పీఓటీ, పీఓఏ చట్టాలను యథేచ్ఛగా అతిక్రమించారు

539
– దళిత సోదరుల భూములను అన్యాయంగా లాక్కున్నారు
– మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి,  బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ వెల్లడి
మీడియాతో మాట్లాడిన ఆళ్ల, నందిగం ఏమన్నారంటే….
ఎల్లో మీడియా దుష్ప్రచారం:
‘గత రెండు రోజులుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా నానా హడావిడి చేస్తున్నాయి. రైతుల వద్ద స్టింగ్‌ ఆపరేషన్‌ చేశామని చెబుతూ, తాను కేసులు కావాలని పెట్టించినట్లు ప్రచారం చేస్తున్నారు. నా దగ్గరకు వచ్చిన దళితులు చెప్పిన మాటలను సీఐడీ వాళ్లు పూర్తిగా రికార్డు చేశారు. అయితే తాము అలా చెప్పలేదని ఆ రైతులతో ఇప్పుడు ఎల్లో మీడియా బెదిరించి చెప్పిస్తోంది. ఎక్కడైనా అవినీతి, అన్యాయం జరిగితే స్టింగ్‌ ఆపరేషన్‌ చేస్తారు. కానీ జరిగిన అన్యాయాన్ని కప్పి పుచ్చడానికి స్టింగ్‌ ఆపరేషన్‌ ఎలా చేస్తారని ఆంధ్రజ్యోతి, ఈనాడును ప్రశ్నిస్తున్నాను’.

దళిత సోదరులకు అండగా:
‘దళితుల మీద జరిగిన అన్యాయాన్ని నాడు ప్రశ్నించాను. 2015, అక్టోబరులో దళిత సోదరులు చెప్పిన మాటల స్టేట్‌మెంట్లు ఇవి (అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి కొన్ని పత్రాలు చూపారు). ఆ తర్వాత నాకు నేనుగా 19.02.2016న వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాను. ఇవాళ కూడా నా దగ్గరకు తాడికొండ నియోజకవర్గానికి చెందిన కొందరు దళిత సోదరులు వచ్చి కలిశారు. టీడీపీ నాయకులు తమను ఎలా బెదిరించి, బాధించారో చెప్పారు. రేపు వాళ్లందరి స్టేట్‌మెంట్లు సీఐడీ అధికారులు నమోదు చేస్తారు’.
‘ఆ గ్రామంలో ఒక సోదరుడు నాకు చెప్పాడు. 1920లో సొసైటీలు ఏర్పడి, డీకే పట్టాలు ఇచ్చారు. 10, 33, 87 సెంట్ల చొప్పున భూములు ఇచ్చారు నాటి పాలకులు. వారిని గొప్పవారిని చేయాలన్న ఆలోచన, చంద్రబాబుకు లేదు’.

పద్ధతి ప్రకారం దోపిడి:
‘దోపిడిని ఒక్క పద్ధతి ప్రకారం, పక్కాగా చేశారు చంద్రబాబు, నాటి మంత్రి పి.నారాయణ. మీ భూములను ప్రభుత్వం లాక్కుంటుంది. ఎలాంటి పరిహారం రాదని బెదిరించి, దళితుల నుంచి అతి తక్కువ ధరకు తమ అనుయాయులతో కొనిపించారు. దళితులు కూడా భయపడి భూములు అమ్ముకున్నారు. ఆ తర్వాత జీఓ నెం.41తో ఆ భూములను ల్యాండ్‌ పూలింగ్‌లో కలిపారు’.

దీనిపై స్టింగ్‌ చేయండి:
‘పీఓటీ, పీఓఏ చట్టాలు అతిక్రమించి చంద్రబాబు ఏం చేశాడు? ఆర్‌కె కరెక్టా? చంద్రబాబు కరెక్టా? నారాయణ కరెక్టా? అన్న వాస్తవాలు మీరు ఎందుకు వెలుగులోకి తీసుకురారు.. ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ చేశామని చెబుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతిని అడుగుతున్నాను. అసలు ఆర్‌కేకు (నాకు), చంద్రబాబుకు, నారాయణకు మధ్య పీఓటీ, పీఓఏ చట్టాలు ఉన్నప్పుడు, వాటిని ఒకసారి చదివి, వాటి ప్రకారం జీఓలు ఉన్నాయా? లేదా? అసలు దళిత సోదరులను మోసం చేశారా? లేదా? అన్నది నిక్కచ్చిగా తేలిస్తే చాలు. అది స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా ఒక్క నిమిషంలో బయటకు వస్తుంది’.

