ఆర్యవైశ్యులకు అండ: మంత్రి పువ్వాడ

324

ఖమ్మం, మార్చి 14 (న్యూస్‌టైమ్): ఆర్య వైశ్యులకు అండగా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ నిలుస్తున్నదని, ఆరేండ్లుగా రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉండటంతో ప్రతి వ్యాపారి ఆనందంగా వ్యాపారాలు చేసుకుంటున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆర్యవైశ్యులకు గతంలో ఏ పార్టీలో దక్కని ప్రాధాన్యం టీఆర్‌ఎస్‌లో దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతోనూ ఎంతోమంది పేదలకు భరోసా వచ్చిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అన్నివర్గాలు సంతోషంగా ఉన్నాయని అన్నారు.

ప్రత్యేకించి ఆర్యవైశ్యులకు అన్నిరకాలుగా తగిన ప్రాధాన్యం ఇస్తుండటం సంతోషకర విషయమని, మన రాష్ట్రంలో చక్కటి వాతావరణం ఉండటంతో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి నేటి వరకు ఖమ్మం నగరంలో స్వేచ్చా వ్యాపారాలకు పూర్తి సహకరించానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో తమ తమ వ్యాపారాలకు ముల్లు కర్ర పట్టి కాపలాగా ఉన్నానని తెలిపారు.

ఇదే రకమైన వాతావరణం కొనసాగాలంటే మనం మళ్లీ టీఆర్‌ఎస్‌కి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. గతంలో రైస్‌మిల్లర్లు, ఇతర వ్యాపారులకు ఎన్నో రకాల వేధింపులు ఉండేవని, ఇప్పుడు అవన్నీ పోయాయని, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఎన్నడూ లేనంతగా స్వేచ్ఛ కల్పించారని అన్నారు. ప్రతి సామాన్యుడు ఇప్పుడు సంతోషంగా ఎవరిపని వారు చేసుకోగల్గుతున్నారన్నారు.

అందుకే తెలంగాణ ప్రభుత్వంకు తమ మద్దతు తెలిపి తెరాస పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ కమల్ రాజ్, చెరుకూరి కృష్ణమూర్తి, వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు,కొప్పు నరేష్, పులిపాటి ప్రసాద్, ఆర్జేసీ కృష్ణ తదితరులు ఉన్నారు.