కర్షకుడి కష్టం తీర్చేదెవరు నాయకా?

582

ఆంధ్ర ప్రదేశ్ లో   రైతుల బాధలు

కేంద్రం ప్రభుత్వం దొంగచాటుగా చేసిన నాలుగు సాగు చట్టాలతో రైతుల కంటే ఎక్కువ సాధారణ ప్రజలు నష్ట పోతారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి తన పాద యాత్రలో చేసిన వాగ్దానాలు, ఎన్నికల ప్రణాళికలోని అంశాలు అమలు చేస్తున్నారు. వీటితో పలు రంగాల ప్రజలతో పాటు రైతులకు వెసులుబాటు దొరుకుతోంది. అయితే ప్రభుత్వ యంత్రాగాల మధ్య సమన్వయ లోపం వల్ల రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో రైతులు బ్యాంకుల నుండి పంటల అప్పులు తీసుకున్నారు. బీమా సౌకర్యం పొందటానికి వాటిని పునరుద్ధరణ చేసుకోవాలి. దాని కోసం రైతులు తమ పంటతో ఫోటో దిగాలి. దాన్నిబ్యాంకులో బొటనవేలు గుర్తుతో లంకె చేయించుకోవాలి. కోవిడ్ కారణంగా ఈ ప్రక్రియలను తాత్కాలికంగా ఆపేశారు. కోవిడ్ కు ముందు బతుకుదెరువు కోసం రైతులు వలసలు పోయారు. కోవిడ్ లో కాలంలొ తిరిగొచ్చిన కొందరు స్వగ్రామాల్లో ఉన్నారు. కొందరు కూటికోసం మరో చోటికి వెళ్లారు. వీరికి పంటల బ్యాంకు లోన్ల సమాచారాలను స్వచ్ఛంద సేవకుల (వాలంటీర్ల) వ్యవస్థ అందజేయాలి. వాలంటీర్లు గ్రామ సచివాలయ ఉద్యోగులు పరస్పర సహకారంతో ఈ పని చేయాలి. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో రైతులకు ఈ సమాచారం అందలేదు. లోపాన్ని బాధ్యతా రహితంగా ఒకరిపై ఒకరు నెడుతున్నారు. ఫలితంగా రైతులు అప్పుల పునరుద్ధరణ చేసుకోలేక పంట నష్ట పరిహారం, బీమా సొమ్ము పొందలేక పోయారు.

రైతులు సచివాలయాల్లో విచారంగా వారు పంటతో ఫోటోలు ఇవ్వనందున, బొటనవేలు గుర్తులతో లంకె జరగనందున వారికి ఆ సౌకర్యాలు లభించవని సమాధానం చెప్పారు. వాలంటీర్లు తమకు ఆ సమాచారం ఇవ్వలేదని రైతుల అభియోగం. సచివాలయం నుండి ఆ సమాచారాన్ని రైతులకు అందజేయమన్న విషయం తమకు అందలేదని వాలంటీర్ల జవాబు. తప్పు రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ద్వారా జరిగింది. రైతులు నష్టపోయారు. ఇక్కడ వాలంటీర్ల ఇబ్బందులు గమనించాలి. వారి నియామకం క్రమ పద్దతి జీత భత్యాల ప్రాతిపదికన జరగలేదు. వీళ్ళు గౌరవ వేతన స్వచ్ఛంద సేవకులేనట. వీరికి నెలకు కేవలం రూ5,000 ల గౌరవ వేతనం మాత్రమే చెల్లిస్తారు. అది కూడా సకాలంలో చెల్లించడం లేదని, రోజు ఖర్చుల కోసం, తిండి కోసం ఇబ్బంది పడుతున్నామని వారి అభియోగం.

అర్ధాకలితో కోల్పోయిన నిబద్దత, వృత్తి శ్రద్ధలతో వారు విధులు నిర్వహించలేరు. రైతులకు అందించవలసిన సమాచారాన్ని సచివాలయ సిబ్బంది తమకు అందించినప్పుడే ఆపసోపాలతో అటూ ఇటుగా రైతులకు అందిస్తారు. వారంతకు వారుగా పలుమార్లు గ్రామ సచివాలయం చుట్టూ తిరిగి సమాచారాన్ని సేకరించే చొరవ చూపలేరు. తప్పెవరిది అన్నది ఇక్కడ చర్చనీయాంశం కాదు. రైతులకు జరిగిన నష్టంలో ప్రభుత్వ లోపాన్ని, బాధ్యతను అధికారులు గుర్తించాలి. రైతుల శ్రేయస్సు, సంక్షేమ దృష్టితో రైతులకు అప్పుల పునరుద్ధరణ, బీమా సౌకర్యాల అందుబాటుకు అవకాశం ఇవ్వాలి.

