ఆమరణ దీక్షకు సిద్ధమైన కేఏపాల్?

314

కె.ఎ పాల్ అప్పుడప్పుడు సంచలన నిర్ణయాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా నిలుస్తారు. తాజాగా మరోసారి ఆయన సంచలన నిర్ణయం తీసుకన్నారు. ఎవరి ఊహకు అందని నిర్ణయం తీసుకుని సంచలనానికి తెరతీశారు. కేంద్రంపై మరో సారి నేరుగా పోరాటానికి సిద్ధమయ్యారు. మొన్నటి వరకు కేవలం ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ వచ్చిన ఆయన.. ఇప్పుడు కేంద్రంపై పోరాటానికి సై అంటున్నారు.

2019 ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించిన ఆయన.. ఆ ఎన్నికల్లో ఘోరంగా భంగపడిన తరువాత.. ఏపీ రాజకీయాల నుంచి దూరమయ్యారు. మళ్లీ విదేశాలు వెళ్లి ఆయన పనుల్లో నిమగ్నమయ్యారు. అప్పుడప్పుడు ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తూ.. వార్తల్లో నిలిచే వారు. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దేశంలో సాగు చట్టాలకు, విశాఖ స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణకు నిరసనగా నిరవధిక ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21 నుంచి ఢిల్లీలో నిరవధిక ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ ప్రకటించారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను గురువారం ఆయన ఢిల్లీలో కలిసి సంఘీభావం తెలిపారు.

భారతీయ కిసాన్‌ యూనియన్‌ అధికార ప్రతినిధి రాకేశ్‌ తికాయత్‌ ను కేఏ పాల్ కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సాగుచట్టాలను తక్షణమే కేంద్రం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కేవలం సాగు చట్టాలమీదే కాదు. అలాగే విశాఖ స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు దాఖలు చేసినట్లు కేఏ పాల్ చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు, రైతులను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని ఆయన సెటైర్ఎ వేశారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు బీకేయూ రైతు నేత తికాయత్‌ తెలిపారు. విశాఖ ఉక్కు కార్మికులకు, ప్రజలకు తాము అండగా నిలుస్తామని తికాయత్ హామీ ఇచ్చారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే దాకా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తేలేదని తికాయత్‌ హెచ్చరించారు.

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా విశాఖ ఉక్కు ఉద్యమం తీవ్ర స్థాయిలో ఎగసిపడుతోంది. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చిన కార్మికులు రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కు తీసుకునే వరకు పోరాటం నుంచి వెనక్కు తగ్గమని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉక్కు పరిరక్షణ సమితోతో కలిసి వివిధ కార్మిక సంఘాలు ఈ నెల 26న భారత్ బంద్ కు పిలుపు ఇచ్చాయి.. విశాఖలోనే కాదు ఏపీ వ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై పెద్ద ఎత్తున రగడ జరుగుతోంది. కార్మికులు ఇప్పటికే బయటకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఏపీలో అధికార పార్టీతో సహా విపక్షాలు.. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నా కేంద్రం మాత్రం వెనక్కు తగ్గడం లేదు. స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని పదే పదే ప్రకటనలు చేస్తోంది. వంద శాతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదంటున్నారు. దీంతో ఉద్యమం తారా స్థాయికి చేరింది. తాజాగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీ కరణపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 21 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.