వారే ముందుకు రావొచ్చు కదా?:
‘అసలు వారు ఎవరెవరితోనో మాట్లాడిస్తున్నారు. నేరుగా చంద్రబాబు, నారాయణ వచ్చి, నన్ను ముఖాముఖి చర్చకు పిలవొచ్చు కదా? తాము ఏ తప్పు చేయలేదని చెప్పొచ్చు కదా? కానీ వారు ఆ పని చేయడం లేదు. ఎందుకంటే కోర్టు కూడా ఆ కేసు కొట్టివేయలేదు. కేవలం 4 వారాలు మాత్రమే స్టే ఇచ్చింది. ఆలోగా మేమే అఫిడవిట్‌ దాఖలు చేస్తాం. అందులో అన్నీ ఆధారాలు ఉన్నాయి. వాటి ద్వారా అడ్డంగా దొరికిపోతామని భయపడుతున్నారు కాబట్టే, చంద్రబాబు, నారాయణ ఇద్దరూ ప్రెస్‌ ముందుకు రాకుండా, కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే స్టింగ్‌ పేరుతో ఎల్లో మీడియా ద్వారా డ్రామాలు ఆడుతున్నారు’.

యథేచ్ఛగా చట్టాల ఉల్లంఘన:
‘పీఓటీ, పీఓఏ చట్టాలకు అనుగుణంగా అసైన్డ్‌ భూములు అమ్మకూడదు. కొనకూడదు. అది తప్పు. కానీ తమకు అనుకూలంగా జీఓలు తీసుకువచ్చి అసైన్డ్‌ భూములు కొట్టేశారు. ఇవే కాకుండా లంక భూములు 22–ఏ కింద ఉన్నాయి. వాటికి రిజిస్ట్రేషన్‌ కాకుండా గుంటూరు కలెక్టర్‌ ఆ జాబితాలో పెట్టారు. కాబట్టి వాటిని బదలాయించవద్దని స్పష్టంగా ఉన్నా, ఉద్ధండరాయపాలెం, మల్కపురంలో దాదాపు 150 మంది దళిత సోదరులకు సంబంధించిన సుమారు 100 ఎకరాలను రిజిస్ట్రేషన్‌ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి, గుమ్మడి సురేష్‌ అనే వ్యక్తికి కట్టబెట్టారు. ఆ విధంగా దాదాపు 4 వేల ఎకరాలు. ప్రతి ఊరు, ప్రతి కుటుంబం. ప్రతి కుటుంబానికి ఒక కధ, మనిషికి ఒక వ్యధ మిగిల్చాడు చంద్రబాబు’.

నిజంగా చిత్తశుద్ధి ఉంటే..:
‘నేను చంద్రబాబును ఒక మాట అడుగుతున్నాను. రైతులు స్వచ్ఛందంగా 50 వేల ఎకరాల భూములు ఇచ్చారని మీరు చెబుతున్నారు. మరి ఆనాడు 1920లో సొసైటీ కింద ఇచ్చిన భూములు కూడా ఎలా తీసుకున్నారు. ఆ భూములను వారికే వదిలిపెట్టి, రాజధానిలో వారికి తగిన స్థానం ఎందుకు కల్పించలేదు. 10 సెంట్లు, 20 సెంట్లు, అర ఎకరం భూమి ఉన్న వారికి ఆ భూములు అలాగే ఎందుకు ఉంచలేదు.
దళిత సోదరులను మోసం చేయడానికి, వారి ఆస్తులు కొట్టేయడానికి,
రాజధానిలో దళితుడు అనే వాడు ఉండకూడదని కంకణం కట్టుకున్న దోపిడిదారుడు, దుర్మార్గుడు చంద్రబాబు. ఆయనకు మంత్రి నారాయణ సహకరించాడు’.

మేమిద్దరం చాలు:
‘వారికి (చంద్రబాబు, నారాయణ) దమ్ము ధైర్యం ఉంటే, వారు తప్పు చేయలేదనుకుంటే పబ్లిక్‌గా డిబేట్‌కు ముందుకు రండి. నేను, సురేష్‌ ఇద్దరం కూర్చుంటాం. అన్నీ చర్చిస్తాం. పీఓటీ, పీఓఏ చట్టాలు తీసుకుందాం. మేమేమీ పుస్తకాలు చదవాల్సిన పని లేదు. ఎందుకంటే మేమిద్దరం కూడా తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలలో నాడు చంద్రబాబునాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దళితులకు అండగా నిల్చాము. అందుకే ధైర్యంగా నిలబడుతాము’.