నేటి కేంద్ర ప్రభుత్వ పన్నుల విధానం కేంద్ర ఆదాయాన్ని పెంచింది. రాష్ట్రాల ఆదాయాలకు గండికొట్టింది. ప్రస్తుత ప్రభుత్వానికి సెస్సులు, సర్చార్జీలు ప్రధాన ఆదాయ వనరులు. మోదీ ప్రభుత్వంలో బలవంతపు విధింపులు ఎక్కువ. 2010-11లో ఈ ఆదాయం 10.4%, 2020-21లో 19.9%. ఈ విధానం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇది బ్రిటిష్ వలస ఆర్థిక విధానం. రాష్ట్రాలతో ఆదాయ పన్నులు పంచుకోవాలని రాజ్యాంగ అధికరణ 270, ఎక్సైజ్ డ్యూటీని పంచాలని అధికరణ 272 చెపుతాయి. బలవంతపు సెస్, సర్చార్జీలను రాష్ట్రాలకు పంచనక్కరలేదని అధికరణ 271 మినహాయింపు ఇచ్చింది. అదనపు విధింపులను కేంద్రం పూర్తిగా వాడలేద ని, వాటి నిర్ధారిత ప్రయోజనాలకు కాక ఇతరాలకు (ఈ ఇతర అవసరాల వివరాలు ప్రభుత్వం ప్రకటించలేదు) దారి మళ్ళించిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పలు మార్లు నివేదించింది.

2017లో వస్తుసేవల పన్నులు (జి.ఎస్.టి.) ప్రవేశ పెడుతూ అదనపు వడ్డింపులను ఎత్తివేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఎత్తేసిన వాటి కంటే ఎక్కువగా కొత్త వాటిని ప్రవేశ పెట్టింది. అందులో జి.ఎస్.టి. పరిహార సెస్, సాంఘిక సంక్షేమ సర్చార్జ్ విచిత్రమైనవి. అదనపు వడ్డింపులతో కేంద్రం రాష్ట్రాల పాలనా విధానాల్లో దూరింది. రాష్ట్రాల ఆదాయాలను గండికొట్టిన కేంద్రం ఆర్డినెన్స్ తో తన ఖర్చులను, రక్షణరంగ వ్యయాన్ని రాష్ట్రాలపై రుద్దింది. రాష్ట్రాలకు ఖర్చులు, ఆర్థిక బాధ్యతలు ఎక్కువ. కేంద్రం నిధుల పంపిణి నిరాకరించడంతో రాష్ట్రాలకు బాధ్యతల నిర్వహణ ఇబ్బందులు కలుగుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల అసమానతలు పెరుగుతాయి. జి.ఎస్.టి. అమలు తర్వాత రాష్ట్రాల ఆదాయాలు తగ్గాయి. జి.ఎస్.టి.తో ఆదాయ పెరుగుదల వ్యత్యాసాలను భర్తీ చేస్తానన్న కేంద్రం రాష్ట్రాలకు మొండిచేయి చూపింది. కేంద్రం తగ్గించిన కార్పొరేట్ పన్నుల కారణాన రూ65,000 కోట్ల రాష్ట్రాల వాటా తగ్గింది. ఆర్థిక బాధ్యత-బడ్జెట్ నిర్వహణ చట్టం రాష్ట్రాల ద్రవ్యలోటుపై పరిమితులు విధించింది.

ఫలితంగా రాష్ట్రాలు అనివార్య ఖర్చులు కూడా పెట్టలేవు. కోవిడ్ మహమ్మారి వల్ల రాష్ట్రాల ఆదాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఖర్చులు పెరిగాయి. యుపిఎ హయాం కంటే బిజెపి పాలనలో కార్పొరేట్, ఎక్సైజ్, కస్టమ్స్ పన్నులు తగ్గాయి. ఇతర పన్నులు పెరిగాయి. 2021-22 బడ్జెట్ లో కేంద్ర జి.ఎస్.టి. ఆదాయం రూ5.8 లక్షల కోట్లు. జి.ఎస్.టి. పరిహార సెస్ ఆదాయం రూ1,10,500 కోట్లు.

నేటి నేపథ్యంలో రాష్ట్రాలకు అదనపు ఆదాయాలు అవసరం. కేంద్రం రాష్ట్రాల ఆదాయాలకు గండికొట్టే విధానాలు ఆపాలి. రాష్ట్రాల ఆసక్తులను కాపాడాలి. రెండేళ్ళు దాటిన సెస్సులు, సర్చార్జీలను రాష్ట్రాలకు పంచాలి. 1983లో సర్కారియా కమిషన్ సిఫారసు ప్రకారం కొత్త సెస్సులు, సర్చార్జీలను పరిమిత కాలానికి మాత్రమే విధించాలి. రాష్ట్రాల నిధులకు గండి కొట్టే రాజ్యాంగ అధికరణ 271ను సవరించాలి. మన రాష్ట్రానికి కేంద్రం నుండి రావలసిన పన్నుల, ఆదాయాల వాటాలను సంపాదిస్తే రాష్ట్ర ఆర్థిక వనరుల కొరత తీరుతుంది. అన్నదాతలను ఆదుకునే అవకాశం పెరుగుతుంది.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి,
ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి