నేరమే లేనప్పుడు నేరస్తుడెలా?

191

సీఐడీ నోటీసులపై సోమిరెడ్డి సూటి ప్రశ్న…

నెల్లూరు, మార్చి 16 (న్యూస్‌టైమ్): అసలు నేరమేలేనప్పుడు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరస్తుడెలా అవుతాడు? అని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో తమను మోసంచేసి, చంద్రబాబు నాయుడు భూములు తీసుకున్నాడని ఎవరైనా ప్రభుత్వానికి ఫిర్యాదుచేశారా?

అసలు ఈ వ్యవహారంలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధముందని ఆయన ద్వారా మాజీ ముఖ్యమంత్రికి నోటీసులిచ్చారు? ఆయనేమైనా రాజధానికి భూములిచ్చాడా? పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలవగానే అహంకారం నెత్తికెక్కే ప్రభుత్వం ఈ పని చేసింది.’’ అని ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇన్‌‌సైడ్ ట్రేడింగ్ అనే పదమేలేదని, హైకోర్టు చెప్పినా ప్రభుత్వం, పది సెక్షన్ల కింద మాజీ ముఖ్యమంత్రికి నోటీసులివ్వడమేంటి? తాను జైలుకు వెళ్లాను కాబట్టి, ఏదో ఒక నేరంలో చంద్రబాబుని కూడా జైలుకు పంపాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు కనిపిస్తోంది.’’ అని సోమిరెడ్డి పేర్కొన్నారు. అసలు నేరమే లేనప్పుడు చంద్రబాబు నేరస్తుడెలా అవుతాడో ముఖ్యమంత్రి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చాక 4 వేల ఎకరాలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని గగ్గోలు పెడుతూనే ఉన్నారని, ఇంతవరకు 4 ఎకరాల్లో కూడా ఇన్‌సైడ్ ట్రేడింగ్‌ని నిరూపించలేకపోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడిని జైలుకు పంపడం ఆ దేవుడి వల్ల కూడా కాదని జగన్ గ్రహిస్తే మంచిదన్నారు. రాజధాని ప్రాంతంలో తమను మోసంచేసి, తమకు తెలియకుండానే చంద్రబాబు నాయుడు భూములు తీసుకున్నారని ఎవరైనా ఈ ప్రభుత్వానికి గానీ, ముఖ్యమంత్రికి గానీ ఫిర్యాదు చేశారా? అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి 10 సెక్షన్ల కింద నోటీసులివ్వడం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడమనేది చాలా దుర్మార్గమన్నారు. స్థానిక ఎన్నికల్లో డబ్బు, అధికార బలం, పోలీసులతో గెలవగానే ఈ ప్రభుత్వానికి అహంకారం నెత్తికెక్కినట్లుగా తనకు అనిపిస్తోందన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధముందని రాజధాని భూముల విషయంలో జోక్యం చేసుకున్నాడో చెప్పాలన్నారు. ఏ ఒక్క దళితుడైనా ఆయన వద్దకు వెళ్లి, చంద్రబాబునాయుడు తనను మోసంచేసి భూములు తీసుకున్నాడని ఫిర్యాదు చేశారా? అని నిలదీశారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్ అనే పదమే లేదని, రాజధాని భూముల వ్యవహారంలో ఎక్కడా ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు చాలా స్పష్టంగా కిలారి రాజేశ్ విషయంలో తీర్పు ఇచ్చిందన్నారు. దమ్మాలపాటి శ్రీనివాస్ అంశానికి సంబంధించి కూడా సుప్రీం కోర్టు ఇదే విషయం చెప్పడం జరిగిందన్నారు. 4 వేలు, 5 వేల ఎకరాలు ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఆరోపణలు చేస్తూనే ఉందన్నారు. ఎవరో ఎస్టీ, ఎస్సీ అసోసియేషన్ వారు ఆళ్ల రామకృష్ణారెడ్డితో మాట్లాడితే, దాన్ని సాకుగా చూపి చంద్రబాబు నాయుడిని బోను ఎక్కించాలని చూస్తారా? అని మాజీ మంత్రి మండిపడ్డారు. