బాధ్యత పెరిగింది….ప్రజలే దైవం..!!!

638

ప్రజలను నమ్ముకుని పాలన చేస్తే, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాజకీయం చేస్తే, ఇచ్చిన మాట తప్పకుండా మేనిఫెస్టో అమలు చేస్తే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తే అర్ధమవుతుంది. ప్రజలు ఓట్లు వేసి అధికారమిచ్చేది ఆ అధికారాన్ని అనుభవించడానికి కాదు, వారి బాగోగులు చూసుకోవడానికే అని 22 నెలల పాలననలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి నిరూపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటీగా నెరవేర్చుకుంటూ వెళ్లారు. మేనిఫెస్టో మంత్రుల కార్యాలయాల్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. మేనిఫెస్టోనే తనకు భగవద్గీత, బైబిల్ , ఖురాన్‌ అని ప్రకటించి భారత రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారు. 22 నెలల పాలనలో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వారికి ప్రజలు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యవస్థలోని వ్యక్తుల కంటే ప్రజలే బలవంతులు.ఈ వాస్తవం చంద్రబాబు నాయుడికి ఈ జన్మకైనా బోధ పడుతుందో లేదో చూడాలి.

2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గాలి వాటమని చంద్రబాబు ఇప్పటి వరకు ప్రచారం చేస్తూ వచ్చారు. వైఎస్‌ఆర్‌ సీపీకి 151 సీట్లు, 22 లోక్ సభ సీట్లు ఇవ్వడం ప్రజల తప్పు అనేది చంద్రబాబు బలమైన వాదన. చంద్రబాబు వాదనే కాదు ఆయనను బలంగా బల పరిచే మీడియా వాదన కూడా ఇదే. ఈవీఎంలలో మోసం వలన 2019ఎన్నికల ఫలితాలు వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి అనుకూలంగా వచ్చాయని చంద్రబాబు తన మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయించారు. గ్రామ పంచాయతీలు, మునిసిపల్ , కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు తరువాత చంద్రబాబుకు మాట్లాడటానికి మాట లేకుండా పోయింది. పంచాయతీ ఎన్నికల్లో తమకు 40 శాతానికిపైగా పంచాయతీలు వచ్చాయని చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించుకున్నారు. దీనిని ఖండిస్తూ వైఎస్‌ఆర్‌ సీపీ తన సానుభూతిపరులైన అభ్యర్ధుల ఫొటోలు సహా వైబ్ సైట్‌లో పెట్టింది. కానీ..చంద్రబాబు మాత్రం తమకు పంచాయతీల్లో 40శాతం వచ్చాయని ప్రచారం చేసుకున్నారు తప్పితే వారి ఫొటోలను, పేర్లను బహిరంగ పరిచింది లేదు. ఈ డిజిటల్ యుగంలో కూడా ప్రజలను మోసం చేయాలనే చంద్రబాబు ఆలోచన చూస్తుంటే ఈయనకా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని అనిపించక మానదు..!!!.

స్థానిక ఎన్నికలకు ముందు అధికార పక్షంపై చంద్రబాబు కాలుదువ్వారు. ఎన్నికలకు పోవడానికి వైఎస్‌ఆర్ సీపీ భయపడుతుందన్నారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను చూస్కోని రంకెలు వేశారు. రంకెలు వేసిన చంద్రబాబు కొమ్ముల విరగదీసి మూలన కూర్చోపెట్టారు విజ్ఞులైన ఓటర్లు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీ మద్దతుదారులు 80శాతానికిపైగా పంచాయతీల్లో విజయకేతనం ఎగరేశారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో కూడా వైఎస్‌ఆర్‌ సీపీ తన బలాన్ని చాటుకుంది. కుప్పం నియోజకవర్గంలో 90శాతానికిపైగా పంచాయతీలను వైఎస్‌ఆర్‌ సీపీ గెల్చుకుని చంద్రబాబును పూర్తిగా రక్షణాత్మక ధోరణిలోకి నెట్టేసింది. ఫలితాలు తరువాత చంద్రబాబు హడావిడిగా కుప్పంలో పర్యటించారు అంటేనే ఆయనెంత డిఫెన్స్‌లో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. పంచాయతీ ఎన్నికల ఫలితాలను వాస్తవ దృష్టితో చూడటానికి చంద్రబాబుకు మనసు ఒప్పలేదు. ఓడిపోయి కూడా టపాసులు కాల్చుకున్న ఘనత టీడీపీ నేతలకే చెందుతుంది. మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలు పార్టీ గుర్తులు మీద జరిగాయి కాబట్టి సరిపోయింది కానీ..లేకపోతే కార్పొరేషన్, మునిసిపల్ ఎన్నికల ఫలితాలు తరువాత కూడా టపాసులు కాల్చమని చంద్రబాబు తన పార్టీ నేతలకు, కార్యకర్తలకు వాట్సాప్ మెస్సేజ్‌లు పంపించేవారు.

