రాష్ట్ర సర్వతోముఖాభివృద్దే లక్ష్యం

241

హైదరాబాద్, మార్చి 19 (న్యూస్‌టైమ్): ప్రజా సంక్షేమం, అన్ని రంగాలలో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలుగా 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. కరోనా, లాక్‌డౌన్‌‌ల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై తీవ్ర ప్రభావం పడినప్పటికీ, ప్రజా సంక్షేమం, వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యం, మౌలిక వసతుల రంగాలకు, హోం శాఖకు ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేశారని హోం మంత్రి అన్నారు. వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ద‌ళిత ఎంప‌వ‌ర్‌మెంట్ ప్రోగ్రామ్, వ్యవసాయ యాంత్రీకరణ కోసం 1500 కోట్లు, భూ సమగ్ర సర్వే కోసం 400 కోట్లు, షాదీ ముబారక్ , కళ్యాణ లక్ష్మికి 2750 కోట్లు, మెట్రో రైల్ ప్రాజెక్టుకు 1000 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్ కోసం 750 కోట్లు ఇలా అన్ని రంగాలకు, పథకాలకు భారీగా నిధులు కేటాయించ‌డం ప‌ట్ల మంత్రి సంతోషం వ్య‌క్తం చేశారు.

తన హోం శాఖకు 6,465 కోట్ల బ‌డ్జెట్ కేటాయింపులు చేసినందుకు ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావుకు, ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. దీనివల్ల, ప్రజలకు పోలీస్ సేవలు ఇంకా మెరుగ్గా అందించే వీలు కలుగుతుందని తెలిపారు.