శ్రీరంగనీతులు ఎల్ల వేళలా పనిచేయవు!

783

రాజకీయాలు వ్యాపారమయిపోయాయని,  డబ్బులతోనే మిగతా పార్టీలు ఎన్నికలు చేస్తున్నాయన్నది బీజేపీ నేతలు నిత్యం వల్లించే శుభాషితాలు.   అయితే 2014 నుంచి  నిన్నటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో,  మిగిలిన పార్టీలతో సమానంగా ఖర్చు పెట్టిన ఇదే బీజేపీ,  ఈ నీతిసూత్రాలు వల్లించడమే విచిత్రం. కర్నాటక వంటి రాష్ట్రాల్లో  మిగిలిన పార్టీల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్న వాస్తవ పరిస్థితి. ఎలాంటి ప్యాకేజీల ఆశ లేకుండా విపక్ష ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నారంటే, నమ్మేంత అమాయకులెవరూ ఉండరు.

మరి మోడీ చరిష్మా ఏమయినట్లు?  ఏ రాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్రంలో  కేంద్రమే ఎక్కువ నిధులిచ్చిందని చెబుతున్న బీజేపీ నేతలు.. డబ్బులు తీయకుండా ఎందుకు ఓట్లు వేయించుకోలేకపోతున్నారన్నది ప్రశ్న. అంటే శ్రీరంగనీతులు ఎల్లవేళలా పనిచేయవని తెలుసుకోవాలి. స్వరం పెంచి, అవసరానికి మించి మాటలతో ఎదురుదాడి ఎల్లవేళలా పనికిరావు. సహనం కోల్పోతే ఎదురుదెబ్బలు.. ఇంకో చెంపదెబ్బలూ తప్పవు. అది ప్యానలిస్టుకయినా, ప్రజలకయినా!  ఇది గతంలో మహా మహా రాజకీయ పార్టీలు, నేతలకు నేర్పిన-నేర్చుకున్న  గుణపాఠం!  రాజకీయనేతలకు తోలుమందం అని ప్రధాని మోదీ సరాదాకు అన్నప్పటికీ, తాను కూడా అందుకు అతీతుడిని కాదని ఒప్పుకున్నట్లయింది.

ఇక బీజేపీ అగ్రనేతలే కథానాయకులుగా  సాగిన  ప్రచార పరంపరంలో, జరిపిన వ్యవహారాలు తెలిసి నివ్వెరపోయా. ఒక ఆశ్రమ వ్యవహారం, ప్రపంచానికి తెలియని బాబాల అక్రమాస్తుల విషయాల్లో.. కొంతమంది పార్టీ మీడియా పులులు,  తెరవెనుక నుంచి కథ నడిపించిన వైనం తిరుపతి వాసులకు పాతదే. అయినా, మీడియాలో కొత్తగా రావడమే నాలాంటి వారిని ఆశ్చర్యపరిచింది.  ఈడీ, ఐటి కేసుల నుంచి తప్పిస్తామని చెప్పి వారి నుంచి కోట్లు దండుకున్న వైనం చూస్తే, బీజేపీ చెప్పే నీతిసూత్రాలకు- ఆ పార్టీ నేతలు తెరవెనక ఉండి చేసే దందాలకు ఏమైనా పొంతన ఉందా? అనిపిస్తుంటుంది. ఇంత జరిగినా, తమ పార్టీ నేతలు అవినీతితో మలినమయ్యాయని తెలిసినా, ఆ పార్టీ నాయకత్వం ఇప్పటిదాకా ఎవరిపైనా చర్యలు తీసుకోవడమే ఆశ్చర్యం. ఈ సందర్భంగా బీజేపీలో నా సస్పెన్షన్‌కు ముందు నాటి వ్యవహారాన్ని ప్రస్తావించాలి.

అప్పట్లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నాలక్ష్మీనారాయణకు,  అమరావతికి అనుకూలంగా మాట్లాడేందుకు  చంద్రబాబు 20 కోట్లు ఇచ్చారని వైసీపీ పార్లమెంటరీపార్టీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. అందుకు ఎంపి సుజనాచౌదరి మధ్యవర్తిత్వం వహించారన్నది ఆయన మరో ఆరోపణ. ‘నేను చేసిన ఆరోపణపై సీనియర్లు మాట్లాడకుండా కన్నా ఒక్కరే మాట్లాడటానికి కారణం ముట్టిన డబ్బే. ఇది అక్షర సత్యం. కావాలంటే కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి సిద్ధం అని విజయసాయి దాదాపు వారం రోజులు సవాళ్లు, కన్నా ప్రతిసవాళ్లు  విసిసిన రోజులవి. అయినా బీజేపీలో ఇప్పుడున్న దిగ్రేట్ జీవీఎల్ గానీ, సోము వీర్రాజు గానీ, విష్ణువర్దన్‌రెడ్డి గానీ, చివరకు ఇన్చార్జి సునీల్ దియోధర్ కూడా ఖండించని విచిత్ర పరిస్థితి.

