విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకించండి

697

విశాఖ స్టీల్‌ ప్లాంటు వెనుక 32 మంది ప్రాణ త్యాగం, వందల మంది రక్త తర్పణం, ఏడుగురు సిపిఎం, సిపిఐ పార్లమెంటు సభ్యుల, 52 మంది సిపిఎం, సిపిఐ శాసన సభ్యులతో సహా 67 మంది రాజీనామా, విద్యార్థులు, యువకుల మొక్కవోని పోరాటం, ముక్కోటి ఆంధ్రుల ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ ఉద్యమ స్ఫూర్తి ఉంది. రాజీనామా చేసిన వారిలో పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, కొల్లా వెంకయ్య, రావి నారాయణ రెడ్డి, నల్లమల గిరిప్రసాద్‌, తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న, వావిలాల గోపాలకృష్టయ్య వంటి ఉద్యమ స్ఫూర్తిప్రదాతలు ఉన్నారు. అమృతరావు గారి ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమానికి ఊపునిచ్చింది. రాష్ట్రానికి నాటి కాంగ్రెస్‌ చేయబోయే ద్రోహాన్ని అడ్డుకొని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకున్నాం.

అలా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ స్థానికులకు, రాష్ట్రానికి, దేశానికి, దళితులు, గిరిజనులు, ఒబిసి లకు, వికలాంగుల అభివృద్ధికి ఎంతో మేలు చేసింది. కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూ. 5 వేల కోట్ల లోపు పెట్టుబడికి… స్టీలు ప్లాంటు కేంద్రానికి తిరిగి రూ. 42 వేల కోట్ల పన్నులు, డివిడెండ్‌ ఇచ్చింది. రాష్ట్రానికి రూ. 8 వేల కోట్లు పన్నులు చెల్లించింది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మొత్తాన్ని గుండుగుత్తగా ప్రారంభ పెట్టుబడికి (రూ.5 వేల కోట్లకి) అమ్మేయాలని నిర్ణయించింది. నిర్వాసితుల దగ్గర ఆనాడు ప్రభుత్వం తీసుకున్న భూమిని ఎకరం రూ.1250 కే అమ్మేయాలన్నది మోడీ ప్రభుత్వ నిర్ణయం. పొలాలు, ఇళ్లతో సహా సర్వం ప్రభుత్వానికి అందించిన నిర్వాసితుల త్యాగాన్ని కార్పొరేట్లకు ఎలా ధారాదత్తం చేస్తున్నారో దీన్నిబట్టే అర్ధమౌతోంది.

విశాఖ ఉక్కు నేరుగా 40 వేల మందికి ఉద్యోగం ఇచ్చింది. సహాయక పరిశ్రమ, ట్రాన్స్‌పోర్ట్‌, నిర్మాణ రంగంతో సహా పరోక్షంగా లక్షల మందికి ఉద్యోగం, ఉపాధి కల్పించింది. స్థానిక నిర్వాసితులకు 8 వేల మందికి నేరుగా ఉద్యోగం ఇచ్చింది. మిగిలిన నిర్వాసితులను కాంట్రాక్టు కార్మికులుగా తనలో భాగం చేసుకుంది. రాజ్యాంగం ప్రకారం 4025 మంది ఎస్‌.సి, ఎస్‌.టి లను స్టీలు ప్లాంటు ఉద్యోగులుగా నియమించింది. 3288 ఓబిసి లకు, 273 వికలాంగులకు, 5071 నిర్వాసితులకు ఉద్యోగం ఇచ్చింది. వారి పిల్లలు ఇంజనీరింగ్‌, పిజీ వంటి ఉన్నత చదువులు చదువుకునేలా ఆర్థిక స్తోమత కలిగించింది. ప్రభుత్వ రంగ సంస్థ కనుక వీరికి ఈ అవకాశం వచ్చింది. అదే ప్రైవేట్‌ సంస్థ అయితే దళితులకు, గిరిజనులకు, ఓబిసిలకు, వికలాంగులకు రిజర్వేషన్లు ఇస్తుందా?

స్టీల్‌ప్లాంటుకు రూ.18 వేల కోట్లు అప్పు వున్నందున అమ్మేస్తానంటున్నారు. గత ఆరేళ్ళలో కార్పొరేట్‌ కంపెనీలు మన జాతీయ బ్యాంకుల నుండి అప్పులు చేసి తీర్చని రూ.8 లక్షల కోట్లను మోడీ ప్రభుత్వం మాఫీ చేసింది. అదేవిధంగా స్టీల్‌ ప్లాంటు అప్పు మాఫీ చేయవచ్చు కదా? టాటా స్టీల్‌ ప్లాంట్‌కు రూ. లక్ష కోట్లు అప్పు ఉంది. ఎస్‌సిఆర్‌ స్టీల్‌కు రూ.56 వేల కోట్లు అప్పు ఉంది. వాటికి లేని ఇబ్బంది విశాఖ స్టీలుకు ఏమిటి? దీన్నిబట్టి అర్ధమయ్యేది ఏమిటంటే తను అధికారంలో ఉండగా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్‌ పరం చేసి ప్రజల సంపదను కార్పొరేట్లకు అప్పజెప్పే కుట్ర తప్ప వేరే ఏమీ కాదు.

మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేట్‌ పరం చేసేస్తాం. లేదా మూసేస్తాం అని మోడీ ప్రభుత్వం ప్రకటించేసింది. 30 సైనిక స్కూళ్ళను ప్రైవేట్‌ వాళ్లు పెట్టుకునేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదించింది. రైల్వేలను ప్రైవేట్‌ పరం చేస్తానంది. రైల్వేలో 3 లక్షల మంది ఉద్యోగులను తీసివేస్తానని ప్రకటించింది. ప్రభుత్వ బ్యాంకులను, ఎల్‌ఐసిలను ప్రైవేట్‌ పరం చేయనుంది. ప్రభుత్వ రంగమే లేకుంటే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ప్రైవేట్‌ రంగం కల్పిస్తుందా? ఘనీభవించిన కుల వ్యవస్థలో ఎస్‌.సి, ఎస్‌.టి, ఓబిసి సామాజిక తరగతులకు ప్రైవేట్‌ రంగంలో న్యాయం జరుగుతుందా. అణగారిన సామాజిక తరగతులు మరలా అన్యాయమైపోవా?

ప్రైవేటీకరణలో ప్రజల పాత్ర….

వ్యాపారం సర్కారు పని కాదు, ప్రైవేటీకరణతోనే పురోభివృద్ధి అనుకుంటే అందులో ప్రజల పాత్ర ముఖ్యంగా, అట్టడుగు వర్గాలు, వెనుకబడిన కులాల భాగస్వామ్యం ఏమిటో, ప్రైవేటీకరణలో వారి పాత్ర ఏమిటో కూడా తేల్చుకోవాల్సి ఉంది. రిజర్వేషన్లతో తమ అవకాశాలకు గండి పడుతున్నాయనుకునే వర్గాలకు ప్రైవేటీకరణ కచ్చితంగా సంతోషాన్నిచ్చే విషయం. కానీ ప్రభుత్వం నిర్వహణలో అందే సాధికారిక హక్కులు, రిజర్వేషన్ల ద్వారా సంక్రమించిన ఫలాలు…కింద కులాలకు ఇకపై శాశ్వతంగా దూరమవుతాయి. గ్రూప్‌ డి, క్లాస్‌ 4 ఉద్యోగాలు సైతం దళిత కులాలకు అందకుండా పోతాయి. ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా సామాజిక వివక్షను ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలే తొలగించలేకపోయాయి. ఇక ప్రైవేట్‌ రంగంలో అలాంటి వాటిని ఏ మాత్రం ఆశించలేం.
ఊరి చివర పల్లెలకు పరిమితం అయిన కులాల ప్రజలు ఇక ముందు కూడా ఇలాంటి దుర్భర పరిస్థితుల్లోకి వెళతారు. కులం ద్వారా సంక్రమించిన సామాజిక హోదాయే అప్రకటిత రిజర్వేషన్‌గా అమలవుతున్న సమాజంలో అవకాశాలను కూడా కులమే కల్పిస్తుంది. ఇప్పుడు ప్రైవేటీకరణ పుణ్యాన ఆ కొద్ది అవకాశాలు కూడా బలహీనులకు దక్కవు. కులం, మతం ప్రాతిపదికన జనాన్ని విడదీసి అంతిమంగా తమ వర్గ ప్రయోజనాలను కాపాడుకునే కుట్రలో భాగమే ఈ కొత్త పురోభివృద్ధి నినాదాలు. మొదట విద్యను దూరం చేయడం, తర్వాత ఉపాధి అవకాశాలకు గండి కొట్టడం, తద్వారా వారు కోరుకున్న మనువాద ధర్మాన్ని అమల్లోకి తీసుకురావడం ఇదే అసలు లక్ష్యం.

అందుకే విశాఖ ఉక్కును రక్షించుకోవడం దేశానికి, రాష్ట్రానికి ఎంత అవసరమో అంతకు మించి ఎస్‌.సి, ఎస్‌.టి, ఓబిసీలకు అవసరం. ఒక వైపు దేశ ప్రయోజనాలు, మరో వైపు రాష్ట్ర ప్రయోజనాలు, ఇంకో వైపు సామాజిక న్యాయం దెబ్బతీస్తున్న ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు విభజన సందర్భంగా విభజన చట్టంలో పార్లమెంట్లో కడప స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని వాగ్దానాన్ని గత ఆరు సంవత్సరాలుగా బిజెపి కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు ఈ హక్కు కోసం వైసిపి రాష్ట్ర  ప్రభుత్వం  ప్రతిపక్ష టిడిపి గాని ప్రశ్నించే జనసేన పార్టీ గాని మాట్లాడటం లేదు ఎన్నికల ముందర మాత్రం ప్రత్యేక హోదా పోరాడే సాధిస్తామని ప్రకటించిన పార్టీలు అడ్రస్ లేవు.

                                                                                           – సి హెచ్ చంద్రశేఖర్
                                                                                     సిఐటియు కడప జిల్లా కార్యదర్శి