కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

265

ఆరుగురు కూలీల దుర్మరణం

విజయవాడ, మార్చి 14 (న్యూస్‌టైమ్): కృష్ణా జిల్లా నూజివీడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు కూలీలు మృతి చెందగా మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. అయిదుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన నూజివీడు మండలంలోని గొల్లపల్లి సమీపంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా నూజివీడు మండలం లయన్ తండా వాసులుగా పోలీసులు తెలిపారు.

ప్రమాదంపై మంత్రి ఆళ్ల నాని దిగ్భ్రాంతి

రోడ్డు ప్రమాదంపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో కూలీలు మృతి చెందడం తనను ఎంతో బాధించిందన్నారు. పొట్ట చేతబట్టి బతుకు దెరువు కోసం వెళ్తున్న కూలీలు ఇలా మృత్యువాత పడడం అత్యంత బాధాకరమని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్ధిస్తూ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8 మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ప్రమాదంలో మృత్యవాత పడిన కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.

మరోవైపు, అనంతపురం జిల్లా కొంతనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాయదుర్గానికి చెందిన మురళీ, అశోక్‌ కలిసి ఈ ఉదయం కారులో కనేకల్‌ బయల్దేరారు. కొంతనపల్లి వద్దకు రాగానే కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ రహదారి పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.