అంతకముందే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా సమక్షంలో బీజేపీలో చేరిన నేను, బీజేపీ సిద్ధాంతాలన్నీ సత్యాలన్న భావనలో ఉన్నా. అయితే, విజయసాయిరెడ్డి నాకు మిత్రుడయినప్పటికీ,  కన్నాను విమర్శించినందుకు పార్టీ నేతగా,  విజయసాయిరెడ్డిని ఘూటుగా విమర్శిస్తూ ‘ఆంధ్రజ్యోతి’లో వ్యాసం రాశా. దానివల్ల ఒక చిరకాల మిత్రుడిని శత్రువుని చేసుకోవలసి వచ్చింది. అప్పుడు పార్టీ ముఖ్యనేతలంతా మౌనంగా ఉండటం బట్టి, అంతా తేలుకుట్టిన దొంగలేనని ఇటీవల జరిగిన ఆశ్రమ వ్యవహారాలతో బయపడ్డట్టయింది. అది కూడా ఆలస్యంగా!  కానీ అప్పటికే నాకు జరగవలసిన నష్టం జరిగిపోయింది. అప్పుడు జరిగిన పొరపాటుకు ఇప్పటికీ చింతిస్తూనే ఉన్నా.
ఇద్దరు బీజేపీ అగ్రనేతలు వివిధ ఘటనలో మృతి చెందినా.. వ్యవసాయ బిల్లుల నేపథ్యంలో దాదాపు 120 మంది ైరె తులు చనిపోయినా,  పాపం మోదీ గారికి ఒక్క  కన్నీటి  చుక్క  రాలలేదు.

అంతకుముందుకరోనా కాలంలో వలస కూలీలు వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించినా చుక్క కన్నీరు రాలేదు. కానీ సీఏఏ, త్రిబుల్ తలాక్ వంటి బిల్లుల చర్చలో,  బీజేపీ వైఖరిని తూర్పారపట్టిన కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీ ఆజాద్ వీడ్కోలు సభలో మాత్రం,  మోదీగారు దు:ఖం ఆపుకోలేకపోవడమే దేశాన్నే కాదు, కరుడుకట్టిన బీజేపీ వారినీ  ఆశ్చర్యపరిచింది.

దాదాపు వందేళ్ల చరిత్ర ఉన్న గోద్రెజ్ , విప్రో వంటి సంస్థలు ఆహారోత్పత్తుల్లో అగ్రగామిగా ఉండేవి. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉనికిలోకి వచ్చిన, రాందేవ్‌బాబా కంపెనీ పతంజలి లక్షల్లో టర్నోవర్ చేరువకు ఎలా వచ్చిందో అంతుబట్టని విషయం. ఒక యోగా శిక్షణ కోసం మొదలుపెట్టిన బాబా  వ్యాపార సామ్రాజ్యం కోసం,   ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న కంపెనీలను పాలకులు విగతజీవులుగా మార్చడమే విషాదం. దేశభక్తి, దేశీయం, త్యాగం  వంటి పదాలు వాడే రాందేవ్‌బాబా, ఇటీవలి కరోనా బాధితులకు నయాపైసా విదిలించిన దాఖలాలు లేవు.  వలస కార్మికులకు ఒక ఆయుర్వేద మంచినీటి బాటిల్ ఇచ్చిన పాపాన పోలేదు. అదే విలన్ పాత్రలు వేసే సోనూ,  తన ఆస్తులు తాకట్టు పెట్టి మరీ వలస కార్మికులను ఆదుకున్నారు. మరి దేశభక్తి కబుర్లు చెప్పే రాందేవ్ గొప్పవాడా? కరోనా కష్టాలతో చలించి కూలీలను ఆదుకున్న సోదూ గొప్పవాడా? కాబట్టి బీజేపీ భక్తజనం చెప్పే మాటలకు, చేతలకూ ఎలాంటి పొంతన లేదన్నది నిష్ఠుర నిజం.

– ఓ.వి.రమణ
(టిటిడి బోర్డు మాజీ సభ్యుడు, జనతాదళ్ జాతీయ మాజీ అధికార ప్రతినిధి)