గోలీసోడా…

663

” నెత్తిమీద గంగ ఉన్న ఈశ్వరుడైనా
నిత్యసుధలు తాగుతున్న‌ దేవతలైనా
ఆంధ్రా సోడా కోరికోరి తాగుతారోయ్!
అది లేకుంటే వడదెబ్బకు‌ వాడతారోయ్?

ఒక్కగుక్క తాగిచూడు మండు టెండలో
ఆ హిమాలయం‌ చల్లదనం నీ గొంతుకలో!
రాళ్లు తిని తాగితే జీర్ణమవ్వాలి
ఈ నీళ్లు తాగితే సగం కడుపు నిండాలి

సోడా సోడా ఆంధ్రా సోడా
గోలీసోడా జిల్ జిల్ సోడా
సోడా తాగు తెలుగోడ చల్లని సోడా
దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా!
ఇది పద్మనాభం నటిస్తూ ఆలపించిన సినీ సోడాగీతం. అప్పటికీ-ఇప్పటికీ దీనిస్ధానం అందరి మదిలో సుస్ధిరం. ఇప్పుడంటే సోడా బండి / సోడా బుడ్డి రూపు మారింది కానీ ఓ తరం ముందు వారికి ఇది బాగా దగ్గరైన శీతల పానీయం.
ఇవాళ మనమధ్య నుంచి సోడా బుడ్డి / బండీ / బుడ్డి నుంచి వచ్చే కూతలు అన్నీ కనుమరుగయ్యాయి. మా గుంటూరులో అయితే సోడాబండి కొత్తరూపుని సంతరించుకుంది. కానీ సోడాబుడ్డి బండి నుంచి బయటకు తీసి.. భుజం మీద దానిని పెట్టి దానిలోపల ఉన్న గోలీని గట్టిగా చూపుడు వేలితో నోక్కితే కుయ్ మంటూ బుడ్డి అరచే ఒకరకమైన కూత భలే వినసొంపుగా ఉంటుంది. షష్టిపూర్తి కి చేరుకున్న చాలామందికి వారి చిన్నతనంలో ఈ సోడాయే పెద్ద శీతల పానీయం. గోల్డుస్పాట్ పానీయం చెంత నోరూరిస్తున్నా పేదవాడికి ఇదే పది పైసలుకో పావలాకో గొంతు లోకి చేరిపోయేది కూల్ కూల్ గా..
కాకపోతే ఇప్పుడు సుగంధ, ద్రాక్ష, జిరాలు కలిపి ఇదే సోడాను కొత్త రుచులతో జనం సేవిస్తున్నారు.
ఇలా ఎంత చెప్పుకున్నా.. మా ఆంధ్ర సోడా గురించి ఎంత రాసి చదువుకున్నా తక్కువే అవుతుంది. రెండు రోజుల క్రితం గుంటూరుకు దక్షిణ భాగాన ఓ పాతిక కిలోమీటర్ల దూరంలో కృష్ణాతీరంలో ఉన్న ఓ మండల కేంద్రానికి వెడితే ఈ సోడా బండి కనిపించింది. వెంటనే పాతరోజులు గుర్తొచ్చాయి.. ఆశకు రెక్కలొచ్చాయి. సోడా తాగేవరకు ఉండనివ్వలేదు.
చల్లటి నీళ్లు..
దానిలో కలసి దాగి ఉన్న గ్యాస్..
గొంతులో చేరి సేదతీర్చాయి…
ఎండకు వాడిన శరీరానికి సోడా కాస్తంత సాంత్వన చేకూర్చింది..
జై ఆంధ్రా సోడా..
జై జై గోలీసోడా…

సత్యనారాయణ శర్మ శిరసనగండ్ల సీనియర్ జర్నలిస్టు ,గుంటూరు .             9 4 9 2 6 8 4 2 0 5