పంచ భూతాలతోనే మంచి ఫలితాలు

1359

మానవుని జీవనాన్ని శాసించేవి, సృష్టికి మూలమైనవి పంచ భూతాలు. భూమి, నీరు, ఆకాశము, అగ్ని, గాలి.. వీటిని సక్రమంగా ఉపయోగించటం ద్వారానే మానవుడు తన ఆరోగ్యకరమైన జీవితానికి బంగారు బాటలు వేసుకుంటాడు. అలానే మనం ఒక స్ధలం కొన్నా, ఒక ఇల్లు కొన్నా సుఖమైన జీవితాన్ని ఆ ఇంట్లో సాగించాలంటే అవే పంచభూతాలు కొన్న ఆ ప్రదేశాలలో వాస్తు పరంగా ఉండి తీరాలి. అలా ఉంటేనే ఆ ప్రదేశాన్ని కచ్చితమైన వాస్తుతో ఉన్న స్థలం లేదా ఇల్లు అంటాం. అలాంటి చోట శుభకరమైన ఫలితాలు ఉంటాయి.

నిజానికి వాస్తుశాస్త్రం పంచభూతాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. వాస్తు ప్రకారం గృహ నిర్మాణాన్ని చేపట్టేవారు ప్రకృతికి సంబంధించిన పంచభూతాలకు కూడా తప్పక ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది. అదేసమయంలో పంచ భూతాలకు హిందూ శాస్త్రంలో మంచి ప్రాధాన్యత ఉండటం అందరికీ తెలిసిన విషయమే. ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పులకు తగిన ప్రాధాన్యం ఇస్తూ గృహాన్ని నిర్మించడం వల్ల ఆ గృహస్థులు ఎప్పుడూ సుఖమైన జీవితాన్ని అనుభవిస్తారని వాస్తుశాస్త్రం చెబుతోంది. పంచభూతాలకు అధిదేవతలైనవారి ప్రాముఖ్యాన్ని బట్టి గృహనిర్మాణం జరగడం ముఖ్యమని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇందులో భాగంగా పంచభూతాల అధిపతులకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకున్నట్లైతే గ్రహాల అనుగ్రహంతో యజమానులకు శుభ ఫలితాలు లభిస్తాయి.

ఉదాహరణకు నిప్పుకు అధిపతి అగ్నిదేవుడు కాబట్టి వంటింటిని నిర్మించేటప్పుడు అగ్నిదేవునికి ఇష్టమైన దిక్కును అనుసరించి వంట గదిని అమర్చటం చేస్తే మంచి ఫలితాలను లభిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం రీతిగా పరిశీలిస్తే పంచభూతాల ఆధారంగా ప్లేస్‌మెంట్‌ను నిర్మించుకోవాలి. దీనిప్రకారం వంటగది సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు వైపు ఉండటం మంచిది.

సూర్యరశ్మి వంటగదిపై నుంచి గృహంలోని అన్నీ ప్రాంతాలకు వ్యాపించటం వల్ల సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మొక్కలు పెంచటంలో కూడా సూర్యరశ్మికి అనుగుణమైనటువంటి ప్రాంతాలలో కలప మొక్కలను పెంచితే దుష్టశక్తులు ఇంటి దరిచేరవు. అంతేగాక అభివృద్ది సూచనలు కూడా అధికంగా కానవస్తాయి.

ఒక్కో ప్రదేశాన్ని బట్టి ఈ పంచభూతాలు అన్నీ సరిగా లేకపోవచ్చు. ఆ ప్రభావం కారణంగా వాటిలో నివసించే వారికి రకరకాలైన అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అలాంటపుడు వాస్తు నిపుణులని కలిసి ఆయా ప్రదేశాలనిగాని, ఇళ్లనుగాని చూపించుకొని ఏవైతే సరిగాలేవో వాటిని శాస్త్ర ప్రకారం సమతుల్యంగా చేయంచుకొని సుఖమైన జీవితాన్ని గడపవచ్చు. ఉదాహరణకి కొన్న స్థలంలోగాని, ఇంటిలోగాని ఏదైనా భాగం కోత ఏర్పడితే ఒక విధంగా, నీటి సమస్య అయతే మరో విధంగా, ఇంటి కప్పు దోషం అయతే ఇంకో విధంగా, వంటగదుల్లో ఫ్లాట్ ఫాంల అమరికలో దోషాలుంటే వేరే విధంగా, స్థలంలో గాలి, వెలుతురు సరిగా లేకుంటే ప్రమాద ఘంటికలు మోగుతుంటాయి. ఏవైనా దోషాలుంటే వాటిని చక్కగా వాస్తు ప్రకారం సరిచేయవచ్చు.

అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పంచ భూతాలకు తగిన దిక్కులకు ప్రాముఖ్యత ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. దీనిప్రకారం ఏయే దిక్కులు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూస్తే..

తూర్పు –  ఆరోగ్యం, ఆనందం, గృహంలో శాంతి, సంపద చేకూరటం,
పడమర –  సంతానాభివృద్ది, స్వచ్ఛత, అభివృధ్ది,
ఉత్తరం –  వ్యాపార అభివృద్ది, మంచి భవిష్యత్తు,
దక్షిణం –  అదృష్టం, వినోదం, కీర్తి,
వాయువ్యం –  తండ్రికి మంచి అభివృద్ది సూచకాలు, అధిక ప్రయాణాలు,
నైఋతి –  తల్లికి సౌఖ్యం, వివాహ సఫలం,
ఈశాన్యం –  వృత్తి పరమైన అభివృద్ధి,
ఆగ్నేయం  –  అదృష్టం.

                                                              – చింతా గోపీ శర్మ సిద్ధాంతి 
                                       లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం (భువనేశ్వరిపీఠం) 
                                                              పెద్దాపురం, సెల్:- 9866193557