ధనిక రాష్ట్రమైన తెలంగాణ వ్యాక్సినేషన్ లో ఎందుకు వెనుకబడింది

478
  • తెలంగాణ ప్రజలకు వ్యాక్సిన్ అదించాలానే చిత్తశుద్ధి కేసీఆర్ ప్రభుత్వానికి ఉందా?
  • వ్యాక్సిన్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉందా ?
  • వ్యాక్సినేషన్ లో తెలంగాణ ఎందుకు వెనకబడిందో కేసీఆర్ సమాధానం చెప్పాలి
  • కేసీఆర్ సోమరితం వదులుకోవాలి.. తప్పుడు లెక్కలు మానుకోవాలి  
  • వంద శాతం ఆక్యుపెన్సీతో కరోనా ఎలా కట్టడి అవుతుందో తలసాని చెప్పాలి
  • బస్తీ దవాఖానాలని వ్యాక్సిన్ కేంద్రాలుగా మార్చాలి
  • అందరికీ ఉచిత  వ్యాక్సిన్ అందే వరకూ ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి

‘’రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు వుంది’’ అని విమర్శించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. ఒకపక్క కోవిడ్ సెకెండ్ వేవ్ ముంచుకొస్తుంటే కేసీఆర్ మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టకుండా అలసత్వం వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు దాసోజు.
‘కేసీఆర్ ప్రభుత్వం చెబుతున్న గణాంకాల ప్రకారం జనవరి 16 నుండి ఇప్పటివరకూ కేవలం 9,43,921 మందికి మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. మరి నాలుగు కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ అందేది ఎప్పుడు ? అసలు తెలంగాణ ప్రజలకు వ్యాక్సిన్ అదించాలానే చిత్తశుద్ధి కేసీఆర్ ప్రభుత్వానికి ఉందా ? వ్యాక్సిన్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఒక లక్ష్యం అంటూ ఉందా ?  అని  ప్రశ్నించారు డా. దాసోజు శ్రవణ్

‘’కేసీఆర్ ప్రభుత్వం కరోనా కేసులపై చావులపై మొదటి నుండి తప్పుడు లెక్కలు ఇచ్చింది. తాజాగా భారత ప్రభుత్వం , తెలంగాణలో 17.7శాతం వ్యాక్సిన్ వృధా అవుతుందని నివేదిక ఇచ్చింది. కానీ ఇక్కడ అధికారులు చాలా కష్టపడి తప్పుని కప్పిపుచ్చుకునే విధంగా 0.7 శాతమే వృధా అవుతుందని చెబుతున్నారు. కేంద్ర 17.7శాతం అని నివేదిక ఇచ్చింది. ఇక్కడ మాత్రం 0.7 శాతమే అంటున్నారు. అసలు లెక్కలు ఏంటి ? ఇంత అస్థిరమైన లెక్కలు ఎందుకంటే .. కరోనా కట్టడి విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అలసత్వాన్ని కప్పిపుచ్చుకునే తప్పుడు లెక్కల ప్రహసనం ఇదంతా అని ‘’ ఆరోపించారు దాసోజు.

