వీళ్లంతా.. స్కూలు యజమానులట! హ్హ..హ్హ!!

405

టీఆర్‌ఎస్ ఎన్నికల కష్టాలు

గ్రాడ్యుయేట్ ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి వాణీదేవి విజయం కోసం ఆ పార్టీ నేతలు నానా తిప్పలు పడుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నగరంలోని ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టారు. గ్రేటర్ ఎన్నికల్లో మాదిరిగా లైట్ తీసుకుంటే కుదరదని వార్నింగ్ ఇచ్చారు. దానితో నేతలంతా ఎవరికి తోచిన జిమ్మిక్కులు వారు మొదలుపెట్టారు. కొంతమంది నాయకులు స్వయంగా ఓటర్ల వద్దకు వెళుతున్నట్లు చూపిస్తుంటే, మరికొందరు ఓటర్లే తమ వద్దకు వచ్చినట్లు ఫొటోలోల చూపిస్తున్నారు. సరే.. ఆ సినిమా కష్టాలను కాసేపు పక్కకుపెడితే, రోజు రోజుకూ పెరుగుతున్న ‘మద్దతు రాజకీయాలు’ మాత్రం మహా రంజుగాగా మారాయి. రోజుకో చిన్నా చితకా సంఘాలను తీసుకురావడం, వారంతా టీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తున్నట్లు ప్రకటించడం, దానిని మీడియాలో వేయించుకోవడం అలవాటయిపోయింది. నిజంగా వారికి సంఘాలున్నాయా? లేవా? అన్నది నేతలకు అవసరం. తాము కూడా పార్టీకి పనిచేస్తున్నామని చెప్పడమే నాయకుల లక్ష్యం. అయితే ఆ ఫొటోలే ‘మద్దతు యవ్వారాలను’ పట్టిచ్చేస్తున్నాయి. తాజాగా సికింద్రాబాద్‌లో పలువురు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు, టీఆర్‌ఎస్ అభ్యర్ధికి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఉంచిన ఫొటోలు స్థానికులు, పార్టీ కార్యకర్తలను ఆశ్చర్యపరిచాయి. సికింద్రాబాద్‌లోని ‘అన్ని ప్రైవేటు విద్యాసంస్ధలూ’ టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణికే మద్దతునివ్వాలని నిర్ణయించారన్నది ఆ ప్రకటన సారాంశం. అంతవరకూ బాగానే ఉంది. అయితే డిప్యూటీ స్పీకర్ పద్మారావును కలసి మద్దతు ప్రకటించిన ఆ ‘అన్ని ప్రైవేటు సంస్థల’ యజమానుల్లో ముగ్గురు తప్ప, మిగిలిన వారంతా స్థానిక టీఆర్‌ఎస్ నాయకులే ఉండటం ఆశ్చర్యపరిచింది.  ఏం చేస్తాం? ఎవరి కష్టాలు వారివి! అలాగే ఎవరి పబ్లిసిటీ వారిది!!