బాబూ… ఇంకా రాజకీయాల్లో ఉంటారా?

597
చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా?
తాజాగా రెండు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీకి తిరుగులేని మెజారిటీ కట్టబెట్టిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఇంకా రాజకీయాల్లో ఉండాలా? వద్దా? అని నిర్ణయించుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్  జి. శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ ఫలితాలు తమ బాధ్యత మరించ పెంచాయన్నారు. 
– స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. కరోనా ఉన్నప్పటికీ ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి విధుల్లో పాల్గొన్నారు. కరోనా సమయంలో ఎన్నికలు వద్దంటే, మా పార్టీ భయపడుతోందని విమర్శలు చేశారు. కానీ ఫలితాలు చూశారు కదా?.

– ఏకగ్రీవ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం అన్నట్లుగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శించింది. నిజానికి ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకలేదు.
ఎన్నికల్లో పోటీ చేయలేక, మాపై నిందలు వేశారు. మీకు చిత్తశుద్ధి ఉంటే లోకేష్‌ను పోటీ చేయించండి.
– చంద్రబాబు సొంత నియోజకవర్గాలు చంద్రగిరి, కుప్పంలో కూడా టీడీపీ దారుణంగా ఓడిపోయింది. చివరకు మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఘోర పరాభవం తప్పలేదు. మీ భాష, ప్రజలపై విమర్శలు చేశారు. వారికి రోషం ఉంది కాబట్టే మీకు బుద్ధి చెప్పారు.
– పంచాయతీ ఎన్నికల్లో మీకు విజయం రాకపోయినా, అవి పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు కాబట్టి, మీ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేశారు. అదే మున్సిపల్‌ ఎన్నికలు వచ్చే సరికి తండ్రి కొడుకులు ఇద్దరూ హైదారాబాద్‌ వెళ్లిపోయారు.
– సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల మాదిరిగా, ప్రతి ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ, ఈ 21 నెలల పాలన కొనసాగింది. అది సీఎం వైయస్‌ జగన్‌  చిత్తశుద్ధి. మీకు అధికారం కావాలి. అధికారం అంటే, ఏం చేయకపోయినా చేసినట్లు ప్రచారం చేసుకున్నారు. కానీ మేమే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పని వాటిని కూడా అమలు చేశాం.
– కోవిడ్‌ సమయంలో దేశంలోనే అత్యుత్తమంగా సేవలు అందించాము. ఆ విధంగా ప్రజల విశ్వాసాన్ని పొందాము. మీరు ఎంతసేపూ విమర్శలు. దారుణమైణ భాష వాడారు. దుర్భాషలాడారు. మీరు తండ్రీ కొడుకులు ఇష్టానుసారం మాట్లాడినా, సీఎం గారు మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు.
– కానీ మీరు కుల, మత రాజకీయాలు చేశారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. చివరకు ఆలయాలపైనా రాజకీయాలు చేశారు.
ఎక్కడ, ఏం జరిగినా ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేశారు.
ప్రతిదీ రాజకీయ కోణంలో ఆలోచించారు. అందుకే ఈ ఎన్నికల్లో ఎక్కడా కనీసం సీట్లు సంపాదించుకోలేదు.
– ఒక ఇష్యూను మీరే లేవదీస్తారు. దానిపై చర్చలు పెడతారు. ఎవరెవరితోనో ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తారు. అవి అంతు లేకుండా చేశారు. కానీ అవే మాకు మేలు చేశాయి. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు, మా పార్టీకి మెజారిటీ వచ్చిన చోట్ల మీరు వ్యవహరించిన తీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి.
– అమరావతి ప్రాంతంలో అసైన్డ్‌ భూములకు సంబంధించి అక్రమాలకు పాల్పడితే సీఐడీ వారు చంద్రబాబుకు నోటీసు ఇస్తే, లోకేష్‌తో సహా అందరూ విమర్శిస్తున్నారు. మీరు ఏ తప్పు చేయకపోతే, కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోవద్దు. దర్యాప్తు జరగనివ్వండి. లోకేష్‌ ఏ మాత్రం జ్ఞానం, విచక్షణ లేకుండా మాట్లాడుతున్నాడు. మీకు చిత్తశుద్ధి ఉంటే, కోర్టుల్లో విచారణ జరగనివ్వండి.
– ఇవాళ గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు ఎన్నో సేవలందిస్తున్నాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు నీరు–చెట్టు పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారు. మీరు ఏ పని చేసినా ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన లేదు.
– కానీ సీఎం  వైయస్‌ జగన్, ప్రతి పనిలో, కార్యక్రమంలో, పథకంలో ప్రజలకు మేలు జరగాలని చూశారు. సంక్షేమ పనుల్లో పూర్తి పారదర్శకత పాటించారు. అంతటా మంచి జరిగింది కాబట్టే, ప్రజలు ఆదరించారు.
కానీ మీరు ఎంతసేపూ వ్యక్తిగత విమర్శలు. ప్రజాదరణ కోల్పోయి, ఏం చేయాలో తోచక, విచక్షణ కోల్పోయి, కులాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు.
– అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఓడిపోతే ఈవీఎంల ట్యాంపర్‌ జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు జరిగితే, అంత కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
– మూడు రాజధానులు ఉంటాయని మేము చెప్పాము. దాన్ని ప్రజలు కూడా ఆమోదించారు. సీఎం  వైయస్‌ జగన్‌  ఏనాడూ అమరావతికి అన్యాయం చేస్తామని చెప్పలేదు. లక్ష కోట్లు ఖర్చు చేయలేం కాబట్టి, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పెట్టాలని నిర్ణయించారు.
– అమరావతిలో మీరు 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గిస్తామని చెప్పారు. అది ఎక్కడైనా సాధ్యం అవుతుందా? గ్రాఫిక్స్‌తో ప్రజలను మోసం చేశారు. అన్నింటినీ ప్రజలు గుర్తించారు.
– నాడు వైయస్సార్, నేడు సీఎం వైయస్‌ జగన్‌ ప్రజల కోసం ఎన్నెన్ని పథకాలు, కార్యక్రమాలు అమలు చేశారో చూడండి. మీ ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మీకు చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా?
– ఇంత ఘోర పరాజయం తర్వాత మీరు ఇంకా రాజకీయాల్లో కొనసాగాలా? ఆలోచించండి.
– ఈ తీర్పు తర్వాత మా బాధ్యత ఇంకా పెరిగిందని మేము భావిస్తున్నాము. అందుకే ఇంకా సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తాము.