‘’కేసీఆర్ కి ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు. కేవలం  తన చిల్లర రాజకీయాల కోసమే ఆయన పని చేస్తున్నారు. భారత ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం దేశంలో 5కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు .5 కోట్లలో 60 శాతం వ్యాక్సిన్ 8 రాష్ట్రాల్లో పూర్తయిపోయింది. కేరళ, మధ్య ప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాళ్ , గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్. రాష్ట్రాన్ని గొప్పగా పాలిస్తున్నామని జెబ్బలు చరుచుకుంటున్న కేసీఆర్, కేటీఆర్ లు దీనికి ఏం సమాధానం చెబుతారు. ఈ లిస్టులో తెలంగాణ పేరు ఎందుకు లేదు. మనకంటే అధికార యంత్రాంగం తక్కువ వున్న రాజస్తాన్ లో 4752984 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. మహారాష్ట్ర 4743837 , ఉత్తర ప్రదేశ్ 4653705, గుజరాత్ 4186858, వెస్ట్ బెంగాళ్ 4125209, కర్ణాటక 2846344, మధ్య ప్రదేశ్ 2666064, కేరళ 2558544 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు . కానీ గొప్ప పాలన అని భుజం చరుచుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకూ ఇచ్చిన వ్యాక్సిన్ ఎంత అంటే కేవలం 9,43,921 మాత్రమే. దయచేసి కేసీఆర్ మీ సోమరితనం నుండి బయటికి రావాలి. మీకు ఇష్టమైనప్పుడు రివ్యూ చేస్తే కరోనా ఆగదు. కరోనా సెకెండ్ వేవ్ ఉదృతంగా ముంచుకొస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఒక మూడు రోజులు ప్రభుత్వం పనులన్నీ పక్కన పెట్టి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందే వరకూ ఒక స్పెషల్ డ్రైవ్ చేపడదాం.  ప్రతి బస్తీ దావఖానని వ్యాక్సినేషన్ కేంద్రంగా మార్చుదాం. పెద్దపెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్ లోనే కాకుండా చిన్న హాస్పిటల్స్ లో కూడా కరోనా వ్యాక్సిన్ ని అందుబాటులో ఉండేట్లు ఏర్పాట్లు చేద్దాం’’ అని కోరారు దాసోజు.’స్కూల్స్ మూసేశారు. కానీ షాపులు, సినిమా హాళ్ళు మాత్రం నడుపుతామని అంటున్నారు. దీని వెనుక కూడా కుట్ర వుందని అనిపిస్తుంది. పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేయడానికి స్కూల్స్ ఓపెన్ చేసి మళ్ళీ మూసేశారని అనుమానం కలుగుతుంది. ఇలా కానీ పక్షంలో షాపులు, సినిమా థియేటర్లు కూడా క్లోజ్ చేయాలి కదా ? కనీసం యాభై శాతం ఆక్యుపెన్సీతో నైనా నడపాలి. కానీ వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపితే కరోనా ఎలా కట్టడి అవుతుందో మంత్రి తలసాని సమాధానం చెప్పాలి’’ అని సూటిగా ప్రశ్నించారు దాసోజు.

‘అసెంబ్లీ, సెక్రటరేట్, ఎమ్మార్వో ఆఫీస్ ,, ఇలా ఏ ప్రభుత్వ కార్యాలయానికి పోయినా చుక్క సానిటైజర్ కనిపించదు. శానిటైజేషన్, మాస్క్ కరోనా కట్టడి విషయంలో ఒక మూల సూత్రమైనపుడు ప్రభుత్వాలే వీటిని విస్మరిస్తే ఎలా ? దీనిపై సీరియస్ గా చర్యలు తీసుకోవాలి. రద్దీగా వున్న ప్రదేశాల్లో ఖచ్చితంగా కరోనా నిబంధనలు అమలు చేయాలి.’’ అని కోరారు దాసోజు.‘’పక్కనే వున్న తమిళనాడు రాష్ట్రంలో ఇంట్లోకి వెళ్లి మరీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వానికి కనీస స్పృహ లేదు. రాష్ట్రంలో చాలా ఇళ్ళల్లో వృద్దులు వున్నారు. వాళ్ళు అందరూ హాస్పిటల్ లోకి పోలేరు కాబట్టి ఇళ్ళ దగ్గరికి వచ్చి వ్యాక్సినేషన్ చేయాలి. బస్తీ దవాఖానాలని వ్యాక్సిన్ కేంద్రాలుగా మార్చాలి. స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ ని చేపట్టాలి. అలాగే వ్యాక్సిన్ విషయంలో మిగతా ఎనిమిది రాష్ట్రాల కంటే తెలంగాణ ఎందుకు వెనకబడిందో కూడా కేసీఆర్ సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు దాసోజు శ్రవణ్.