శ్రీలక్ష్మికి మళ్లీ పదోన్నతి

926

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి వై.శ్రీలక్ష్మికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని తాత్కాలిక(అడ్‌హక్‌) పదోన్నతిగా పేర్కొంది. 1988 బ్యాచ్‌కు చెందిన శ్రీలక్ష్మి కొన్ని నెలల క్రితమే తెలంగాణ కేడర్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు వచ్చారు. 2021 జనవరి 18న ఆమెకు ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం ఉద్యోగోన్నతి కల్పించింది. ఆమెపై పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల్లో తీర్పునకు లోబడి ఈ పదోన్నతి ఉంటుందని ప్రభుత్వం అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పుడు మళ్లీ ఆమెకి ‘అబౌ సూపర్‌ టైమ్‌ స్కేల్‌’కు పదోన్నతి కల్పించింది. ఉద్యోగోన్నతి తర్వాత ఆమె ప్రస్తుతం నిర్వహిస్తున్న పురపాలకశాఖకే ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది. శ్రీలక్ష్మితో పాటు, 1991 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్‌ అధికారులు జి.సాయిప్రసాద్‌, అజయ్‌ జైన్‌, ఆర్‌.పి.సిసోడియా, సుమితా దావ్రాలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. వారిలో సుమితా దావ్రా ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. సాయిప్రసాద్‌, అజయ్‌ జైన్‌, సిసోడియా పదోన్నతి తర్వాత ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న పోస్టుల్లోనే కొనసాగనున్నారు.