నోటా’ను జయించిన బీజేపీ!

428

తిరుపతి ఎన్నికల్లో పరపతి చూపేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

వరస పరాజయాలు, పోటీ చేసేందుకు అభ్యర్ధులు కూడా లేక కుమిలిపోతున్న కమలం పార్టీకి మున్సిపోల్స్‌లో వెల్లడయిన ఫలితాల విశ్లేషణ  ఒకింత ఊరటనిచ్చాయి. తరచూ తనను వెంటాడి వేటాడి వేధిస్తున్న  ‘నోటా’ను ఈసారి ఏపీ బీజేపీ జయించడం ఒకరకంగా అతిపెద్ద విజయమే. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మొత్తం లక్ష 14 వేల 364 ఓట్లు రాగా, నోటాకు 50 వేల 965  ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే బీజేపీకి 2.41 శాతం ఓట్లు రాగా, నోటాకు 1.07 శాతం ఓట్లు వచ్చాయి. అదే కార్పొరేషన్లలో బీజేపీకి 74,135 ఓట్లు లభించాయి.  మొత్తంగా బీజేపీకి వచ్చిన సీట్లు 9.  ఆ రకంగా బీజేపీ ఏ పార్టీపైనా అద్భుత విజయం సాధించకపోయినా, నోటాపై మాత్రం తిరుగులేని విజయం సాధించడం సోము వీర్రాజు నాయకత్వంలో సాధించిన అతిపెద్ద తొలి విజయంగానే భావించాలి.
అదే మిత్రపక్షమయిన జనసేనకు 2,21,705 ఓట్లతో 4.67 శాతం లభించాయి. మొత్తం 25 స్థానాలు గెలవడం ద్వారా, వైసీపీ-టీడీపీ తర్వాత మూడవ స్థానంలో నిలిచింది. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, నోటాను అధిగమించడం మంచి పరిణామమే. దీనికోసం కష్టించిన సోము వీర్రాజు నాయకత్వంలోని పార్టీని అభినందించాల్సిందే. నిజానికి ఇది సంబరాలు చేసుకోదగ్గ సందర్భమేనంటున్నారు.

అసలు మున్సిపోల్స్ ఫలితాలు వెలువడిన రోజు.. పార్టీ కార్యకర్తలు  రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్దకు బాణసంచాను, లారీలలో తరలించి సంబరాలు చేసుకోవాలని ఉత్సాహపడ్డారట.  తమ రాష్ట్ర నాయకత్వం ఆ స్థాయిలో కష్టపడి పనిచేసిన ఫలితం, తమకు అనుకూలంగానే వస్తుందన్నది వారి అంచనాట. జగనన్న సర్కారుపై అలుపెరగకుండా, ‘రాజీలేని’ పోరాటం చేస్తున్న తమ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు కృషి ఫలితంగా, బీజేపీనే అత్యధిక మున్సిపాలిటీ-కార్పొరేషన్లు  సాధిస్తుందన్న తిరుగులేని నమ్మకంతోనే,  కార్యకర్తలు ఆ పొద్దు సంబరాలకు సిద్ధమయ్యారట. కానీ వచ్చిన ఫలితాలు నిరాశపరిచినా, ‘నోటా’పై సాధించిన ‘అద్భుత విజయం’  తృప్తి మాత్రం వారికి దక్కింది.
మున్సిపల్ ఎన్నికల్లో తన ‘అద్భుత వ్యూహాలతో’.. ‘నోటా’ను అధిగమించిన బీజేపీ, రానున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో ఎవరితో పోటీ పడుతుందోనన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో మొదలయింది. మున్సిపల్ ఎన్నికల్లో.. తిరుపతి లోక్‌సభ పరిథిలోని, తిరుపతి కార్పొరేషన్‌లో బీజేపీ 2,546 జనసేన 231.. సూళ్లూరుపేట మున్సిపాలిటీలో బీజేపీ 874, వెంకటరిగి మున్సిపాలిటీలో బీజేపీ 41.. జనసేన 202 ఓట్లు  సాధించాయి. దీన్నిబట్టి.. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ ఎంతవరకూ పరపతి చూపిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. మున్సిపోల్స్ ముందు.. తిరుపతి ఎంపీ సీటు మాకే కావాలని పట్టుపట్టిన జనసేన, తాజా ఎన్నికల ఫలితాలు చూసి, ఉప ఎన్నిక బరి నుంచి తప్పించుకోవడం తెలివైన నిర్ణయమేనంటున్నారు.

తిరుపతిలో గెలిచిన బీజేపీ అభ్యర్ధి కేంద్రమంత్రి అవుతారని, ఆ పార్టీ రాష్ట్ర సహ ఇన్చార్జి సునీల్ దియోథర్ సగర్వంగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నామని అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా అంతే సగర్వంగా ప్రకటించారు. తిరుపతిలో కనిపించే అభివృద్ధి అంతా తమదే అన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అయితే, తిరుమలకు వచ్చినప్పుడు ‘తిరుపతి ప్రజలకు బైబిల్ పార్టీ కావాలా? భగవద్గీత పార్టీ కావాలా?’ అని ప్రశ్నించడం ద్వారా… కమలానికి క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేశారు. అసలు సునీల్ దియోథర్ అయితే.. తిరుపతి గెలిచేద్దామని చాలాకాలం నుంచి అక్కడ ఇల్లు కూడా బాడుగకు తీసుకున్నారట. ఉప ఎన్నిక కోసం రాష్ట్రంలోని కార్యకర్తలంతా తిరుపతి ప్రచారానికి, పెట్టెబేడాతో  తరలిరావాలని ఆయన ఇటీవల పిలుపునిచ్చారు.
కాబట్టి తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ,  అద్భుత మెజారిటీతో గెలిచే ఊపులోనే కనిపిస్తోందని ఆ పార్టీ నేతల ప్రకటనల బట్టి అర్ధమవుతోంది.  మున్సిపోల్స్‌లో ‘నోటా’పై సాధించిన అద్భుత విజయం ఊపులో ఉన్న బీజేపీ, ఇక.. పెద్ద పార్టీలనే అధిగమించాల్సి ఉంది. అయితే దానికి సోము వీర్రాజు-సునీల్‌దియోధర్ అండ్ కో వద్ద, బ్రహ్మాండమైన స్ట్రాటజీనే ఉందట. సోము తరచూ ‘మా స్ట్రాటజీలు మాకుంటాయి. అవన్నీ మీకు చెప్పేయాలా’? అని మీడియాను ప్రశ్నిస్తుంటారు.

మంచిదే. తిరుపతిలో గెలిచి పరపతి పెంచుకుంటే,  తమ పార్టీ నాయకత్వానికి కనీసం ఢిల్లీలో అపాయింట్‌మెంట్లయినా వస్తాయన్నది కమలదళాల కోరిక. అప్పుడెప్పుడో టీడీపీతో జతకట్టిన బీజేపీ అభ్యర్ధి వెంకటస్వామి గెలిచారు కాబట్టి, ఇప్పుడు కూడా అదే స్థాయి విజయం సాధిస్తామని బీజేపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పైగా ఇప్పుడు కేంద్రప్రభుత్వం విరివిగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నందున, బీజేపీ అభ్యర్ధి గెలవడం, గెలిచిన వెంటనే కేంద్రమంత్రి కావడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. శుభం!