సద్గుణాలే మహోన్నత వ్యక్తిత్వానికి సోపానాలు.

463

సరిసంపదలకంటే గుణసంపద మనిషి ని మహోన్నతుని చేస్తుంది. సంస్కారగుణం తరగని యశస్సుకు సోపానం. విలువలే మనిషికి నిజమైన ఆభరణాలు.పెద్దల మాట “చద్దన్నం మూట”అనే నానుడి అక్షరసత్యం. నాటి పెద్దలు తమ అనుభవ సారాంశంతో పలికిన హితోక్తులు సదా వాంఛనీయం- అనుసరణీయం. నీతి కథలతో సద్గుణాలు అలవడేవిధంగా సంస్కార వంతమైన పెంపకాలతో సాగిన నాటితరం ఆలోచనలు నేటి తరానికి పనికి రావడం లేవు.కృతకమైన,ఆకర్షణీయమైన జీవనానికి అలవాటుపడిన యువతకు విలువల ప్రాశస్త్యం గురించి వివరించినా ప్రయోజనం శూన్యం. నడుస్తున్న (అ)నాగరిక చరిత్ర భవిష్య మానవాళి మనుగడకు విఘాతంలా మారింది.

భౌతిక సంపదల్లో మానవుడు ఉన్నతుడే…మానసిక సంపదల్లో అధముడే అని చెప్పకతప్పదు. సుఖసౌఖ్యాలు,భోగభాగ్యాలు అనుభవించడానికి మానవ మేథస్సు అత్యద్భుతంగా వినియోగపడింది.ఎంతగా మానవ విజ్ఞానం పెరిగినా బుద్ధి మాత్రం పాతాళానికి దిగజారింది. స్వచ్ఛమైన మనసులో కల్మషం మొదలైనది.మానవ వాంఛలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి.సృష్టిలో మానవుడంటే ప్రథముడు కాదు అథముడు అనే భావన క్రమేపీ పెరిగిపోతున్నది. విజ్ఞానం,సంస్కారం,వినయం,వివేకం వంటి అమూల్యమైన గుణాలతో వికసించవలసిన మానవ మేథస్సు కృత్రిమమైన సంపదలకోసం వెంపర్లాడుతున్నది. సహజమైన గుణాలను త్యజించి,కొరగాని కోరికలకోసం కలలు కంటూ వంచనతో కూడిన జీవన విధానానికి అలవాటుపడిన నేపథ్యంలో మనిషిలో మానవ లక్షణాలు మిథ్యగా మారిపోయాయి. సద్గుణాలను వదలిపెట్టి, ఆధునికత్వం పేరుతో కృత్రిమంగా జీవించే మనిషి జీవితంలో కరిమబ్బులు కమ్ముకుంటున్నాయి. సకల సద్గుణ సంపదతో విరాజిల్లే నాటి రోజులు నేటి కాలంలో దుర్భిణీ వేసి వెదకినా కానరావడం లేదు.

నిండైన గుణాలు మెండుగా ఉంటే వ్యక్తిత్వం వికసిస్తుంది. సమాజం గౌరవిస్తుంది. లేని గుణాలను అపాదించుకుని,కృతకమైన గుణాలతో ఖ్యాతి నార్జించాలను కోవడం వృథాప్రయాస గానే మిగులుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం వలనే వ్యక్తిత్వానికి వన్నె చేకూరుతుంది.

గాలికి వంగే చెట్టు తుఫానును సైతం తట్టుకుని నిలబడుతుంది. పొడవైన చెట్టు అననుకూలమైన పరిస్థితుల్లో నిటారుగా నిలబడితే, గాలివాటానికి వంగకపోతే నేలపై ఒరగక తప్పదు.మనిషి కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే గుణం లేకపోతే వృథాగానే మిగిలిపోతాడు. అహంకారం,ఢాంబికం,వాచాలత్వం వంటి దుర్గుణాల వలన మనిషి మానసిక పరిపక్వత కోల్పోయి మసకబారడం ఖాయం. “గంగిగోవుపాలు గరిటడైనను చాలు… ” అన్న చందంగా మనలో ఉన్న సద్గుణాలు కొన్నయినా చాలు మన వ్యక్తిత్వాన్ని ఇనుమడింప చేయడానికి. కృతకమైన డాంభికాల వలన క్షణికమైన స్వీయ మానసికానందం లభించవచ్చునేమో గాని దీర్ఘకాలంలో చీత్కారాలనే సత్కారాలను లోకం బహూకరిస్తుంది. కృతకమైన సంపదలకోసం,తగని కీర్తి కోసం ప్రాకులాడే నైజం కొంతవరకైనా సడలించుకుని, వాస్తవంగా జీవించే విధానాన్ని అలవరచుకోవాలి.

మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా,విజ్ఞానం వికసించినా ఇంగిత జ్ఞానం ఇసుమంతైనా కానరావడం లేదు. అవకాశం రాకకొందరు నిర్లిప్తంగా ఉన్నా, అవకాశమొస్తే శివుని శిరస్సుపై తాండవమాడే శివగంగలా చెలరేగి పోవడానికి సంసిద్ధులే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మానవుల ఆశకు అంతం అనేది లేకుండా పోయింది. అత్యాశకు ఆకాశమే హద్దుగా మారింది. స్వార్ధం పడగవిప్పి బుసలు కొడుతున్నది. కాసుల వేటలో పడి మానవత్వాన్నే అమ్మేసే ప్రబుద్ధులు కొందరైతే, అత్యాశతో అలవికాని కోర్కెలతో అరాచకవాదం వైపు పయనిస్తున్న వారు మరికొందరు. పంచభూతాలను పరమాన్నంలా భోంచేస్తున్న వారు కొందరైతే,వీలైతే ఇతర గ్రహాలను సైతం తమ ఆధిపత్యం లోకి తెచ్చుకుని, తిష్ఠవేయాలనే దురాశ కొందరిది. దురాశతో దూరాలోచన మరచి, విజ్ఞత క్షీణించి,వివేకాన్ని కాటికి సాగనంపి,విచక్షణ కోల్పోయి,అహంకార మదంతో చెలరేగి పోయే మానవ మస్తిష్కాలకు రాబోయే విపత్కర పరిణామాల గురించి యోచన చేసే తీరికెక్కడిది? శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానంతో సుఖవంతమైన జీవితాన్ని ఆస్వాదించే మానవజాతి ఇంకా ఏదో సాధించాలనే తపనతో తనను తానే వంచించుకుని,హింసించుకునే హీన స్థితికి దిగజారింది. ఆకాశహర్మ్యాలలో విహరిస్తూ,చంచల స్వభావచిత్తులై నేలవిడిచి సాము చేస్తున్న స్వార్ధ మానవలోకం మానవ పరిణామ క్రమాన్ని, మొదటికి తెచ్చి,మునిగి పోవడానికి సిద్ధంగా ఉంది. మనిషి మనిషికీ సంబంధాలు లేవు. ఒక రాష్ట్రానికి,మరొక రాష్ట్రానికి సఖ్యత లేదు..ఒక దేశానికి మరొక దేశానికి మధ్య అగ్గిపుల్ల వేస్తే భగ్గుమనేటంత వైరం నెలకొంది. ప్రపంచమంతా కుగ్రామంలా మారినా, రవాణా సౌకర్యాలు పెరిగి, ఇతర దేశాలతో వర్తక వాణిజ్య సంబంధాలు పెరిగినా, మనిషి హృదయంలో ఇంకా అసంతృప్తి జ్వాలలు కార్చిచ్చులా దహిస్తున్నాయి.

ఇతర గ్రహరాశుల గమనం గురించి అధ్యయనం చేస్తూ, గ్రహదోషాలను సవరించడానికి ప్రయత్నిస్తున్న మానవుడు తనకు పట్టిన అనైతిక దోషాన్ని నిలువరించలేకపోవడం విడ్డూరం.

ఏదో సాధించాలనే తపనతో తనను తానే వేధించుకుతినే స్థితికి మానవుడు దిగజారి పోయాడు.”స్వార్ధంలో పరమార్ధం- సూక్ష్మంలో మోక్షం” వెదుకులాటలో పడి తన అస్థిత్వాన్ని కోల్పోతున్నాడు. కోట్లకోసం కుమ్ములాటలు…ఆస్తుల కోసం ఆరాటాలు…అలవికాని కోరికల కోసం పోరాటాలు…ఇదే మానవనైజం.”తన స్వార్ధమే తనకు రక్ష “అనే రీతిలో సమాజహితాన్ని గాలికొదిలి,స్వప్రయోజనాలకోసం విలువలకు తిలోదకాలిచ్చి, హీనంగా జీవిస్తూ,హీనత్వం లోనే శిఖరాగ్రమంత ఉన్నతిని గాంచి ఊహల్లో ఊరేగుతున్న ‘మనిషి’ మానసిక పతనం సమాజానికి శాపం.స్వార్ధం,ద్వేషం,అసూయ,అహంకారం,అవినీతి వంటి మనో జాఢ్యాలు వైద్యపరిభాషకు అందనంత ఎత్తులో తిష్ఠవేశాయి.

మనిషి పెరిగాడు – మనసు తరిగింది.మానవతత్వం మారింది- మానవత్వం నశించింది. విజ్ఞానం పెరిగింది.వికాసం క్షీణించింది. మనిషి విజ్ఞాని,మానసికంగా అజ్ఞాని.సంస్కారం లోపించింది- సహనం నశించింది. తాను సంపాదించిన ధనంతో తృప్తిపడక, ధనమదంతో ఇతరులను వేధించుకుతినే పైశాచికత్వం మనిషిని అధః పాతాళానికి దిగజార్చింది.ఆధునిక మనిషిలో అసలు మనిషి అదృశ్యమై,మనసులేని రాతిమనిషి, ప్రాణమున్న మరమనిషి ఉద్భవించాడు.స్వచ్ఛమైన మనసు స్థానంలో కృత్రిమమైన మనసు మొలకెత్తింది. కడుపులో కత్తులు పెట్టుకుని, మనసులో కాఠిన్యం నింపుకుని, వదనంలో అరువు తెచ్చిన చిరుదరహాసాన్ని ధరించి కృత్రిమ కౌగిలింతలతో నటనా కౌశలం ప్రదర్శిస్తూ, మహానటులను తలపించే రీతిలో ఆత్మవంచనతో బ్రతికేస్తున్నాడు నేటి మనిషి.కోట్లకు పడగలెత్తినా గుప్పెడు మెతుకులకు నోచుకోడు.అనారోగ్యంతో ఆసుపత్రుల వెంట పరుగులు…వైద్యల చికిత్సకు లొంగని రోగాలు…ఆకలి దహిస్తున్నా తినలేని దుస్థితి.

