కమిలిన కమలం.. మెరిసిన ‘గ్లాసు’

562

మళ్లీ బోర్లాపడ్డ బీజేపీ
మున్సి‘పోల్స్’లో పెరిగిన జనసేన బలం
వైసీపీ-టీడీపీ ఓట్లకు గండికొట్టిన జనసేన అభ్యర్ధులు
విశాఖలో వైసీపీ అంచనాలకు జనసేన బ్రేక్
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

పంచాయితీ ఎన్నికల ఫలితాలలో దారుణ విషాదం మూటకట్టుకున్న బీజేపీ, మున్సిపోల్స్‌లో కూడా బోల్తాపడింది. కానీ బీజేపీ మిత్రపక్షమైన జనసేన మాత్రం, తొలిసారి పంచాయితీ- మున్సిపోల్స్ బరిలో దిగి  గణనీయమైన ఫలితాలు సాధించింది. దీనితో జనసేన బీజేపీకి ఉపయోగపడుతుందే తప్ప, రాజకీయంగా జనసేనకు బీజేపీతో ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టమయింది.  పైగా బీజేపీతో కలసి ఉంటే మైనారిటీల ఓట్లు పోతాయన్నది ఈ ఫలితాలు రుజువుచేశాయి. ఈ రెండు ఎన్నికల్లో కమలం కమిలిపోయి, ఫలితాలతో కుంగిపోగా.. జనసేన మాత్రం ఓట్లు-సీట్లు సాధించుకోవడంలో విజయం సాధించింది.

పంచాయతీ, మున్సిపోల్స్‌లో జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ఎక్కడా ప్రచారం చేయలేదు. నిజానికి టీడీపీ,బీజేపీతో పోలిస్తే ఆ పార్టీకి ఉన్న యంత్రాంగం-వనరులు  అతి తక్కువ. అయినా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన, పంచాయితీ ఎన్నికల్లో బీజేపీతో పోలిస్తే మెరుగయిన ఫలితాలు సాధించడం విశేషం. తాజా మున్సిపోల్స్‌లో కూడా, బీజేపీ కంటే జనసేన పార్టీనే ఎక్కువ ఓట్లు, సీట్లు సాధించడం బట్టి, ఏపీలో బీజేపీ కంటే జనసేనకే రాజకీయ భవిష్యత్తు ఉందనేది స్పష్టమవుతోంది. రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీలలో ఉన్న 2123 వార్డులకు గాను 483 చోట్ల నామినేషన్లు వేసిన  బీజేపీ, ఉప సంహరణ తర్వాత  పోటీ చేసింది కేవలం 333 మాత్రమే. మొత్తం రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లలో ఉన్న 671 డివిజన్లకు 230 చోట్ల నామినేషన్లు వేసిన బీజేపీ, ఉప సంహరణ తర్వాత చివరకు 177 చోట్ల పోటీ చేసింది. అసలు పంచాయితీ, మున్సిపోల్స్‌లో తాము ఎన్ని స్థానాల్లో పోటీ చేసి, ఎన్ని చోట్ల గెలిచామని చెప్పే ధైర్యం బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికీ చేయకపోవడమే ఆశ్చర్యం. దీన్నిబట్టి పవన్ పేరు-జనసేన బలంతో రాజకీయ మనుగడ  సాగిస్తున్న బీజేపీ పరిస్థితి ఏమిటన్నది స్పష్టమవుతోంది.
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, లోకేష్ విస్తృతంగా ప్రచారం చేశారు.

దానికితోడు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరించారు. బీజేపీ అగ్ర నేతలు మాత్రం రాష్ట్రంలో కొన్ని చోట్ల వార్డులకు వెళ్లి ప్రచారం చే సి, కరపత్రాలు పంపిణీ చేశారు. బీజేపీ నేతలు ఈసారి రెండు ఎన్నికల్లో మీడియాలో కూడా పెద్దగా కనిపించలేదు.

కానీ, ఇలాంటివేమీ లేని జనసేన,  కేవలం తన అభ్యర్ధుల బలాన్ని మాత్రమే నమ్ముకుని బరిలోకి దిగింది. ప్రధానంగా కార్పొరేషన్లలో జనసేన, బీజేపీ కంటే ప్రత్యర్ధులకు మెరుగైన పోటీ ఇవ్వగలిగింది. ఫలితంగా విశాఖలో 65 సీట్లు సాధిస్తుందనుకున్న వైసీపీ విజయావకాశాలను జనసేన గండికొట్టి, సీట్ల సంఖ్యను తగ్గించగలిగింది. విజయవాడ కార్పొరేషన్‌లో కూడా జనసేన పోటీ వల్ల వైసీపీ-టీడీపీ అభ్యర్ధులు నష్టపోవలసి వచ్చింది.

