షర్మిల సభకు కరోనా షాక్?

328

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు
స్వచ్ఛంద లాక్‌డౌన్ చేస్తున్న గ్రామాలు
రెండు లక్షల మందిని అనుమతిస్తారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చేందుకు పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న వైఎస్ షర్మిల నిర్వహించబోయే ఖమ్మం సభకు ‘కరోనా షాక్’ తగిలే అవకాశం కనిపిస్తోంది. దాదాపు రెండు లక్షమందితో ఖమ్మంలో వచ్చే నెల 9న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు షర్మిల యంత్రాంగం సిద్ధమవుతోంది. ఆ మేరకు పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసుల తీవ్రత, గ్రామాలలో పెరుగుతున్న స్వచ్ఛంద లాక్‌డౌన్ పరిస్థితులు షర్మిల సభ సక్సెస్‌కు ఆటంకంగా మారాయి.

అయితే, కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుతుండటంతో షర్మిల ఆశించినంత మంది సభకు వస్తారా? అసలు అంతమందిని పోలీసులు అనుమతిస్తారా? అప్పటికి ప్రభుత్వం మరిన్ని కఠిన నిబంధ నలు ప్రవేశపెడుతుందా? అన్న కొత్త టెన్షన్ షర్మిల సభ నిర్వహకులలో  మొదలయింది. నిజానికి అన్ని లక్షల మంది సమక్షంలో ఆమె పార్టీ పేరు, అజెండా ప్రకటించాలని భావిస్తున్నారు. గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉండటంతోపాటు, తన మెట్టినిల్లయిన ఖమ్మం కేంద్రంగానే పేరు ప్రకటించాలన్నది ఆమె లక్ష్యంగా కనిపిస్తోంది. తన  అత్తవారిల్లు తెలంగాణ అయినందున, తాను తెలంగాణ కోడలినేనని షర్మిల ఇప్పటికే పలుసార్లు స్పష్టం చేశారు.

ఖమ్మంలో వచ్చే నెల 9న నిర్వహించే భారీ బహిరంగలోనే, షర్మిల పార్టీ పేరు ప్రకటిస్తారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఆ మేరకు ఎన్నికల కమిషన్ వద్ద పార్టీ నమోదు వ్యవహారాన్ని సిరిసిల్లకు చెందిన న్యాయవాది మహేందర్‌రెడ్డి చూస్తున్నట్లు సమాచారం.  ఆ ప్రకియ వచ్చే నెల 9లోగానే పూర్తవుతుందని భావిస్తున్నారు. పేరు ఖరారయిన తర్వాత విడుదల చేసే జండా రంగులపై, ఈపాటికే కసరత్తు పూర్తి అయిందని సన్నిహితులు చెబుతున్నారు.

ఖమ్మంలో బహిరంసభ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్న సమయంలోనే, రఘునాధపాలెం మండలం శివాయిగూడెంలో వైఎస్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన వైనం, జిల్లాలో వైఎస్ అభిమానులలో మరింత పట్టుదలను పెంచింది. ఆ ఘటనపై షర్మిల కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాలు కూల్చినంత మాత్రాన, తెలంగాణ ప్రజల హృదయాల నుంచి వైఎస్‌ను తొలగించలేరని వ్యాఖ్యానించారు.  రాజన్న రాజ్యం కోసం తన పోరాటాన్ని చూసి  భయపడుతున్న పిరికిపందలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపించారు. షర్మిల ప్రయత్నాలను, ఆమె అభిమానుల ఉత్సాహానికి బ్రేకులు వేసేందుకే వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆమె అనుచరులు ఆరోపించారు. నిజానికి 2014లో జరిగిన ఎన్నికల్లో,   తెలంగాణలో ఖమ్మం జిల్లాలోనే వైసీపీ ఎక్కువ ఫలితాలు సాధించింది. ఖమ్మం ఎంపీగా పోటీచేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఖమ్మం జిల్లా నుంచే విజయం సాధించారు. ఈ కారణంతోనే ఆమె తన పార్టీ ప్రకటనకు ఖమ్మం జిల్లాను వేదికగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.

అన్ని ఇబ్బందులు ఎదుర్కొని, 9వ తేదీన దాదాపు 2 లక్షల మందిని సమీకరించేందుకు షర్మిల అనుచరులు ఈపాటికే అన్ని ఏర్పాట్లు చేశారు. గిరిజన ప్రాంతాల నుంచి షర్మిల సభకు వస్తామన్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆమె అనుచరులు చెబుతున్నారు. అయితే ఈలోగా క రోనా తీవ్రత మళ్లీ పెరుగుతుండటం, షర్మిల అనుచరులను నిరాశ పరుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. హాస్టళ్లు, గురుకులాలను సైతం మూసేస్తున్నట్లు ప్రకటించడంతో, విద్యార్ధులు తమ ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరోవైపు గాంధీ ఆసుపత్రికి మళ్లీ కరోనా కేసుల తాకిడి పెరుగుతోంది. సోమవారం నాటికి గాంధీలో 55 మంది వెంటిలేటర్ కింద చికిత్స పొందుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. దీనితో అప్రమత్తమయిన వైద్యశాఖ, మరో రెండు నెలలకు సరిపడే మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించింది. అంటే తెలంగాణలో కరోనా తీవ్రత ఎంత ఆందోళనకరంగా ఉందో స్పష్టమవుతోంది.

దీనితోపాటు ఖమ్మం సరిహద్దు రాష్ట్రమైన చత్తీస్‌ఘడ్, ఏపీలలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇది షర్మిల బహిరంగ సభ సక్సెస్‌పై మరిన్ని అనుమానాలకు కారణమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో ఇప్పటికి 20కి పైగా కేసులు నమోదయినట్లు చెబుతున్నా, ఆ సంఖ్య ఇంకా ఎక్కువేనంటున్నారు. దీనితో హడలిపోతున్న గ్రామ ప్రజలు.. గత ఏడాది ప్రారంభంలో మాదిరిగానే,  తమ గ్రామాల్లో స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. దీనికితోడు వైద్యశాఖ కూడా రోజూ ప్రజలను అప్రమత్తం చేస్తుండటంతో, లాక్‌డౌన్ విధించుకునే గ్రామాల సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, ఎన్ని రవాణా సౌకర్యం కల్పించినప్పటికీ గ్రామాల నుంచి షర్మిల సభకు వచ్చే అవకాశాలు తక్కువే.

ఈ నేపథ్యంలో ఖమ్మంలో షర్మిల సభ విజయం కావడం సందేహంగానే కనిపిస్తోంది. ఒకవేళ అప్పటికి కేసుల తీవ్రత- పోలీసుల ఆంక్షలు  మరింత పెరిగితే.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే,  ఏదైనా ఇండోర్ ఆడిటోరియంలో వేదిక మార్చుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది.