనుంది. మార్చి 31తో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ప్రస్తుత వ్యయాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. వాస్తవానికి మార్చిలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంది. మార్చి చివరి వారంలో సమావేశాలు నిర్వహించాలని భావించారు. కానీ వరుసగా ఎన్నికలు రావడం, కరోనా కేసులు పెరగడం, ఇదే సమయంలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ జారీచేయడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. గతేడాది కూడా కరోనా వైరస్ కారణంగా బడ్జెట్‌ను ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈసారి కూడా అదే పునరావృతం అయ్యింది. వరుసగా రెండోసారి బడ్జెట్‌ను ఆర్డినెన్స్‌ రూపంలో తేవడాన్ని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పూర్తిస్థాయి బడ్జెట్‌ సమావేశాలు లేదా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదముద్ర వేయకూడదని టీడీపీ కోరింది. వార్షిక బడ్జెట్‌ను కూడా ఆర్డినెన్స్‌ రూపంలో తెచ్చే దుష్ట సంప్రదాయానికి జగన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని దుయ్యబడుతోంది.