ఇదేనా బంగారు తెలంగాణ?

525

కరీంనగర్, మార్చి 14 (న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో న్యాయవాదుల హత్యలు, భైంసాలో నిరంతర ప్రక్రియల అల్లర్లు దాడులు జరగడాన్ని బంగారు తెలంగాణ అంటారా? అని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర ప్రశ్నించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణలో గోరంగా విఫలమైందన్నారు. పట్టపగలు నడిరోడ్డుపై న్యాయవాద దంపతుల జంటహత్య సంఘటనను మరువక ముందే మళ్లీ భైంసాలో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు అల్లర్లు దాడులు జరగడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజల కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తే అనవసరంగా ప్రతిపక్షాలపై నోరు పారేసుకునే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇతర టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన న్యాయవాదుల హత్య, బైంసా అల్లర్ల పై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసి మాట్లాడే టిఆర్ఎస్ పెద్దలు నేడు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలకు శాంతి భద్రతలు కల్పించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా పని చేయడం లేదనేది ఇట్టి ఘటనలతో స్పష్టమవుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామన్న టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి అల్లర్లు, దాడులు, హత్యలతో తెలంగాణను మరో పాకిస్తాన్ తయారు చేయడానికి ప్రయత్నిస్తుందా? టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిందని ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. పట్టపగలు నడిరోడ్డుపై న్యాయవాదుల హత్యలు, బైంసాలో పక్కా ప్రణాళికతో అల్లర్లు దాడులు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరించడం శోచనీయమన్నారు. బైంసాలో కొన్నేళ్లుగా ఇరువర్గాల మధ్య గొడవలు, దాడులు జరిగి తీవ్ర ఆస్తి నష్టాలు జరుగుతున్నాయని తెలిపారు. విచ్చిన్నకర శక్తులు బైంసా ప్రాంతంలో తిరిగి అల్లర్లు సృష్టించి దాడులు జరిపి ప్రాణ, ఆస్తి నష్టం చేశారని, వీటన్నిటికీ కారణం ఎవరు? బైంసాలో నిరంతర అల్లర్ల సృష్టికర్తలు ఎవరు అనే విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. నిన్నటి రోజున భైంసాలో జరిగిన అల్లర్లలో పోలీసులు, రిపోర్టర్లు, హిందూ ధర్మ రక్షకులు తీవ్రంగా గాయపడ్డారని, చాలావరకూ ఆస్తినష్టం జరిగిందని, ఇట్టి ఘటనకు కారణం బాధ్యులు ఎవరు అనే విషయంలో ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసినా వారిపట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడమే నిరంతర బైంసా అల్లర్లకు, దాడులకు కారణమన్నారు. టీఆర్ఎస్ పార్టీకి మిత్ర పార్టీగా వ్యవహరిస్తున్న ఆపార్టీ నాయకుల ఆగడాలతోనే బైంసాలో ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఆయన ఆరోపించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఓ సామాజికవర్గానికి కొమ్ము కావడం వల్ల వాళ్లు రెచ్చిపోయి చెలరేగి పోతున్నారని తెలిపారు. లోగోడ భైంసాలో అల్లర్లకు కారణమైన వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉంటే నేడు మళ్లీ భైంసాలో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేదన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓ వర్గానికి మేలు చేస్తూ మరో వర్గానికి అన్యాయం చేస్తుందని ఇలాంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించాలని ఆయన కోరారు. భైంసాలో మత ఘర్షణలకు పాల్పడుతున్న వారిపట్ల ప్రభుత్వం చూసీచూడనట్టుగా వ్యవహరించడంతోనే పాతబస్తీని తలపించే విధంగా బైంసా తయారయిందని ఆయన ఆరోపించారు. బైంసా తెలంగాణ రాష్ట్రంలో భాగం కాదు.. భారతదేశంలో భాగం కాదు అన్నట్లు కొంతమంది నేతలు వ్యవహరిస్తున్నారని, ఇలాంటి పద్ధతి సరికాదని, మత రాజకీయాలు ప్రోత్సహించడం కూడా ప్రభుత్వానికి మంచిది కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ప్రభుత్వం ఓ వర్గానికి కొమ్ము కాయడం లాంటి చర్యలను తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని, రాష్ట్ర ప్రభుత్వ తన తీరును మార్చుకొని సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని, రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.