సీఎం జగన్‌ ప్రకటన..చిరంజీవి హర్షం

352

అమరావతి‌: కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ప్రకటించడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడికి సముచిత గౌరవం కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆనందం కలిగించిందన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును కేంద్రమంత్రి పి హర్‌దీప్‌సింగ్‌తో కలిసి సీఎం జగన్‌ గురువారం ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టునకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్‌ ప్రకటించారు. ఈ విషయంపై ట్విటర్‌ వేదికగా స్పందించిన చిరంజీవి.. ‘‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటనతో ఆనందంలో మునిగితేలుతున్నా. భారత ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. గొప్ప దేశభక్తుడు, నిజమైన యోధుడు.. ఆయన ఈ గుర్తింపునకు పూర్తి అర్హుడు. అలాంటి గొప్ప వ్యక్తి పాత్ర పోషించే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం’’ అని సంతోషం వ్యక్తపరిచారు. రేనాటి వీరుడు.. తొలి స్వతంత్ర సమర యోధుడు.. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సైరా’ సినిమాలో మెగాస్టార్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు.