ప్రకాశం జిల్లాలో అమరజీవికి ఘన నివాళి

79

ఒంగోలు, మార్చి 16 (న్యూస్‌టైమ్): ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ప్రాణాలర్పించిన అమర జీవి పొట్టి శ్రీరాములు త్యాగాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ అన్నారు. మంగళవారం ఉదయం ప్రకాశం భవనంలోని స్పందన సమావేశ మందిరంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 120వ జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగాయి. జ్యోతి వెలింగించి వేడుకలను ఆయన ప్రారంభించారు. సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు పుష్పాలతో ఘనంగా నివాళులర్పించారు. తొలుత సి.వి.ఎన్. రీడింగ్ రూమ్ సమీపంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్, అధికారులు, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ఆద్యులని ఆయన గుర్తు చేశారు. తెలుగు వారికి వేరే రాష్ట్రం కావాలని 58 రోజులపాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగం చేశారన్నారు. ఆయన పోరాటపటిమను స్పూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన ఎంతో మంది స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని, రాష్ట్ర, దేశ అభివృద్ధికి విశేష కృషి చేసిన వారిలో పొట్టి శ్రీరాములు ఒకరన్నారు. మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస మార్గాలను అనుసరించి మహాత్మాగాంధీ ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని కలెక్టర్ అభివర్ణించారు. సబర్మతి ఆశ్రమంలో గడిపి సేవా ధృక్పదాన్ని పొట్టి శ్రీరాములు అలవరచుకున్నారన్నారు. పొట్టి శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాస్‌లోనే జరిగిందని, బొంబాయిలో శానిటరీ ఇంజినీరింగ్ చదివి గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే ఉద్యోగంలో చేరారని కలెక్టర్ వివరించారు. బ్రిటీష్ కాలంలో మద్రాలో వుండే తెలుగువారంతా రాజకీయ వివక్షకు గురి అయ్యేవారని చెప్పారు. తెలుగు ప్రజలకు చేరాల్సిన వనరులు అందకపోవడంపై పొట్టి శ్రీరాములు అసంతృప్తి చెందారని ఆయన వివరించారు. అప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్రం తెలుగు వారికి వుండాలనే లక్ష్యంతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారని ఆయన తెలిపారు. పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షతో ప్రజలలో చైతన్యం తీసుకుని వచ్చారన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆశయ సాధనలో ప్రాణాలర్పించిన ఆయన అమరజీవి అయ్యాడన్నారు. ఆ సమయంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన వివరించారు. దీనితో భారత ప్రభుత్వం భాషా ప్రాతిపదికన 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా చేస్తూ తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. అనంతరం 1956లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిందని కలెక్టర్ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు చూపిన స్పూర్తి, ప్రాణత్యాగం కొనియాడదగినవన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు ప్రజల కోసం ఆయన తన ప్రాణాన్ని ఫణంగా పెట్టారని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి మన వంతు కృషి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్లు జె.వి.మురళి, కె.కృష్ణ వేణి, డి.ఆర్.ఓ. కె.వినాయకం, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.