రాంమాధవ్.. పీఛే‘మూడ్’!

965

బీజేపీ నుంచి మళ్లీ సంఘ్‌కు
మోదీ-షాతో సర్దుబాటు సమస్యే కారణమా?
కీలకనేత భాగయ్యకు స్థానంపై విస్మయం
                          ( మార్తి సుబ్రహ్మణ్యం)

బీజేపీలో గత కొద్దినెలల వరకూ ఒక వెలుగు వెలిగిన అగ్రనేత, ఆ పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్ ప్రస్థానం బీజేపీలో ఇక ముగిసినట్లే. ఆయన పార్టీ నుంచి తిరిగి తన మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌కు వచ్చేశారు. అసలు సంఘ్ నుంచి బీజేపీకి వెళ్లిన రాంమాధవ్, తిరిగి వెనక్కిరావడం చర్చనీయాంశమయింది. గతంలో ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరించిన ఆయన, బీజేపీకి వెళ్లిన విషయం తెలిసిందే.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఒక వెలుగు వెలిగిన రాంమాధవ్‌కు, తొలుత ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధాని విదేశీ పర్యటనకు ముందు, రాంమాధవ్ ముందస్తు పర్యటన చేసేవారు. ప్రధాని పర్యటన తర్వాత మళ్లీ ఆ దేశాలకు వెళ్లి వచ్చేవారంటే, ఆయనకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో స్పష్టమవుతోంది. అయితే, ఆ తర్వాత ఆయనను ఈశాన్య రాష్ట్రాలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించిన తర్వాతే, సమీకరణల్లో మార్పులు వచ్చాయన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అక్కడ ఆయనపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయన్నది పార్టీలో వినిపించే విమర్శలు. పార్టీలో ‘హైఫై లీడర్’గా పేరున్న రాంమాధవ్ కరుణాకటాక్ష వీక్షణాల కోసం, తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు పోటీ పడేవారు.

ఆ తర్వాతనే మోదీ-అమిత్‌షా ఆయన ప్రాధాన్యం తగ్గించారంటున్నారు. నిజానికి ఆయనకు రాజ్యసభ ఇచ్చి, కేంద్రమంత్రిని చేస్తారన్న వార్తలు కూడా అప్పట్లో వినిపించాయి. ప్రధానంగా  ఈసారి అధ్యక్ష పదవికి పోటీకి వస్తారన్న ముందు జాగ్రత్తతోనే, రాంమాధవ్‌కు ఈసారి జాతీయ కమిటీలో స్థానం లేకుండా చేయడం ద్వారా, వ్యూహాత్మకంగా పక్కనబెట్టారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనితో గత నాలుగు నెలల క్రితమే తాను తిరిగి సంఘ్‌కు వెళ్లిపోతానని, రాంమాధవ్ నాయకత్వాన్ని కోరినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

రాంమాధవ్ తిరిగి సంఘ్‌కు  వచ్చేందుకు అదే ప్రధాన కారణమని తెలుస్తోంది. అయితే, ఆయనకు 12 మంది ఉన్న సంఘ్ కమిటీలో కోర్ కమిటీ సభ్యుడిగా స్థానం లభించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఆయన స్థాయిని తగ్గించారని కొందరు, కోర్‌కమిటీలో ఒకరిగా నియమించినందున ప్రాధాన్యం ఇచ్చినట్లేనని మరికొందరు విశ్లేషిస్తున్నారు. సంఘ్ నుంచి పార్టీకి, పార్టీ నుంచి సంఘ్‌కు పంపించడం సాధారణమేనంటున్నారు.

ఇక గతంలో ఆర్‌ఎస్‌ఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీగా చక్రం తిప్పిన సీనియర్ నేత భాగయ్య ప్రాధాన్యం తగ్గించి, ఆయనను కేవలం కోర్ కమిటీ సభ్యుడిగానే పరిమితం చేయడం చర్చనీయాంశమయింది. తెలంగాణకు చెందిన భాగయ్య వల్ల ఎంతోమందికి ఉన్నత పదవులుగా రాగా, మరెంతోమంది ఆయన వల్ల నష్టపోయారన్న వ్యాఖ్యలు, పార్టీ-సంఘ్ వర్గాల్లో చాలాకాలం నుంచి వినిపిస్తున్నవే. పురంధీశ్వరి, సోము వీర్రాజుతోపాటు మరికొందరు నేతలకు  పదవులు రావడం ఆయన చలవేనన్నది బహిరంగ రహస్యమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. తెలంగాణ బీజేపీ సంఘటనా ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌జీ దాదాపు 8 సంవత్సరాల నుంచి అదే పదవిలో కొనసాగేందుకు, భాగయ్య ఆశీస్సులే కారణమన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో చాలాకాలం నుంచీ వినిపిస్తున్నవే.

ఇక రాష్ట్ర విభజన సమయంలో కీలకపాత్ర పోషించిన భాగయ్యను.. కోల్‌కతా హెడ్‌క్వార్టర్‌కు పంపినప్పటికీ, తెలుగు రాష్ట్రాల వ్యవహారాల్లో తరచూ తలదూర్చుతుంటారన్న విమర్శలు పార్టీ-సంఘ్‌లో లేకపోలేదు. సంఘ్‌లో నోరున్న నాయకుడిగా పేరున్న ఆయన, ఒకవర్గానికి వ్యతిరేకి అన్న ముద్ర చాలాకాలం నుంచి ఉంది. తెలుగు రాష్ట్రాల వ్యవహారాల్లో .. సంఘ్ జాతీయ నాయకత్వం ప్రమేయం లేకుండా, సర్వం తానయి చక్రం తిప్పిన భాగయ్యను, వృద్ధాప్యం కారణంతో ప్రాధాన్యం తగ్గించి, ప్రస్తుత సంఘ్ కోర్‌కమిటీ సభ్యుడిగా నియమించారని చెబుతున్నారు. అయితే ఆయన వయసు 70 దాటినందున, పూర్తిగా తప్పిస్తారని భావించినప్పటికీ తిరిగి కార్యకారిణి (ఎగ్జిక్యూటివ్)లో తీసుకోవడంపై పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.