మరోసారి ప్యాకేజీరాయుడుగా పవన్

1305

పూర్వం ఒక రహదారిలో మర్రిచెట్టు ఉండేది. దాని కొమ్మలమీద గూడు కట్టుకుని ఒక వాయసం తన భార్యాపిల్లలతో నివసిస్తుండేది. అది ఒక చిలిపి శాడిస్ట్ కాకి. బాటసారులు ఎవరైనా ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటే వారి నెత్తిన రెట్ట వేసేది. బాటసారులు “ఛీ ఛీ పాడు కాకి…ఎప్పుడు ఛస్తుందో ఏమో” అని తిట్టుకుంటూ లేచి వెళ్ళిపోయేవారు. వారిని చూసి కాకి పగలబడి నవ్వుకునేది.

సదరు కాకిగారికి మరణం ముంచుకొచ్చింది. కొడుకుని చేరబిలిచి “నాయనా…ఈ దారిన వెళ్లే పాంథులు అందరూ నేను వారి శిరస్సులపై రెట్ట వేస్తానని తిట్టుకుంటుండేవారు. నేను నరకానికి వెళ్తానేమో అని భయం వేస్తున్నది. నేను పోయాక ఎలాగైనా నువ్వు నాకు మంచిపేరు తీసుకునిరావాలి. నేను చాల మంచిదానినని అందరూ చెప్పుకోవాలి…చేస్తావా..ఒట్టు వేయి” అని ప్రామిస్ చేయించుకుని కళ్ళు మూసింది.

ఆరోజు కొందరు బాటసారులు ఆ కాకి చచ్చిందని తెలుసుకుని సంతసించి చెట్టుకింద కూర్చున్నారు. తండ్రికిచ్చిన వాగ్దానం గుర్తుకొచ్చిన పిల్లకాకి ఒక ఎండుపుల్లను విరిచి బాటసారి నెత్తిన పడేసింది. బాటసారి కంగారుపడి తలపైకెత్తి చూశాడు. వెంటనే పిల్లకాకి బాటసారి ముఖం మీద రెట్ట వేసింది. దాంతో బాటసారి ఉలిక్కిపడి “ఛీ..ఛీ…ఛీ…ఛండాలపు కాకి…దీనికంటే దీని తండ్రే చాలా మంచివాడు. నెత్తిపై మాత్రమే వేసేవాడు…” అని చీదరించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ విధంగా కొన్ని రోజుల తరువాత పిల్లకాకి కన్నా తండ్రికాకి చాలా ఉత్తముడు అని అందరూ అనడం మొదలు పెట్టారు. తండ్రికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు పిల్లకాకి తెగ సంతోషించింది.

ఎప్పుడో పుష్కరం క్రితం మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం అనే ఒక మెగా మాల్ ను తెరిచారు. టికెట్లు అమ్ముకున్నారని మొదట్లోనే రావలసినంత అపఖ్యాతి వచ్చింది. ముఖ్యమంత్రి అయిపోతాడని ఆయన అభిమానులు రంగురంగుల కలలను పగటివేళ కూడా కనేశారు. తీరా పద్దెనిమిది సీట్లు తెచ్చుకుని తుస్సుమన్నది. చివరకు ఆ మెగాస్టార్ కూడా సొంత గ్రామంలో ఓడిపోయారు. ఆ తరువాత తన మెగా మాల్ ను కాంగ్రెస్ సముద్రంలో కలిపేసి కేంద్రమంత్రి పదవిని వెలగబెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం పోగానే బుద్ధిగా సినిమాలు చేసుకుంటున్నారు. చిరంజీవిని అందరూ తెగ విమర్శించేవారు అప్పట్లో.

ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ 2014 లో జనసేన అనే చిన్న దుకాణాన్ని తెరిచారు. ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టినపుడు ఎన్నికల్లో పోటీ చేస్తారు. అందునా పవన్ కళ్యాణ్ లాంటి పవర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినపుడు ఇక ఆ హంగామా మామూలుగా ఉంటుందా? కానీ పవన్ కళ్యాణ్ ప్రారంభంలోనే తన పార్టీని పాకేజీ పార్టీగా మార్చేశారు. ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా తెలుగుదేశం, బీజేపీ చంకన చేరారు. ఆ తరువాత ఆయన అధికారపార్టీని ప్రశ్నించకుండా ప్రతిపక్షంలో ఉన్న వైసిపిని టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు నరనరానా ద్వేషం. నెలనెలా చంద్రబాబు నుంచి మూటలు అందుతాయి అని జనం గుసగుసలాడుకునేవారు. పవన్ కళ్యాణ్ను నమ్ముకుని పార్టీలో చేరిన నాయకులందరికీ చాలా త్వరగానే భ్రమలు వీడిపోయాయి. కొందరు అభిమానులు, ఆయన సామాజికవర్గం వారు మాత్రమే పవన్ కళ్యాణ్ మీద పిచ్చి భ్రాంతులు పెట్టుకుని ఆయనేదో ఊడబొడుస్తాడని ఇంకా నమ్ముతున్నారు.

బీజేపీ, తెలుగుదేశంతో సంబంధాలు వికటించాక (అని పైకి టాక్…లోపల మిత్రులే అంటారు) ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు పవన్. ఆయన ఎక్కడకి వెళ్లినా “సీఎం సీఎం అంటూ అభిమానులు వెర్రికేకలు వెయ్యడం, వారి అరుపులు చూసి నిజంగానే తాను ముఖ్యమంత్రి అయిపోయినట్లు దురహంకారపూరిత ప్రకటనలు చెయ్యడం అలవాటైపోయింది. తీరా ఎన్నికల్లో పోటీ చేసాక జీవితంలోనే కనీవినీ ఎరుగని అత్యంత ఘోరావమానం ఎదురైంది. అన్నయ్య ఒకచోట ఓడితే, తమ్మయ్య రెండుచోట్లా ఓడిపోయి అన్నయ్యే బెటర్ అనిపించాడు. ఎన్నికల్లో ఓడిపోయాక కూడా పవన్ కళ్యాణ్ కు పాకేజీరాయుడు అనే బిరుదు పోలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకుని తన పార్టీకి ఉన్న కాసిని ఆశలను కూడా సమాధి చేసుకున్నాడు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి తీరా నామినేషన్ల సమయం వచ్చేసరికి తుస్సుమనిపించాడు. బీజేపీ పాకేజీకి లొంగిపోయాడని విమర్శలు వచ్చాయి. తెలంగాణ బీజేపి నాయకులు పవన్ ను వెంట్రుకముక్కకన్నా హీనంగా తీసి అవతల పారేశారు. పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి పదమూడు వేల పంచాయితీలకు గాను కేవలం ఇరవై మూడు దక్కించుకుని నవ్వులపాలయ్యారు. తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేస్తామని, ఆ నియోజకవర్గంలో చిరంజీవి గెలిచారని, అక్కడ తమ సామాజికవర్గం వారు ఎక్కువగా ఉన్నారని, గెలుపు మాదే అని మొన్నటిదాకా రంకెలు వేసిన పవన్ కళ్యాణ్ చివరకు గత ఎన్నికల్లో నోటా కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ పాదాలముందు తన జనసేనను తాకట్టు పెట్టేసి నిష్క్రమించారు. జనసైనికులు కూడా పవన్ విన్యాసాలను చూసి పకపకనవ్వుకుంటున్నారు అంటే జనసేన ఎంతగా అప్రతిష్టపాలైందో తెలుస్తుంది.

ఈ పరిణామాలను చూస్తుంటే పవన్ కళ్యాణ్ జనసేన దుకాణాన్ని తెరిచింది కేవలం తన అభిమానులను చూపి పార్టీలనుంచి పాకేజీల కోసమే అని స్పష్టంగా అర్ధం అవుతుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అక్కడ ఎలాగు వైసీపీయే గెలుస్తుందని, పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం దేనికని జనసేన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి ఆ ఒక్కసీటు ఓడిపోయినా వాటిల్లే నష్టం ఏమీ లేదు. జనసేన ఓడితే మాత్రం ఇక దుకాణాన్ని శాశ్వతంగా మూసుకోవాల్సిందే. కాబట్టి గుప్పెటను మూసివుంచితేనే అందులో ఏదో ఉందని ఇతర పార్టీలు భ్రమపడుతుంటాయి. తెరిచాక అక్కడున్నది శూన్యమే అని అందరికీ తెలిశాక ప్యాకేజీలు రావు కదా!

మొత్తానికి జనసైనికుల ఆశలమీద మరోసారి చన్నీళ్ళు చల్లేశారు జనసేనాని! వారిని చూసి జాలిపడాల్సిందే తప్ప ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు!!

 – ఇలపావులూరి మురళీ మోహన రావు,
సీనియర్ రాజకీయ విశ్లేషకులు