మంచిని ఆచరిస్తేనే ‘చదువు’కి సార్ధకత

344

మంగళగిరి, మార్చి 15 (న్యూస్‌టైమ్): చినకాకాని షైన్ ఆనంద శరణాలయంలో విజయవాడ యూత్ ఫర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం బాలబాలికలకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా తాశీల్దార్ జివి రాం ప్రసాద్ హాజరై బాలబాలికలకు బ్యాగులు, నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. అదేవిధంగా గత నెలలో యూత్ ఫర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల స్థాయిలో ఆన్‌లైన్ ద్వారా బాలబాలికలకు నిర్వహించిన వివిధ సాంస్కృతిక పోటీలలో, శరణాలయం నుండి పోటీలో పాల్గొని గెలుపొందిన బాలబాలికలకు ఈ సందర్భంగా తాశీల్దార్ చేతుల మీదగా బహుమతులు, ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు.

అనంతరం రాంప్రసాద్ మాట్లాడుతూ బాలబాలికలు చదువుతోపాటు దేశభక్తిని, మంచి ఏమిటో, చెడు ఏమిటో అని కూడా తెలుసు కోవాలని, వాటిలో మంచిని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే నేర్చుకున్న చదువు సార్థకం అవుతుందన్నారు. యూత్ ఫర్ సేవా సంస్థ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, అనాధ బాలబాలికలకు సహాయం అందించడం హర్షణీయమన్నారు. ఉద్యోగిగా ఉంటూ శరణాలయం నడుపుతున్న నాయక్‌ను ఆయన అభినందిస్తూ శరణాలయం నిర్వాహకులను ఊరికినే అభినందించడం కాదని అంటూ, శరణాలయంలో బాలబాలికల భోజనానికి తనవంతుగా 3500 రూపాయలను వెంటనే నిర్వాహకులకు తాశీల్దార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవా సంస్థ ప్రతినిధులు మునగాల జయదుర్గ, సయ్యద్ రిజ్వాన్, స్పందన, ప్రదీప్, నవీన్, శివాని, శివ, షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్, శరణాలయం నిర్వాహకురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.