బహిరంగ ప్రదేశాలలో ముసుగులు ధరించడంపై నిషేదం

1170

బహిరంగ ప్రదేశాలలో ముసుగులు ధరించడం పై స్విట్జర్లాండ్ లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. బహిరంగ ప్రదేశాలలో ముసుగులు ధరించి తిరగడాన్ని నిషేధించాలనే స్విట్జర్లాండ్ ప్రజానీకం అభిప్రాయపడింది.

ఈ ప్రజాభిప్రాయ సేకరణలో 51. 2 శాతం ప్రజలు ముఖానికి ముసుగులు ధరించి తిరగడాన్ని నిషేధించాలని అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థను అనుసరించే స్విజర్లాండ్ సమస్యలపై చర్యలు తీసుకోవడానికి ప్రజాభిప్రాయంపై ఆధారపడుతుంది. ఆ మేరకు బహిరంగ ప్రదేశాలలో ప్రజలు ముసుగులు ధరించి తిరగడాన్ని నిషేధించాలా వద్దా అనే అంశంపై ఓటింగ్ నిర్వహించవలసిందిగా స్విస్ పీపుల్స్ పార్టీ నిర్ణయించింది. నిజానికి ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రచారం చేసింది. ప్రజల దుస్తుల శైలిని నిర్దేశించడం ప్రభుత్వం పని కాదని వాదించింది. కానీ ప్రభుత్వం యొక్క అభీష్టానికి విరుద్ధంగా ప్రజలు నిషేదాన్ని కోరుకున్నారు కనుక దానిని అమలు చేయడం ప్రభుత్వానికి తప్పనిసరి.

ప్రధానంగా ముస్లిములు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఈ ప్రతిపాదనలో ప్రత్యేకంగా ఏ మతం గురించీ ప్రస్తావించలేదు. నిరసనల పేరుతో మాస్కులు ధరించిన నిరసనకారులు కొందరు అల్లర్లు సృష్టించడం, కాల్పులు జరపడం వంటి చర్యలకు పూనుకోకుండా చేయడానికే స్విస్ పీపుల్స్ పార్టీ ఈ ప్రతిపాదనను తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

2009లో సైతం ఇదే విధమైన ప్రజాభిప్రాయ సేకరణలో, స్విస్ ప్రజలు మినార్ల నిర్మాణాన్ని నిషేదించాలని ఓటు వేశారు. ఆ ప్రతిపాదనను కూడా స్విస్ పీపుల్స్ పార్టీయే తీసుకురావడం గమనార్హం. 2011 నుంచి ఫ్రాన్స్, ముఖానికి పూర్తిగా ముసుగులు ధరించడాన్ని నిషేదించింది. కొందరు యూరోపియన్ మానవ హక్కుల న్యాయస్థానంలో ఈ నియమాన్ని సవాలు చేయగా న్యాయస్థానం ఆ చట్టాన్ని సమర్ధించింది.

   ( VSK ANDHRAPRADESH)