కబుర్లు చెబితే కుదరదు: చంద్రబాబు

302

తిరుపతి ఉప ఎన్నికలో పార్టీ నేతలు తెగించి పోరాడాలని తెదేపా అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అలా తెగించి పోరాడేవాళ్లకే పార్టీలో గుర్తింపు ఉంటుందని తేల్చి చెప్పారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికలు జరిగేలోపు ఇదే పెద్ద ఉప ఎన్నికగా భావించాలని నేతలకు చెప్పారు. క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయకుండా కబుర్లు చెప్తే కుదరదని హెచ్చరించారు. వైకాపా వైఫల్యాలపై పది ముఖ్యమైన అంశాలు గుర్తించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు.

విధేయతలు, మోహమాటాలు ఇకపై చెల్లవని చంద్రబాబు తేల్చి చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నాయకుల క్షేత్రస్థాయి పనితీరుకు అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానించారు. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని 75 క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్‌కు ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఐదుగురు సభ్యులతో తిరుపతి ఉపఎన్నిక పర్యవేక్షణ కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు. కమిటీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్,  రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పనబాక కృష్ణయ్య, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్ సభ్యులుగా ఉన్నారు.