గుంటూరు మేయర్ పదవి ఇద్దరికీ?

440

గుంటూరు, మార్చి 15 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వచ్చినట్లే గుంటూరు జిల్లాలో కూడా వైసీపీ ఏకపక్ష విజయం అందుకుంది. రాజధాని ప్రజాలారా అంటూ చంద్రబాబు చేసిన ప్రచారం ఎక్కడా ప్రభావం చూపలేదు. గుంటూరు కార్పొరేషన్‌లో తొలిసారి పోటీ చేసిన వైసీపీ మేయర్ స్థానం గెలుచుకుంది. మరోవైపు జిల్లాలో 7 మునిసిపాలిటీలు వైసీపీ పరం అయ్యాయి. ఇక గుంటూరు నగర మేయర్ విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. తొలి సారి మేయర్ పీఠాన్ని గెలుచుకున్న వైసిపి 5 ఏళ్ల పదవీ కాలాన్ని ఇద్దరు అభ్యర్థులకు పంచే అవకాశం ఉందని అంటున్నారు.

మొదటి రెండున్నరేళ్లు కావటి మనోహర్ నాయుడు మేయర్ గా ఉంటారని అంటున్నారు. మనోహర్ నాయుడు పశ్చిమ నియోజకవర్గంలో 20వ డివిజన్ నుంచి గెలిచారు. ఇక చివరి రెండున్నరేళ్లు పాదర్తి రమేష్ గాంధీ మేయర్‌గా ఉండబోతున్నారని అంటున్నారు.

ఈ విషయంలో ఇప్పటికే అధిష్టానం నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇక దీనిపై మేయర్ ఎన్నికకు ముందే ప్రకటన కూడా చేయనుందని అంటున్నారు. ఈ ఇద్దరు సీనియర్ నేతలు కావడం ఇద్దరికీ అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితుల్లో అధిష్టానం మేయర్ సీటును ఇద్దరికి పంచినట్టు చెబుతున్నారు. ఇక ఈ నెల 18న మేయర్ ఎన్నిక జరగనుందన్న సంగతి తెలిసిందే.