సీఎంని కోరుతున్నాను:
‘త్వరలో నేను లేఖలు కూడా రాస్తాను. రాజ్యాంగం ప్రకారం దళితులకు ఇచ్చిన హక్కులను చంద్రబాబు ఏ విధంగా కాల రాశాడన్నది చెబుతాను. దళిత సోదరులు వాళ్ల కాళ్ల మీద వారు నిలబడాలంటే, వారు తలెత్తుకుని తిరగాలంటే భూమి, వ్యవసాయం వల్లనే అది సా«ధ్యం. ఒక తల్లికీ, బిడ్డకూ మధ్య సంబంధం మాదిరిగానే రైతుకు భూమికి మధ్య సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ దళితులు తమ భూములు తిరిగి పొంది వ్యవసాయం చేసుకునే వెసులుబాటు కల్పించాలని నేను సీఎం గారిని కోరుతున్నాను’.
‘అదే విధంగా పీఓటీ, పీఓఏ చట్టాలను అతిక్రమించి చంద్రబాబు, నారాయణ కాజేసిన దళిత సోదరుల భూమిని తిరిగి వారికి అప్పగించే విధంగా చర్యలు చేపట్టాలి. అయితే ఎక్కడైనా ఇప్పటికే ఆ భూముల్లో నిర్మాణాలు జరిగి ఉంటే, వాటికి సమీపంలో రెట్టింపు భూమి ఇవ్వాలి. ఆ విధంగా దళిత సోదరులు సగర్వంగా తలెత్తుకునే విధంగా చూడాలి. అలాగే చంద్రబాబు మాదిరిగా దుర్మార్గంగా రాబోయే రోజుల్లో వేరెవరూ కూడా తిరిగి ఆ భూములు లాక్కోవడానికి సాహసించవద్దు. ఆ విధంగా వారి భూములు తిరిగి వారికి అప్పగించాలని కోరుతున్నాను’.

అఫిడవిట్‌లో అన్నీ పక్కాగా..:
‘చంద్రబాబు, నారాయణ కేసులను కోర్టు డిస్మిస్‌ చేయకుండా కేవలం 4 వారాల స్టే మాత్రమే ఇచ్చారు. ఆలోగా నేను, సీఐడీ వారు అఫిడవిట్‌ దాఖలు చేస్తాం. అప్పుడు అన్ని వివరాలు కోర్టు ముందు పెడతాం. చంద్రబాబు రాజధానిలో భూములకు సంబంధించి యథేచ్ఛగా చట్టాలు ఉల్లంఘించారు.
అందుకు ఒక ఉదాహరణ:
ఒక సైనికుడికి భూమి ఇస్తే, కొన్ని నియమాలు ఉంటాయి. ఆ భూమిని మూడేళ్లలో సాగులోకి తీసుకురావాలి. మీరు లేదా మీ కుటుంబ సభ్యులే సాగు చేయాలి. లేకపోతే కూలీలను పెట్టుకుని వ్యవసాయం చేయాలి. అంటే కనీసం కౌలుకు కూడా ఇవ్వొద్దు. 10 ఏళ్ల తర్వాత దాన్ని అమ్ముకోవచ్చు.
‘ఇది 1993 నాటి జీఓ నెం.1117 లో ఉంటే, దాన్నే నోట్‌ ఫైల్‌లో రాస్తూ, జీఓలో మాత్రం బిఫోర్‌ టెన్‌ ఇయర్స్‌ అని కూడా రాశారు.
ఆ విధంగా ప్రతి దాంట్లో పీఓటీ, పీఏటీ చట్టాలను ఉల్లంఘించారు. అవన్నీ అఫిడవిట్‌లో ఫైల్‌ చేస్తాను. అవి కేసు దర్యాప్తులో బయటకు వస్తాయి’..
అంటూ ఉదహరించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోర్టు విచారణలో చంద్రబాబు అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయని వివరించారు.

