పార్లమెంటులో ఏపీకి గ్రాంట్లు కోరిన ‘మాగుంట’

384

ఒంగోలు, న్యూఢిల్లీ, మార్చి 17 (న్యూస్‌టైమ్): పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు లోక్‌సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ మొన్నటి రైల్వే బడ్జటులో ఖరగ్పూర్-విజయవాడ ఈస్టు కోస్టు కారిడారు, ఇటార్సి–విజయవాడ నార్త్ సౌత్ కారిడార్ ప్రాజెక్టులు, అనంతపూర్ నుండి ఢిల్లీ ఆదర్శ నగర్ కిసాన్ రైల్ ఏర్పాటు ప్రకటించినందుకు, కోవిడ్ సంక్షోభ సమయంలో వలస కార్మికుల చేరవేత తదితర అత్యవసర పనులలో రైల్వే శాఖ చేసిన సేవలకు రైల్వే మంత్రికి కృతఙ్ఞతలు తెలియజేసారు. అలాగే, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ బాగా ఆర్ధిక లోతులోవున్నందున, రాష్ట్రం నుండి రైల్వే ఆదాయం బాగా వున్నను ఖర్చు మాత్రం చాలా తక్కువగా వున్నదని, కనుక అన్ని కొత్త ప్రాజెక్టులు 50:50 భాగస్వామ్యంతో కాగా నూరు శాతం రైల్వే నిధులతోనే చేపట్టాలని కోరారు. చాలా కాలంగా పెండింగులో నున్న పలు పనులను వెంటనే చేపట్టి పూర్తిచేయవలసినదిగా కోరారు. గద్వాల్-మాచెర్ల, విష్ణుపురం (మాచెర్ల)–వినుకొండ, జగ్గయ్యపేట–మిరియాలగూడ, నరసాపూర్–మచిలీపట్నం, సింగరాయకొండ–కనిగిరి, దర్శి–నరసరావుపేట కొత్త లైన్లు, తెనాలి–రేపల్లె డబుల్ లైన్, పాకాల–తిరుపతి డబుల్ లైన్, మహబూబ్‌నగర్–గూటి డబుల్ లైన్, ధర్మవరం–పాకాల డబుల్ లైన్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జీలు, ముఖ్యమైన స్టేషన్లలో రైళ్ళ నిలుపుదల, అదనపు రెండవ తరగతి కోచ్‌ల ఏర్పాటుతో పాటు ఏపీకి మెట్రో రైల్ ఏర్పాటు అంశాలను మాగుంట మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అన్ని ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలు చేసేటపుడు ఆయా పార్లమెంటు సభ్యులను తప్పక సంప్రతించాలని కోరారు.