వైసీపీ..‘ఉక్కు’రిబిక్కిరి!

742

అదనుచూసి దెబ్బతీసిన బీజేపీ
పోలింగ్ ముందురోజు వైసీపీకి సెగ
జగన్.. కింకర్తవ్యం?
కష్టాల్లో ‘కమలం’
‘సైకిల్’ స్పీడందుకుంటుందా?
( మార్తి సుబ్రహ్మణ్యం- 9705311144)

సరిగ్గా మున్సిపోల్స్‌కు ఒక్కరోజు ముందు.. కేంద్రంలోని బీజేపీ సర్కారు కొట్టిన ఒక్క దెబ్బకు, అధికార వైసీపీ రాజకీయంగా చిక్కుల్లో పడాల్సివచ్చింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను తెగనమ్మేది ఖాయమని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ చేసిన ప్రకటన, విజయపుటంచున నిలిచిన వైసీపీని కష్టాలపాలుచేసింది. నిర్మలాసీతారామన్ ప్రకటనతో విశాఖలో అగ్గిరాజుకుంది. కార్మికులు అర్ధరాత్రి నుంచే రోడ్డెక్కారు. వైసీపీ ఎమ్మెల్యేలను నిరసనకారులు ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. అటు బీజేపీకి సైతం ఈ వ్యవహారం ప్రాణసంకటంగా పరిణమించింది. ప్రధాని మోదీ-అంబానీ-అదానీలకు నిరసనగా దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. మొత్తంగా ప్రశాంతతకు మారుపేరయిన విశాఖ, ఇప్పుడు ఆందోళనలతో అగ్నిగుండంగా మారింది. హటాత్తుగా మారిన ఈ పరిణామాలు, ఎన్నికల్లో రాజకీయంగా ఎవరికి లాభిస్తాయన్న ఆసక్తి నెలకొంది.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడతామంటూ నిన్నటివరకూ హామీలిచ్చిన వైసీపీ-బీజేపీ నాయకత్వాలు, ఇప్పుడు అందుకు భిన్నంగా స్పందించిన కేంద్ర ప్రకటనతో ఖంగుతినాల్సి వచ్చింది. సోము వీర్రాజు నాయకత్వంలోని బీజేపీ బృందమయితే, ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రిని కలిసింది. విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టిన సోము-జీవీఎల్, విశాఖ ఉక్కుకు వచ్చిన నష్టమేమీలేదన్నారు. ఒక చిన్న ట్వీట్‌ను పట్టుకుని, బీజేపీని అప్రతిష్ఠ చేయడమేమిటని ఎదురుదాడి చేశారు. కేంద్రం అధికారికంగా ప్రకటించిందా అని మీడియాను నిలదీశారు. ఇప్పుడు స్వయంగా కేంద్రమే ఉక్కు ఫ్యాక్టరీ అమ్మడం ఖాయమని తేల్చడంతో, బీజేపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకమాదిరిగా మారింది.

నిజానికి రాష్ట్రంలో దశాబ్దాల క్రితమే విశాఖ బీజేపీకి పెట్టనికోట. టీడీపీ-కాంగ్రెస్ బలంగా ఉన్న రోజుల్లోనే, మేయర్‌ను గెలిచిన చరిత్ర ఉంది. గత కౌన్సిల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా, బీజేపీ-టీడీపీ అభ్యర్ధి మాధవ్ గెలిచారు. తాజా పరిణామాలతో విశాఖలో ఒక్క సీటు గెలిచే మాట అటుంచి, కనీసం నోటాకు మించి ఓట్లు వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ నేతలే ఆందోళనతో ఉన్నారు.

ఇక అధికార వైసీపీకి ఈ పరిణామాలు శరాఘాతమే. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీకి 65 డివిజన్లు వస్తాయని నిఘా వర్గాల అంచనా. ఈ సమయంలో కేంద్రప్రకటన తమ విజయావకాశాలను దెబ్బతీస్తాయని వైసీపీ వర్గాలు ఆందోళనతో ఉన్నాయి. విశాఖ స్టీల్‌పై సీఎం జగన్, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఇప్పటికే విశాఖ ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. తాజా ప్రకటనతో రోడ్డెక్కిన ఆందోళనకారులు, వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డుకుంటున్న ఆగ్రహం చూస్తే, ఈ ప్రభావం ఎన్నికలపై ఉంటుందని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. అయితే అది ఏ స్థాయిలో ఉంటుందని చెప్పలేమంటున్నారు.

పోలింగ్‌కు ఒకరోజు ముందు ఇలాంటి ప్రకటన చేసిన కేంద్రంపై, వైసీపీ నేతలు కారాలుమిరియాలు నూరుతున్నారు. తమను రాజకీయంగా దెబ్బతీసేందుకే, కేంద్రం ఈ ప్రకటన చేసిందని అనుమానిస్తున్నారు. తాజా పరిణామాలతో, ఉత్తరాంధ్ర వైసీపీ ఎమ్మెల్యే-ఎంపీల రాజీనామా డిమాండుకు ఆజ్యం పోసినట్టయింది. కేంద్రాన్ని నిలదీయలేని వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకోవడంతో, అటు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాత తాను కూడా రాజీనామా చేస్తానని విశాఖ వైసీపీ ఎంపీ గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు కేంద్రం నుంచి స్పష్టత వచ్చినందున, మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారం రాజీనామా చేస్తారా? లేదా అన్నది చూడాలి.

కాగా తాజా ప్రకటన తమ పార్టీకి నష్టం కాదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అది బీజేపీకే నష్టం తప్ప తమకు కాదంటున్నారు. జగన్ ప్రకటనను ప్రజలు నమ్ముతున్నారని, కాకపోతే ఈ పరిణామాలు కొద్దిమేరకు టీడీపీకి అనుకూలంగా ఉండవచ్చన్నది వైసీపీ నేతల అంచనా.

ఇక ఈ పరిణామాలు టీడీపీకి రాజకీయంగా ఎంతవరకూ లాభిస్తుందన్న చర్చ జరుగుతోంది. ఇటీవలి చంద్రబాబు విశాఖ పర్యటనకు సానుకూల స్పందన లభించింది. అయితే అది గంపగుత్తగా తమ అభ్యర్ధులను గెలిపించేంత స్థాయిలో లేదని ఆ పార్టీ వర్గాలే చెప్పాయి. ఈ క్రమంలో వెలువపడిన కేంద్రప్రకటన టీడీపీ ఆశలను మరింత చిగురింపచేశాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రకటన తర్వాత విశాఖలో జరుగుతున్న ఆందోళనను నిశితంగా పరిశీలిస్తున్న టీడీపీ నాయకత్వం, దానిని తనకు పూర్తి అనుకూలంగా మలచుకునే వ్యూహంలో నిమగ్నమయింది. ఇప్పటికే ఎమ్మెల్యే గంటా తన పదవికి రాజీనామా చేశారు.

ఎన్నికల ముందు హటాత్తుగా తెరపైకొచ్చిన ఈ అంశం నేపథ్యంలో, సీఎం జగన్ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. ప్రత్యేక హోదా కోసం గతంలో రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు, తాజా విశాఖ అంశంలో జగన్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారోనని ఎదురుచూస్తున్నారు. వైసీపీ ఈ అంశంలో బీజేపీనే లక్ష్యంగా చేసుకుని పోరాడాల్సి ఉంటుంది. మరి సీఎం జగన్ అంత ధైర్యం చేస్తారా? అన్నదే ప్రశ్న.