సత్తాచాటుకున్న ‘తిప్పల’

416

విశాఖపట్నం, మార్చి 17 (న్యూస్‌టైమ్): గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సాధారణ ఎన్నికలలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ అనుకున్నట్లే సత్తాచాటుకుంది. మరీ ముఖ్యంగా గాజువాక జోన్ పరిధిలో వైసీపీకి స్పష్టమైన ఆధిక్యత కనబర్చడంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వ్యూహం ఫలించిందనే చెప్పాలి. అనకాపల్లి, భీమునిపట్నం పురపాలక సంఘాలు విలీనమయ్యాక జీవీఎంసీ వార్డుల సంఖ్య 98కి చేరిన విషయం తెలిసిందే. వైసీపీ కైవలం చేసుకున్న 59 వార్డుల్లో గాజువాక జోన్ పరిధిలోవే అధికం కావడం విశేషం. నాగిరెడ్డి తన కోడలు ఎమిలీ జ్వాల స్థానాన్ని కోల్పోయినప్పటికీ కచ్చితంగా తను గెలుస్తారనుకున్న వారికి మాత్రమే టికెట్లు ఇచ్చి చివరికి విజయతీరాలకు తీసుకువెళ్లారు. కొన్ని వార్డుల్లో రెబల్స్ బెడద ఉన్నప్పటికీ పార్టీ టికెట్‌పై పోటీచేసిన వారి విజయమే లక్ష్యంగా నాగిరెడ్డి, ఆయన ఇద్దరు కుమారులు (దేవన్‌రెడ్డి, వంశీరెడ్డి) పనిచేశారు. రాజకీయాలకు పూర్తి కొత్త అయిన బొడ్డు నరసింహపాత్రుడు (కేబుల్ మూర్తి-65వ వార్డు), మహ్మద్ ఇమ్రాన్ (66వ వార్డు) నుంచి ఈజీగా గెలిపించిన చతురత నాగిరెడ్డిది. పార్టీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా ఆయన తన వ్యూహాలకు పదునుపెట్టారన్నది అర్ధమవుతోంది. వయోభారం దృష్ట్యా తను వార్డుల్లో ఇదివరకటంత ఉత్సాహంగా పర్యటించలేని పరిస్థితిలో కూడా ఆయన తన కుమారులకు ఎన్నికల బాధ్యతలు అప్పగించి వార్డుల్లో పార్టీ విజయానికి దోహదపడ్డారు. ఇదే క్రమంలో ఆయన తన కుటుంబానికి సంబంధించిన ఒక స్థానాన్ని ఎమిలీ జ్వాల రూపంలో కోల్పోవాల్సి వచ్చింది. ధర్మాల శ్రీను వంటి యువకుని విజయం నల్లేరుపై నడకే అనుకున్న సమయంలో ఆయన ఓటమిపాలవడం నాగిరెడ్డి వర్గాన్ని కాస్త నిరుత్సాహపరచినప్పటికీ ఇతర స్థానాలలో విజయం అందించిన కిక్కును ఆస్వాదించేలా చేసింది. తన కుమారుడు వంశీరెడ్డి విజయం నాగిరెడ్డి ఊహించినదే. అయితే, మరింత మెజారిటీ ఆశించారని వినికిడి. రాజకీయంగా సీనియర్ అయిన భూపతిరాజు శ్రీనివాసరాజు తన సతీమణి సుజాతను గెలిపించుకోవడం ద్వారా నాగిరెడ్డి నమ్మకాన్ని మరోమారు నిలబెట్టినట్లయింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పటి నుంచీ వివిధ రూపాలలో సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా వైసీపీ అభ్యర్ధులు ప్రజలతో అనుక్షణం మమేకమవుతూ వచ్చారు. ఒక విధంగా ఈ విజయానికి అది కూడా ఎంతగానో దోహదపడింది. గాజువాక జోన్‌ పరిధిలో ప్రతిపక్షం బలంగానే ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల సునామీలో ఇవేవీ ఓటర్లకు కనిపించలేదు.

ఎమ్మెల్యేని కలిసిన కార్పొరేటర్లు…

జీవీఎంసీ గాజువాక జోన్ పరిధిలో ఎన్నికయిన నూతన కార్పొరేటర్లు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు పొందారు. తమ విజయానికి సహకరించిన నాగిరెడ్డి, దేవన్‌రెడ్డి, వంశీరెడ్డికి కొత్త కార్పొరేటర్లు కృతజ్ఞతలు తెలిపారు.