నాడు అన్నగారు..నేడు అక్క గారు!

905

మల్లెల బాబ్జీ గుర్తున్నాడా?.. బహుశా ఇప్పటి తరానికి తెలియని పేరు.. తెలుగు రాజకీయాల్లో ఒకప్పుడు రాజకీయ కుట్రలకు బలైపోయిన యువకుడు బాబ్జీ..

1984 జనవరి 9 నాడు హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా బహిరంగ సభ.. హఠాత్తుగా 22 ఏళ్ల యువకుడు ‘ఇందిరాగాంధీ జిందాబాద్’ అంటూ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మీద కత్తితో దాడి చేశాడు.. ఎన్టీఆర్ చేతికి చిన్న గాయం అయింది.. వెంటనే పోలీసులు అరెస్టు చేశారా యువకున్ని.. అతని పేరు మల్లెల బాబ్జీ..

తనపై దాడి చేసిన బాబ్జీని క్షమిస్తున్నానని ఎన్టీఆర్ కోర్టులో చెప్పడంతో ఏడాది తర్వాత 1985లో బెయిల్ మీద విడుదలయ్యాడు.. ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం చేశాడనే నిందతో ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. గుంటూరు జిల్లా పరిషత్ ఆఫీస్‌లో తోటమాలిగా అవకాశం ఇచ్చినా కొద్ది రోజుల్లోనే తొలగించారు.. చివరకు మల్లెల బాబ్జీ జీవితంపట్ల నిరాశా నిస్పృహలతో 1987 నవంబర్ 30న విజయవాడలోని ఓ లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ సందర్భంగా ఆయన రాసిన సూసైడ్ నోట్ సంచలం సృష్టించింది..

మల్లెల బాబ్జీ మరణ వాంగ్మూలం ప్రకారం ఎన్టీఆర్ మీద కత్తి దాడి నాటకం.. వాస్తవానికి ఆ యువకుడు ఎన్టీఆర్ కు వీరాభిమాని.. కత్తి దాడి నాటకం కోసం రూ.3 లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు.. బెంటనే బెయిల్ మీద బయటకు తెస్తామన్నారు.. కానీ బాబ్జీ ఏడాది పాటు జైలులో మగ్గిపోవాల్సి వచ్చింది. పైగా బయటకు వచ్చిన తర్వాత ఆయనకు కేవలం రూ.30 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.. ఇదేంటి అంటే ఇదంతే అని బెదిరించి ఉద్యోగం ఇస్తామని మభ్య పెట్టారు. ఇచ్చిన చిన్న ఉద్యోగం కాస్తా ఊడబీకారు.. తాను దారుణంగా మోసపోయాయని గ్రహించిన బాబ్జీ లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు..

ఎన్టీఆర్ పాలన మీద ప్రజలకు ఏడాది కాలంలోనే అసంతృప్తి ఏర్పడటంతో సానుభూతి సృష్టించడం కోసమే కత్తి దాడి డ్రామాలో మల్లెల బాబ్జీని బలి పశువు చేశారని అంటారు.. 2018లో కోడికత్తి దాడి కూడా అంతే  సంచలనం సృష్టించింది.. తాజాగా పశ్చి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద దాడి సంగతి సరే సరే..

మమత దీదీ  దాడి డ్రామా తెలుగు వారికి పెద్ద వింత అనిపించలేదు.. మనోళ్లకు  ఇది నానా పులి కథ లాగే అనిపిస్తుంది.. కాకపోతే 1984, 2018 ఉదంతాల్లో ఇద్దరు అమాకులు బలి పశువులయ్యారు.. పాపం దీదీ దయ తలచి ఎవరినీ బలి చేయకుండా ‘గుర్తు తెలియని వ్యక్తులు అనేసింది’.. అన్నట్లు ఇప్పటి సోషల్ మీడియా మిత్రులకు ‘బాబ్జీ’ పేరు కొత్త కాకపోవచ్చు.. ఆ బాబ్జీ, ఈ బాబ్జీ వేరే అయినా ఇద్దరూ నాటి డ్రామాలో పాత్రదారులే అని అంటారు..

                                                                                                                               – సత్య