లెక్కలేని ధనం అక్కరకు రాని చుట్టంలా వెక్కిరిస్తుంటే భోషాణాల్లో మూలుగుతున్న నల్లధనానికి రెక్కలొచ్చి ఎగిరిపోకుండా అహర్నిశలు కాపలా కాస్తూ అందులోనే పరమానందం పొందే లోభగుణం సకల దుర్గుణాల్లో మహాచెడ్డగుణం.

ధనార్జనకే జీవితమన్నట్టు బ్రతికేస్తే ఆ జీవితానికి అర్ధం నిఘంటువుల్లో భూతద్దంతో వెదకినా దొరకదు.శక్తియుక్తులన్నీ స్వార్ధానికి ఖర్చయిపోయే ఇంధనంలా మారిపోతే, వ్యాపారవ్యూహాల్లో,స్వార్ధ చింతనలో తలమనకలై నిజమైన ఆనందాన్ని వదిలేస్తే,చివరికి మనశ్శాంతి కరువై, తన మనసుకు తానే బరువై తనువు చాలించే కోటీశ్వరుల కథలన్నీ కన్నీటి కావ్యాలే- మానసిక వేదనలే.భూగోళమంతా భగ్గుమంటున్నది. కాలుష్య భారంతో జనవాహిని అల్లాడిపోతున్నది. కల్తీ సరుకులతో మానవారోగ్యం మంచంపై పడింది. పీల్చేగాలి,త్రాగే నీరు,తినే తిండి విషతుల్యమైపోయింది.భూ ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పర్యావరణం ప్రమాదంలో పడింది. ప్రకృతి ప్రకోపానికి మానవాళి కకావికలమైపోతున్నది. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బంగారు బాతు గుడ్డు లాంటి భూగర్భసంపద స్వార్ధపూరితమైన ఆలోచనలతో కొల్లగొట్టబడుతున్నది. ఇంధన వనరులు తరిగిపోతున్నాయి. పాడి పంటలన్నీ విచ్ఛిన్నమైపోతున్నాయి.మనిషికి నిలువ నీడకూడా దొరకని పరిస్థితులు దాపురిస్తున్నాయి. భూగోళం నిర్జీవమైపోతే మానవగతి ఏమౌతుంది? ఇతర గ్రహాలు నివాసయోగ్యమా? ఇది సాధ్యమా?

భవిష్య పరిణామాలు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయో తెలిసి కూడా చెట్టు కొమ్మపై సుఖనిద్ర పోయే మనిషి నిర్లిప్తత, నిర్లక్ష్య ధోరణి విభ్రాంతి కలిగిస్తున్నది. రాబోయే కాలంలో మానవ మనుగడ దుర్లభమని తెలిసినా, మనిషిలో స్వార్ధ చింతన పోలేదు. కాసుల కక్కుర్తి కోసం విలువలను చంపేసి,సాటి మనుషుల బ్రతుకులను దుర్భరం చేసి, పైశాచికానందం పొందుతూ జీవించడం ఆత్మహత్యాసదృశమే.
యుద్ధాలతో నశించిపోతుందనుకున్న మానవాళి స్వార్ధంతో, అసూయాద్వేషాలతో, పైశాచికమైన మానసిక ప్రకోపాలతో, విలువల విధ్వంసంతో అంతరించి పోయే ప్రమాదం పొంచి ఉంది.ఈ భయంకరమైన పరిస్థితులనుండి మానవుడు బయటకు రావాలి. స్వార్ధం విడనాడాలి…ప్రకృతిని సంరక్షించాలి. ఆశలను అదుపులో పెట్టుకుని,మానవజాతి మనుగడ పది కాలాలు వర్ధిల్లే విధంగా నైతిక ప్రవర్తనను తీర్చిదిద్దుకోవాలి. నేటి ప్రపంచంలో చోటు చేసుకుంటున్న అనర్ధాలకు మూలకారణాలను అన్వేషించాలి. నేలవిడిచి సాము చేసే సాహసానికి ఒడిగడితే అన్నవస్త్రాల కోసం పోరాడితే ఉన్న వస్త్రాలు ఊడిన చందంగా మానవ పతనం తథ్యం.

-సుంకవల్లి సత్తిరాజు(సామాజిక విశ్లేషకులు)
9494703463.