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం చేసిన భూసేకరణకు నిరసనగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో వెంకన్నపాలెంలో దళిత యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు. చెర్లోపల్లిలో ఇద్దరు దళిత మహిళలు తమ భూమిపోతుందన్న ఆవేదనతో పురుగులమందు తాగడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 మంది వరకు ప్రభుత్వ భూసేకరణను నిరసిస్తూ ఆత్మహత్యా ప్రయత్నాలు చేశారని సోమిరెడ్డి తెలిపారు.
పేదల స్వాథీనంలోని భూములను ఈ ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం బలవంతంగా సేకరించబట్టే, వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. అటువంటి ఘటనలు ఒక్కటంటే ఒక్కటి కూడా అమరావతి ప్రాంతంలో జరగలేదన్నారు. అటువంటివి ఏమీ లేకుండానే చంద్రబాబు నాయుడిని, మాజీ మంత్రి నారాయణను బోను ఎక్కించాలని చూస్తున్నారన్నారు. అలాంటప్పుడు పేదల భూములు బలవంతంగా లాక్కున్నందుకు ఈ ప్రభుత్వంపై ఎన్నికేసులు పెట్టాలని సోమిరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉందని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడమేంటన్నారు. చంద్రబాబు నాయుడిని నమ్మి భూములిచ్చినవారికి ఆయన, టీడీపీ ప్రభుత్వం న్యాయమే చేసిందని, జగన్ ప్రభుత్వమొచ్చాకే అమరావతిని నాశనం చేసిందన్నారు. కోట్లాది రూపాయల ఆస్తులను బీళ్లుగా మార్చేసి, ప్రపంచం మెచ్చే రాజధానిని ఎడారిగా మార్చింది ఈ ప్రభుత్వం కాదా? అని చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. జైలుకెళ్లాల్సిన జగన్, చంద్రబాబు నాయుడిని జైలుకు పంపుతానంటూ నోటీసులివ్వడం దురదృష్టకరమన్నారు. రామకృష్ణారెడ్డి ఎప్పటినుంచో ఉన్నదాన్నిలేనట్టు, లేనిదాన్ని ఉన్నట్లు నమ్మించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడని, కానీ ఇంతవరకు ఆయన ఏమీ సాధించలేకపోయాడన్నారు. చంద్రబాబు నాయుడికి నోటీసులిచ్చి ఆయన్నినేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం విచిత్రంగా ఉందన్నారు. నేరమే లేనప్పుడు నేరం చేశాడని మాజీ ముఖ్యమంత్రికి నోటీసులెలా ఇస్తారని సోమిరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయకుండా ప్రభుత్వం ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తోందో ప్రజలు అర్థం చేసుకోగలరన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు గెలిచామనే అత్యుత్సాహంతో నోటీసులు పంపితే, అంతకుఅంత అనుభవించి తీరుతారన్నారు. తాను జైలుకు పోయాను కాబట్టి, ఏదో ఒక కేసులో చంద్రబాబుని ఇరికించి, ఆయన్ని కూడా జైలుకు పంపాలనే ఆలోచనలు ఎప్పటికీ నెరవేరవన్నారు. చంద్రబాబు నాయుడును జైలుకు పంపడం దేవుడితరం కూడా కాదన్నారు. నిజంగా భూముల వ్యవహారాల్లో ఏదైనా తప్పు జరిగితే, అందుకు టీడీపీ ప్రభుత్వానికి నోటీసులివ్వాలిగానీ, వ్యక్తికి ఎలా ఇస్తారన్నారు. జగన్ అధికారంలోకి రాకముందు, వచ్చాక 4 వేల ఎకరాలు ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని అరిచి, గగ్గోలుపెట్టి, చివరకు హైకోర్టుతో మొట్టికాయలు తిన్నాక కూడా వైఖరి మార్చుకోకుంటే ఎలాగన్నారు. 4 వేల ఎకరాలు కాదుకదా 4 ఎకరాలు కూడా ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఈ ప్రభుత్వం నిరూపించలేదని సోమిరెడ్డి తేల్చిచెప్పారు.