నాడు ఏం జరిగిందంటే?:
‘ఏబీఎన్‌ కానీ, ఈనాడు కానీ రాసిన రాతలు చూశాం. చంద్రబాబు నీతిపరుడు. ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పడమే వారి ఉద్దేశం. నిజానికి చంద్రబాబు, నారాయణ చాలా మోసాలు చేశారు. రాజధాని నూజివీడులో ఏర్పాటవుతుందని చెప్పి, తుళ్లూరు ప్రాంతంలో వారు, వారి అనుయాయులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఆ తర్వాత తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు. మూడేళ్లలో అద్భుతమైన రాజధాని కడతానని చంద్రబాబు చెప్పారు. సింగపూర్‌ను చూపాడు. ఒక కమిటీ వేసి అందులో నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, శ్రావణ్‌కుమార్‌ను వేశాడు. వారు ఇంటింటికీ తిరిగి భూములు ఇచ్చేలా ఒప్పించారు’.
‘అదే సమయంలో అసైన్డ్‌ భూముల గురించి అడిగితే, మీది ఇప్పుడు కాదు అంటూ ఏదేదో చెప్పే వారు. అసైన్డ్‌ భూములను ప్రభుత్వం ఎప్పుడైనా తీసుకుంటుందని లీక్‌ చేశారు. ఎలాంటి నష్టపరిహారం రాదని ప్రచారం చేశారు. అదే సమయంలో బ్రోకర్లు రంగంలోకి దిగారు. తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన రైతులను బ్రతిమిలాడి భూములు ఇచ్చేలా ఒప్పించారు. అదే దళితుల వద్ద ఉన్న అసైన్డ్‌ భూములను, ఒక భయానక వాతావరణం సృష్టించి, అతి తక్కువ ధరకు బ్రోకర్ల ద్వారా కొన్నారు. ఆ తర్వాత జీఓ నెం.41 జారీ చేసి, వాటిని ల్యాండ్‌ పూలింగ్‌లో కలిపారు’.

ఇళ్లలో నిర్భంధించారు:
‘రాజధాని భూమి పూజ కోసం ప్రధాని నరేంద్రమోదీ గారు ఉద్ధండరాయపాలెం వస్తుంటే, మమ్మల్ని ఇళ్ల నుంచి బయటకు రానివ్వలేదు. వందల పోలీసులను పెట్టారు. అదే చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారికి పట్టు బట్టలు పెట్టి, భూమి పూజ వద్దకు ఆహ్వానించారు. అదే దళితులను ఇళ్ల నుంచి బయటకు రానివ్వలేదు. చివరకు శిలా ఫలకం మీద ఎమ్మెల్యే శ్రావణ్‌ పేరు లేదు. ఆయనను కనీసం వేదిక మీదకు కూడా పిలవలేదు’.

డిబేట్‌కు రండి:
‘అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లు కూడా అడ్డగోలుగా చేసుకున్నారు. ఇవన్నీ వారికి కనిపించడం లేదా?. ఈనాడుకు, ఏబీఎన్‌కు సిగ్గు శరం ఉంటే డిబేట్‌కు రండి. అన్న (ఆళ్ల రామకృష్ణారెడ్డి) కూడా అవసరం లేదు. ఆయన కాస్త బిజీగా ఉంటారు. అందుకే నేను కూర్చుంటాను. ఆరోజు ఏం జరిగిందో నేను చెబుతాను కదా? రాజధానిలో ఏం చేశారో నేను చెబుతాను కదా? అసలు రాజధానిలో దళితులను రోడ్లు ఎక్కనిచ్చారా?’.

ఇప్పుడూ బెదిరిస్తున్నారు:
‘ఇప్పటికి కూడా మంగళగిరిలో దళితులు ముందుకు వచ్చి, ఫిర్యాదు చేస్తే వారిని బెదిరిస్తున్నారు. ఇళ్లు కూడా ఉండబోవని చెబుతున్నారు.
అప్పుడు, ఇప్పుడు అదే విధంగా వ్యవహరిస్తున్నారు. అయినా సిగ్గు లేకుండా ఈనాడు, ఏబీఎన్‌ ఒకటే దుష్ప్రచారం. రాధాకృష్ణకు సిగ్గు లేదు. అన్నీ వదిలేశాడు’.
‘ఇక ఢిల్లీలో ఒక కుక్క ఉంది. రఘురామకృష్ణంరాజు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. దళితులకు రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వకుండా సపోర్టు చేశాడు. అంటే వీళ్లంతా ఏమిటి అంటే, రాజధాని ప్రాంతంలో దళితులు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ ఉండకూడదని వీళ్ల ఆలోచన. ఆ కుట్రతోనే ఇదంతా చేశారు’.

