తెనాలి మున్సిపాలిటీ వైసీపీ పరం

456

తెనాలి, మార్చి 14 (న్యూస్‌టైమ్): ఈనెల 10న జరిగిన తెనాలి మున్సిపల్ ఎన్నికలలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. తెనాలి పురపాలక సంఘం పరిధిలో మొత్తం 40 వార్దులు ఉండగా ఈనెల 3న జరిగిన నామినేషన్ల ఉపసంహరణలో 39, 40 వార్దులకు చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో ఈ రెండు వార్దులను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవమైయ్యారు. మిగిలిన 38 వార్దులకు సంబంధించి మొత్తం 151 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండడంతో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఈనెల 10న నిర్వహించిన ఎన్నికలలో 64 శాతం మేర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోన్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం స్థానిక జేఎంజె కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ ప్రక్రియను ఉదయం ఎనిమిది గంటలకే అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 32 మంది, తెలుగుదేశం పార్టీకి చెందిన 8 మంది వార్దు కౌన్సిలర్లుగా విజయం సాధించారు. దీంతో తెనాలి పురపాలక సంఘం చైర్మన్ సీటును వైసిపి కైవసం చేసుకుంది. విజయం సాధించిన వైసీపీ అభ్యర్థులతో ఎమ్మెల్యే శివకుమార్ భారీ ర్యాలీ నిర్వహించారు.

స్థానిక జేఎంజె కళాశాల కౌటింగ్ కేంద్రం నుంచి ప్రారంభమైన వైసిపి విజయోత్సవ ర్యాలీ పట్టణంలోని పలు వార్దులలో గెలిచిన అభ్యర్థులు ఊరేగింపులు చేశారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై టపాసులు పేల్చుతూ బైకులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. దీంతో తెనాలి మండలం అంగళకుదురు గ్రామం నుంచి తెనాలి వరకు ట్రాఫిక్‌కు త్రీవ అంతరాయం ఏర్పడింది. బస్సులు, లారీలు, కారులు, పెద్ద పెద్ద వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనచోదకులు త్రీవ అసహనం వ్యక్తం చేస్తున్నారు.