ఏపీలో వృద్ధులకు సాయం ఎంత?

275

నెల్లూరు, న్యూఢిల్లీ, మార్చి 17 (న్యూస్‌టైమ్): రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకం కింద దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని వృద్ధులకు ఏ విధంగా సహాయం అందించారని నెల్లూరు లోక్‌సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్లో ప్రశ్నించారు. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు వీల్ చైర్లు, కళ్ళద్దాలు, చెవి మిషన్లు ఏ మేరకు అందించారని, ఆ వివరాలను తెలపాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద అందించిన సాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించినది ఎంత అని కూడా ప్రశ్నించారు. దీనికి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి రతన్లాల్ కటారియా రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

దేశవ్యాప్తంగా రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకం కింద 175 శిబిరాలను నిర్వహించి, 1,64,888 మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్లో 2017-18 ఆర్థిక సంవత్సరంలో రెండు శిబిరాలను నిర్వహించి 2,720 మంది సీనియర్ సిటిజన్లకు 109. 93 లక్షల రూపాయల మేరకు పరికరాలను అందించి సహాయపడినట్లు తెలిపారు. 2018-19లో 3 శిబిరాలను నిర్వహించి 2,676 మంది వయోవృద్ధులకు 156.75 లక్షల రూపాయల మేరకు పరికరాలను అందించి సాయపడినట్లు పేర్కొన్నారు.