థియేటర్లపై ఆ ప్రచారం అబద్ధం : తలసాని

0
386

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సినిమా థియేటర్లు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న తరుణంలో దాని కట్టడికి అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతుండటంతో థియేటర్లను త్వరలోనే మూసివేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తాజాగా రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని స్పందించారు. అవన్నీ అవాస్తవాలనేని, అలాంటి పుకార్లను నమ్మవద్దన్నారు. థియేటర్ల మూసివేతపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

‘కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే తెలుగు చలన చిత్రపరిశ్రమకు ఎంతో నష్టం వాటిల్లింది. ఇండస్ట్రీనే నమ్ముకున్న ఎంతోమంది చిన్న నటీనటులు, కార్మికులు రోడ్డునపడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తోన్న తరుణంలో రాష్ట్రంలో సినిమా థియేటర్లు మూసివేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. కొవిడ్‌-19 నిబంధనలను అనుసరిస్తూ ఎలా అయితే సినిమాహాళ్లు ప్రస్తుతం నడుస్తున్నాయో అలాగే కొనసాగుతాయి. దయచేసి పుకార్లు వ్యాప్తి చేయకండి’’ అని తలసాని  పేర్కొన్నారు.