ముంబయిలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు

481

ముంబయి, మార్చి 21 (న్యూస్‌టైమ్): ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ బిల్డర్ డెవలపర్ గ్రూప్‌లో ఆదాయం పన్ను శాఖ సోదాలను నిర్వహించింది. వీటితోపాటు మొబైల్ ఉపకరణాలవ్యాపారం సాగిస్తున్న డీలర్లపై కూడా ఆదాయం పన్ను శాఖ సోదాలను నిర్వహించింది. ఆదాయపన్ను శాఖ అధికారులు ముంబయిలోని 29 ప్రాంతాలలో సోదాలను నిర్వహించి 14 ప్రాంతాలలో సర్వేలను చేపట్టారు. మొబైల్ ఉపకరణాల వ్యాపారాలు నిర్వహించడానికి ఈ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రత్యేకంగా 950 యూనిట్లతో ఒక మాల్ నిర్మాణాన్ని చేపట్టింది. వీటిలో 2017 నుంచి ఇంతవరకు 905 యూనిట్లను సంస్థ విక్రయించింది. సోదాలలో స్వాధీనం చేసుకున్నఒక పెన్ డ్రైవ్ ను అధికారులు పరిశీలించారు. పెన్ డ్రైవ్ లో సమాచారాన్ని పరిశీలించిన అధికారులు ఈ సంస్థ అంగీకరించిన మొత్తానికి మించి 150 కోట్ల రూపాయలను నగదు రసీదులు ఇచ్చి వసూలు చేసిందని గుర్తించారు. ఈ మొత్తాన్ని యూనిట్ల అమ్మకాల విలువగా ఖాతాలలో చూపించలేదు. ఇదేవిధంగా నివాస, వాణిజ్య ప్రాజెక్టుగా చేపట్టిన ప్రాజెక్టులో కూడా 70 కోట్ల రూపాయల మేరకు ఇటువంటి అక్రమ లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. డిజిటల్ పద్ధతిలో వివిధ ప్రాజెక్టులలో జారీచేసిన నగదు రసీదులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ ఉపకరణాల డీలర్లపై జరిపిన సోదాల్లో రికార్డులలో చూపకుండా అమ్మకాలు జరిగినట్టు తెలియజేసే రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకున్న సరుకులను ఈ సంస్థ దేశంలో వివిధ ప్రాంతాలలో వ్యాపారులకు విక్రయిస్తోంది. దిగుమతి చేసుకున్న వస్తువుల విలువను తక్కువగా చూపించడమే కాకుండా హవాలా రూపంలో చెల్లింపులు చేస్తునట్టు అధికారులు గుర్తించారు. రికార్డులలో చూపని వస్తువులను 13 గిడ్డంగుల్లో భద్రపరచినట్టు గుర్తించిన అధికారులు వీటిని స్వాధీనం చేసుకుని విలువను లెక్కకడుతున్నారు. ఈ డీలర్లు లెక్కల్లో చూపని ఆస్తుల్లో 40.5 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టినట్టు వెల్లడయింది. ఈ మొత్తంలో 21కోట్ల రూపాయలను మాల్ లో యూనిట్ల కొనుగోలు కోసం చెల్లించినట్టు గుర్తించారు. రిటైల్ వ్యాపారుల నుంచి చెల్లింపులను వసూలు చేయడానికి ఉద్యోగుల పేర్లతో నాలుగు ఖాతాలను సంస్థ ఉపయోగిస్తున్నదని అధికారులు గుర్తించారు. ఈ సంస్థ పేరుతో బ్యాంకుల్లో 80 కోట్ల రూపాయల డిపాజిట్లు వున్నాయి. రికార్డుల్లో చూపకుండా మొబైల్ ఉపకరణాల వ్యాపారం సాగుతున్నదని తనిఖీల్లో వెల్లడయింది. ముంబయి,చెన్నై రేవుల ద్వారా విలువను తక్కువగా చూపిస్తూ దిగుమతి చేసుకుంటున్నారు. వీటి విలువను వీరు వి చాట్ యాప్ ద్వారా చెల్లిస్తున్నారు. ఫోరెన్సిక్ ను వుపయోగించి సేకరించిన వి చాట్ సందేశాలను విశ్లేషిస్తున్న అధికారులు చైనా నుంచి దిగుమతి అయిన వస్తువుల పరిమాణాన్ని వాటి విలువను లెక్క వేస్తున్నారు. ఇంతవరకు, ఈ సోదాల్లో లెక్కలు చూపని 5.89 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లెక్కల్లో చూపని ఆదాయం 270 కోట్ల రూపాయల వరకు వుంది. కేసును దర్యాప్తు అధికారులు లెక్కల్లో చూపని వస్తువుల విలువను మదింపు వేస్తున్నారు.