సిగ్గు లేకుండా రోడ్డెక్కుతున్నారు:
‘రాజధాని ప్రాంతంలో రైతుల దుస్థితికి కారణం చంద్రబాబు నాయుడు. మూడేళ్లలో అభివృద్ధి చేస్తానని చెప్పిన ఈ వ్యక్తి, చతికిల పడి లక్షల కోట్లు దోచుకున్నాడు. హైదరాబాద్‌లో ఇంద్ర భవనం కట్టుకున్నాడు. ఇక్కడ షూటింగ్‌కు వచ్చినట్లు రావడం. ఇక లోకేష్‌ సంగతి తెలిసిందే. దళితులకు అన్ని విధాలుగా అన్యాయం చేసి, ఇవాళ ఏ మాత్రం సిగ్గు లేకుండా రోడ్డెక్కి మాట్లాడుతున్నారు’.

తప్పు చేయకపోతే..:
‘మీరు తప్పు చేయలేదు సరే. అలాంటప్పుడు దర్యాప్తుకు సహకరించాలి కదా? స్టే వద్దు. నేను సీఐడీ ముందుకు వస్తాను అని ధైర్యంగా చెప్పవచ్చు కదా? కానీ ఆ పని చేయకుండా అసలు దర్యాప్తే జరగవద్దంటూ కోర్టుకు వెళ్లాడు. స్టే తెచ్చుకున్నాడు. చంద్రబాబు ఎన్ని కేసుల్లో అలా స్టే తెచ్చుకున్నాడో తెలుసు కదా?. నారాయణ కావొచ్చు. చంద్రబాబు కావొచ«్చు. తాము తప్పు చేయలేదు కాబట్టి, కేసు విచారణ ఎదుర్కొంటాం అని ధైర్యంగా చెప్పి, ముందుకు రావొచ్చు కదా? కానీ ఆ పని చేయకుండా, దొంగల మాదిరిగా కోర్టులకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నట్లు?. అలాంటి వ్యక్తులకు మీరు వత్తాసు ఎందుకు పలుకుతున్నారు?’.

ఆనాటి అరాచకాలు మర్చిపోయారా?:
‘అసలు నాడు రాజధాని ప్రాంతంలో ఏం జరిగిందో? అవి ఎలా జరిగాయో? ఇక మా మీద కేసులేమిటో? మీరంతా చూశారు. రాజధానిలో దళితులు ఉండకూడదని కుట్ర చేసిన చంద్రబాబు. మరోవైపు దళితులను గౌరవించి వారికి పదవులిచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి గారు. ఒక కార్యకర్త స్థాయి వ్యక్తిని. ఈ పదవి వచ్చింది. మరి అలాంటి చంద్రబాబుకు అనుకూలంగా మీరు రాయడం. కాబట్టి మీరంతా కూడా చంద్రబాబుకు చెప్పండి. మేము పొద్దస్తమానం మీకు డబ్బా కొట్టలేకపోతున్నాం. దయచేసి కేసులు ఎదుర్కొండి అని’.
‘అటు బాబు మారరు. చిన బాబు మారరు. ఇక నారాయణ గురించి తెలిసిందే. ఆయన కాలేజీల్లో ఎందరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారో అందరికీ తెలిసిందే’.

కాబట్టి..:
‘కాబట్టి.. చంద్రబాబు కానీ, ఆయన కుమారుడు కానీ, నారాయణ కానీ, ఏబీఎన్‌ రాధాకృష్ణ కానీ లేక వయసై పోయిన రామోజీరావు కానీ.. లేదా వారి తరపున ఎవరొచ్చినా సరే నేను కూర్చుంటాను. మాట్లాడుతాను. నాడు అసైన్డ్‌ భూముల్లో ఏం జరిగిందన్న దానిపై అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇక నైనా వాస్తవాలు రాయండి. చంద్రబాబుకు డబ్బా కొట్టడం మానండి. అబద్ధాలను వాస్తవాలుగా చూపే ప్రయత్నం చేయకండి. ప్రజలు పిచ్చి వారు కాదు. వారికన్నీ తెలుసు. అందుకే గత ఎన్నికల సమయంలో మీరెంత ప్రచారం చేసినా, ప్రజలు ఫ్యాన్‌ను 151 సీట్ల వేగంతో తిప్పారు’… అంటూ బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ ప్రెస్‌ మీట్‌ ముగించారు.