చరిత్ర సృష్టించిన పృథ్వీ షా

1343

న్యూఢిల్లీ, మార్చి 14 (న్యూస్‌టైమ్): దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో ముంబయి కుర్రాడు పృథ్వీ షా ధానాధన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొడుతున్నాడు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే 4 శతాకాలతో (105 నాటౌట్, 227 నాటౌట్, 185 నాటౌట్, 165) శివాలెత్తిన ఈ ముంబయి ఆటగాడు ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సైతం విధ్వంసం సృష్టించి విజయ్‌ హజారే ట్రోఫీ చరిత్రలో 800కుపైగా పరుగులు (827 పరుగులు) సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. న్యూఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో పృథ్వీ షా (39 బంతుల్లో 73; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి. తన జట్టుకు శుభారంభాన్ని అందించాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఉత్తర్‌ప్రదేశ్‌ జట్టు ఓపెనర్‌ మాధవ్‌ కౌశిక్‌ (156 బంతుల్లో 158 నాటౌట్‌; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ శతకం సాధించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 312 పరుగులు సాధించింది. కౌశిక్‌ శతకానికి మరో ఓపెనర్‌ సమర్థ్‌ సింగ్‌ (73 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అక్షదీప్‌నాథ్‌ (40 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలు తోడవ్వడంతో యూపీ జట్టు ముంబయికి భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.