పంచాయతీ ఎన్నికల తరువాత వైఎస్ఆర్‌ సీపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రజలు తమ వైపే ఉన్నారనే నమ్మకం బలపడింది. పంచాయతీ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో కార్పొరేషన్‌, మునిసిపల్ ఎన్నికల రణరంగంలోకి దిగి టీడీపీని భూస్థాపితం చేశారు వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీకి 49.5 శాతం ఓట్లు వస్తే మునిసిపల్ ఎన్నికల్లో 52.63 శాతం ఓట్లు వచ్చాయి. సీఎంగా వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత 22 నెలలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ ఓటు శాతాన్ని కోల్పోకుండా పెంచుకోవడమంటే నిజంగా అద్భుతం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి వచ్చింది 23 అసెంబ్లీ సీట్లైనా ఓటింగ్ శాతం 39.17. కానీ..మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటింగ్ శాతం ఘోరంగా పడిపోయింది. మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల తరువాత టీడీపీ ఓటింగ్ శాతం 31 శాతానికి పడిపోయింది.

2019లో టీడీపీకి ఓటు వేసిన వారు కూడా 22 నెలలు తరువాత జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీకి ఓటేశారని రూడీ అవుతుంది. తెలుగు దేశం సీనియర్లు , క్యాడర్‌ బలంగా ఉన్నచోట కూడా టీడీపీ భారీగా ఓటు షేర్ కోల్పోయింది. ఈ 22 నెలల్లో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల్లోకి వెళ్లడంతోనే టీడీపీ ఓటు బ్యాంక్‌కు 10 శాతం గండిపడి..వైఎస్‌ఆర్‌ సీపీ ఓటు బ్యాంక్ పెరిగింది. ఇక..జనసేన 4.67శాతం, బీజేపీ 2.61 శాతం ఓట్లు గెల్చుకున్నాయి. జనసేన బలంగా ఉంటుందని అంచనా వేసిన గోదావరి జిల్లాల్లో కూడా బలం చూపించలేకపోయింది. కానీ..కొన్ని చోట్ల అంతర్గతంగా టీడీపీకి జనసేన సాయపడింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో రెండు పార్టీలు ఫలితాలు సాధించలేక స్థానిక యుద్ధంలో బొక్కబోర్లాపడ్డాయి. పవన్ కల్యాణ్ దేహం మాత్రమే బీజేపీతో ఉంటుంది ఆయన ఆత్మ చంద్రబాబుతోనే అనేది నిజం. చంద్రబాబు – పవన్ కల్యాణ్ నిజస్వరూపాలు చూసిన ఓటర్లు వైఎస్‌ఆర్‌ సీపీకి ఓట్లు వేసి అండగా నిలిచారు.

75 మునిసిపాలిటీల్లో 73 లో వైఎస్‌ఆర్‌ సీపీని గెలిపించారు. 11 కార్పొరేషన్ల ఫలితాలు ప్రకటిస్తే 11 చోట్ల వైఎస్‌ఆర్‌ సీపీ గెలిచింది. 11 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాల్లోని 2,742 వార్డులు ఉంటే.. ఏకగ్రీవాలతోసహా 2,265 వార్డుల్లో (82.6 %) వైఎస్‌ఆర్‌ సీపీ విజయ దుందుభి మోగించింది.

టీడీపీ కేవలం 348 డివిజన్లు, వార్డులకే ( 12.7 %) పరమితమైంది.

టీడీపీ స్థాపించిన తరువాత ఇంతటీ ఘోర పరాజయం చవిచూడలేదు.

