మన బడి – నాడు నేడు పనులు

530

నెలాఖారులోగా వంద శాతం పూర్తి చేయాల్సిందే…
• రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
• పనుల పూర్తికి రోజువారీ టార్గెట్లు
• నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తికాకుంటే సహించేది లేదన్న మంత్రి

విద్యా రంగంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన బడి – నాడు నేడు పనులు ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయాల్సిందేనని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. గడువులోగా పనులు పూర్తి చేయడానికి రోజువారీ సమీక్షలు నిర్వహించుకోవాలన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయకుండా అలసత్వం వహిస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మన బడి – నాడు నేడు పనులపై మంగళవారం మున్సిపల్, హౌసింగ్, గిరిజన సంక్షేమం, సర్వశిక్షా అభియాన్ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన నాడు నేడు పనుల ప్రగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.

ఫ్యాన్లు, స్మార్ట్ టీవీలు, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, పెయింటింగ్, అల్మరాల ఏర్పాటుతో పాటు తాగునీటి కల్పన, పారిశుద్ధ్య పనుల నిర్వహణా పనుల వివరాలను శాఖల వారీగా ఆరా తీశారు. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ చేపట్టని విధంగా విద్యా రంగంలో మౌలిక సదుపాయల కల్పనకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సాగించాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఇందుకోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా మన బడి – నాడు నేడు పనులు వంద శాతం పూర్తి చేయాల్సిందేనన్నారు.

రాబోయే మూడ్రోజులకు టార్గెట్లు…

ఈ నెలాఖరులోగా మొదటి విడత మన బడి – నాడు నేడు పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ లక్ష్యం నిర్ధేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గడువు మరో రెండు వారాలు మాత్రమే ఉందని, పనులు పూర్తికి ఆయా శాఖల అధికారులు టార్గెట్లు నిర్ణయించుకోవాలన్నారు. పనుల ప్రగతికి రోజువారీ సమీక్షలు నిర్వహించుకోవడం ద్వారా ముఖ్యమంత్రి నిర్ధేశించిన గడువులోగా లక్ష్యం చేరుకోవొచ్చునన్నారు. ఈ నెల 19వ తేదీ వరకూ రాబోయే మూడ్రోజుల్లో ఏయే శాఖ ఎంత మేర పనులు పూర్తి చేయాలో చెబుతూ మంత్రి టార్గెట్లు నిర్ధేశించారు. ఇలా ప్రతి మూడు రోజులకు టార్గెట్లు పెట్టుకోవడం ద్వారా ఈ నెలాఖరులోగా వంద శాతం పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.

అలసత్వం వహిస్తే కఠిన చర్యలు…

రాష్ట్రంలో సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బడి – నాడు నేడు పనుల్లో నిర్లక్ష్యం చూపితే సహించేది లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. కొందరు ఇంజనీరు అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నిర్ధేశించిన లక్ష్యంలోగా మొదటి విడత నాడు నేడు పనులు పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ, నాడు – నేడు పనుల పూర్తికి సహకరించని వారిని ఉపేక్షించేది లేదన్నారు. మార్చి నెలాఖరులోగా మొదటి విడత పనులు పూర్తి చేయాల్సిందేనని, ఏప్రిల్ నుంచి రెండో విడత పనులు చేపడతామని తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్, హౌసింగ్, గిరిజన సంక్షేమం, సర్వశిక్షా అభియాన్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.