తాజా మున్సిపోల్స్‌లో రెండు ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే..  ప్రధాన పార్టీల విజయావకాశాలకు గండికొట్టే స్థాయికి జనసేన ఎదిగిందని స్పష్టమవుతోంది. మున్సిపోల్స్‌లో మొత్తం పోలయిన ఓట్లలో జనసేన 4.67 శాతం సాధించగా, బీజేపీ 2.41శాతం ఓట్లు సాధించింది.  పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ 86 సర్పంచులు గెలిచినట్లు, ఇటీవల విజయవాడలో జరిగిన పార్టీ సమావేశంలో ఎమ్మెల్సీ మాధవ్ ప్రకటించారు. అయితే ఆయన జనసేన గెలిచిన సీట్లు కూడా, తన ఖాతాలో వేసుకున్నారన్న వ్యాఖ్యలు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. తొలివిడత పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన 46, రెండవవిడతలో 40, మూడవ విడతలో 25, నాలుగవ విడతలో 7 సీట్లు సాధించాయి, వీటిలో బీజేపీ సాధించిన సీట్ల శాతం కంటే జన సేన సాథించిన సీట్లే ఎక్కువ. ఆ ప్రకారంగా పంచాయితీల్లో జనసేన-బీజేపీ కలసి 1.45 శాతం ఓట్లు సాధించాయి.

తాజా మున్సిపోల్స్‌లో కార్పొరేషన్లలో జనసేన 7 డివిజనల్లో, మున్సిపాలిటీ/నగర పంచాయితీల్లో 19 వార్డుల్లో గెలిచింది. బీజేపీ కార్పొరేషన్లలో ఒక డివిజన్, మున్సిపాలిటీ/నగర పంచాయితీలలో 8 వార్డులు గెలుచుకోగలిగింది. జనసేన కీలకమైన బెజవాడ, విశాఖ, గుంటూరు కార్పొరేషన్లలో కీలక పార్టీల ఓట్లు భారీ సంఖ్యలో చీల్చగలిగితే, బీజేపీ మాత్రం నామ మాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

త్వరలో  తిరుపతి పార్లమెంటుకు జరగనున్న  ఉప ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని, అక్కడ గెలిచిన తమ పార్టీ అభ్యర్ధి కేంద్రమంత్రి కూడా అవుతారని,  బీజేపీ రాష్ట్ర సహ ఇన్చార్జి సునీల్ దియోథర్ ఇటీవల ప్రకటించారు. అయితే తాజాగా జరిగిన మున్సిపోల్స్ ఫలితాలు పరిశీలిస్తే.. రానున్న లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ పరిస్థితి ఏమిటన్నది ఊహించుకోవచ్చు. తిరుపతి పార్లమెంటు పరిథిలోని తిరుపతి కార్పొరేషన్, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలలో 125 వార్డులున్నాయి. అయితే అక్కడ బీజేపీకి ఒక్క వార్డు కూడా రాకపోవడం బట్టి, తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ విజయావకాశాలు ఎలా ఉంటాయో ఊహించడానికి మేధావులే కానవసరం లేదు.

ఈ నేపథ్యంలో ఏపీలో జనసేన,  రాజకీయంగా తన భవిష్యత్తును మెరుగుదిద్దుకుంటుందన్న విషయం తాజా ఫలితాలు స్పష్టం చేశాయి. కాగా, జనసేన కార్యకర్తలు-పవన్ అభిమానులలో ముస్లిం-క్రైస్తవులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో వీరి సంఖ్య ఎక్కువ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు వర్గాలూ జనసేనకు జై కొట్టాయి. కానీ ఇప్పుడు జనసేన బీజేపీతో జట్టు కట్టడంతో, ఆ రెండు వర్గాలు వైసీపీ వైపు మొగ్గు చూపాయి. బహుశా ఈ కారణంతోనే, జనసేన రాష్ట్ర నేత పోతిన మహేష్.. బీజేపీతో జత కట్టడం వల్ల తాము,  మైనారిటీల ఓట్లు కోల్పోయామని వ్యాఖ్యానించినట్లు కనిపిస్తోంది.