ఇక..రాష్ట్రం మొత్తం ఎన్నికలు జరిగిన తీరు ఒక ఎత్తైతే విశాఖ, విజయవాడ, గుంటూరులను వైఎస్‌ఆర్‌ సీపీ, టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చంద్రబాబు నాయుడు ఎక్కడ మాట అక్కడ మాట్లాడారు. విజయవాడ, గుంటూరుల్లో ప్రజలను రెచ్చగొట్టారు. హైదరాబాద్, బెంగళూరుల్లో పాచి పనులు చేసుకుంటారా అని విజయవాడ వాసులను రెచ్చగొట్టారు. గుంటూరు ప్రజలను మీకు సిగ్గు ఉందా? సిగ్గు ఉంటే వైఎస్‌ఆర్‌ సీపీ జెండా పట్టుకోరు, ఓట్లు వేయరు అని రెచ్చగొట్టారు. కానీ..చంద్రబాబు రెచ్చగొడితే విజయవాడ, గుంటూరు ప్రజలు రెచ్చిపోలేదు. విజ్ఞతతో ఓటు వేశారు. చంద్రబాబుకు కర్రుకాల్చి వాత పెట్టారు. విజయవాడ కార్పొరేషన్‌లో 64 డివిజన్లు ఉంటే వైఎస్‌ఆర్‌ సీపీ 49 గెల్చుకుంది. గుంటూరు కార్పొరేషన్‌లో 57 డివిజన్లు ఉంటే వైఎస్‌ఆర్ సీపీ 44 చోట్ల విజయ దుందుభి మోగించింది. దీంతో..చంద్రబాబు నోటికి ప్రజలే తాళం వేసినట్లైంది. తమకు తమ అభివృద్ధితోపాటు రాష్ట్ర అభివృద్ధి కూడా ముఖ్యమని గుంటూరు, విజయవాడ వాసులు నినదించినట్లైంది. ఇక..విశాఖలోనూ వైఎస్ఆర్‌ సీపీ ఘన విజయం సాధించింది. విశాఖలోని 98 డివిజన్లలో వైఎస్‌ఆర్‌ సీపీ 58 గెల్చుకుంది. దీంతో..ప్రజలను రెచ్చగొట్టి ఓట్లను దండుకోవాలని చూసిన చంద్రబాబు కుట్రలు ఫలించకుండా పోయాయి.

మునిసిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల విజయంతో వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వం బాధ్యత మరింత పెరిగింది. ప్రజలను దైవంగా భావించిన పాలన చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి బాధ్యత మరింత పెరిగింది. ఇదే విషయాన్ని మంత్రులతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన నవరత్నాలు ఏపీలో నవశకానికి దారులు తెరుస్తున్నాయి. నాడు – నేడుతో స్కూళ్ల రూపురేఖలు మారిపోతున్నాయి. వాలంటీర్‌, గ్రామ సచివాలయ వ్యవస్థతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. రైతుల దగ్గర నుంచి నిమ్న కులాల వరకు అందరూ సంతోషంగా ఉన్నారు. డిఫాల్టర్లు, దళారుల జేబుల్లోకి కాకుండా ప్రజల జేబుల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. దీంతో ఏపీలో వ్యాపారం జోరందుకుంది.
స్ట్రీట్ వ్యాపారాలు పెరిగాయి. ప్రజల జేబుల్లో డబ్బులు ఉండటం వల్లనే జీఎస్టీ వసూళ్లలో సౌతిండియాలోనే ఏపీ ప్రధమ స్థానంలోకి వెళ్లింది. ఇవన్నీ అత్యంత క్రమశిక్షణతో ఆర్థిక వ్యవస్థ నడపడం వల్లనే సాధ్యమయింది.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారు అని భారత దేశం మొత్తం చూస్తుంది. ఈ రోజున ఏపీలో అమలవుతున్న పథకాలు పలు రాష్ట్రాలు అమలు చేయడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే దిశ యాక్ట్‌ను పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. వాలంటీర్‌, గ్రామ సచివాలయ వ్యవస్థ పలు రాష్ట్రాలు అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. రేషన్ డోర్‌ డెలివరీని అమలు చేస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జి తన మేనిఫెస్టోలో రేషన్ డోర్ డెలివరీ పథకాన్ని ప్రకటించింది. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పాలన తీరు, ఆయన నిర్ణయాలు ఏపీ ప్రజలనే కాదు, పలు రాష్ట్రాల సీఎంలను నేతల ప్రశంసలు అందుకుంటున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు ప్రపంచ స్థాయి మేధావుల మెప్పును పొందుతున్నాయి. ఈ సంక్షేమ పథకాలకు తోడు 2022 -23 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తైతే టీడీపీ భూస్థాపితం కావడం ఖాయం.

వై.వి. రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్