కె.సి.ఆర్..రంగారెడ్డి,వికారాబాద్ జిల్లాల రైతులను ఇంకెంతకాలం మోసం చేస్తారు?

583

మా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల రైతులను, ప్రజలను ఇంకెన్ని సార్లు, ఇంకెన్ని ఏండ్లు మోసం చేస్తవ్ కె.సి.ఆర్.? :- మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తుంది…ఇప్పటికీ మన రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు ఒక్క చుక్క సాగు నీరు ఇయ్యలేదు కె.సి.ఆర్.. మన రైతులకు పోయిన ఏడాది మృగశిర వరకు కాల్వల ద్వారా కృష్ణా నీళ్ళు ఇస్తానని మాటలు చెప్పి మోసం చేసిండు కె.సి.ఆర్..ప్రాజెక్టు పరిశీలన అని, సమీక్షలు అని, కోర్టు కేసులు అని అసంబద్ధమైన కారణాలు చెప్పుకుంట ఇప్పటిదాకా మనల్ని మోసం చేస్తూ వస్తున్నడు. ఆంధ్ర ప్రభుత్వం కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా మనకు దక్కకుండా తీసుకుపోతుంటే సప్పుడు చెయ్యలేదు. కనీసం కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డుకు మన హక్కులు తెలియజెయ్యలేని అసమర్థుడు కె.సి.ఆర్.. నిన్న పాలమూరు ఎత్తిపోతల పథకం సమీక్ష సమావేశం నిర్వహించిన కె.సి.ఆర్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రిని కానీ, ఇతర ప్రజా ప్రతినిధులను కానీ ఆ సమీక్షకు పిలువలేదు. దీని వెనుక ఉన్న ఆంతర్యం మనం అర్థం చేసుకోవాలి. ఎట్లైతే డా. బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సృజల స్రవంతి ప్రాజెక్టు ను కాళేశ్వరంగా మార్చి మన నొట్ల మన్ను కొట్టిండో అట్లనే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పేరు మార్చి పాలమూరు ఎత్తిపోతల పథకం అని చెప్పుతున్నడు…మల్లొక్కసారి మన రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలను పూర్తిగా ఎండబెట్టడానికి కుట్ర కుట్ర చేస్తున్నడు. మన జిల్లా మంత్రికి, ఎం.పి.కి, ఎమ్మెల్యేలకు కొంచమైనా బాధ్యత ఉంటే కె.సి.ఆర్. ఇచ్చిన సాగు నీరు హామీ ఏమైందని మన రైతుల కోసం ఎందుకు అడుగుతలేరు?

ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకొని SLBC ప్రాజెక్టు కొద్దిగా మిగిలిన పనిని పూర్తి చేస్తానని ఎలక్షన్ సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కొత్త నాటకానికి తెరలేపిండు. కానీ మోసానికి మారు పేరు అయిన కె.సి.ఆర్. మాటలు నమ్మడానికి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ ప్రజలు సిద్ధంగా లేరు.

కె.సి.ఆర్. చేస్తున్న మోసాన్ని చెప్పడానికి నేను మన ప్రాంత రైతాంగం కోసం తలపెట్టిన పాదయాత్రకు అనుమతి ఇయ్యలేదు. అప్పుడు నాతో పాటు చాలా మందిని అరెస్టు చేసిన్రు. ఆ తర్వాత లక్ష్మీదేవిపల్లి దగ్గర రిజర్వాయర్ కట్టాలని డిమాండ్ చేస్తూ బహిరంగ సభను నిర్వహించిన. అదే సభలో ఇచ్చిన హామీ ప్రకారం మా రైతులకు సాగు నీరు ఇస్తే కె.సి.ఆర్.కు గుడి కట్టిస్తా అని నేను చెప్పిన. ఇప్పుడు మొదటి మృగశిర దాటి మల్లా రెండో మృగశిర వచ్చే కాలం వచ్చింది. అసలు కె.సి.ఆర్. ఇచ్చిన వాగ్దానం ప్రకారం కాలువల ద్వారా సాగు నీరు కాదు కదా కనీసం టెండర్లు కూడా పిలువలేదు ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తియ్యలేదు. ఎందుకంటే…మన రైతులకు సాగు కోసం అవసరమైన నీళ్ళ ప్రాజెక్టులకు రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. కానీ మన రంగారెడ్డి జిల్లా వనరులను, మన ప్రజల పైసలను రాష్ట్ర ఖజానా నుండి దోచుకొని అధికారం అనుభవిస్తున్నడు.

నిన్న జరిగిన సమీక్షలో రానున్న డిసెంబరు వరకు కృష్ణా నది మీద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలని, అవసరమైన నిధులు ఇస్తామని అధికారులను ఆదేశించిండు కె.సి.ఆర్..నిన్నటి సమీక్ష మీద వెలువడిన ప్రకటనలో ఎక్కడా కూడా మన రంగారెడ్ది వికారాబాద్ జిల్లాల రైతులకు ఇచ్చిన హామీ గురించి ప్రస్తావించలేదు. ఇట్ల ఎన్ని సార్లు దొంగ మాటలు చెప్పి కె.సి.ఆర్. మనల్ని మోసం చేస్తడు ?

కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మాజీ ఎం.పి., చేవెళ్ల.