అభివృద్ధిలో మహిళలదే కీలకం

294

హైదరాబాద్, మార్చి 8 (న్యూస్‌టైమ్): అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలక పాత్ర అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. పురుషునితో నేడు అన్ని రంగాల్లో పోటీపడుతూ మహిళ తన ప్రతిభను చాటుకుంటున్నదన్నారు. జనాభాలో సగంగా వున్న మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూయిస్తారని సీఎం తెలిపారు. వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు వేతనాల పెంపు సహా మహిళా సాధికారత కేంద్రంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని సీఎం పేర్కొన్నారు.

రాష్ట్రం మహిళా సంక్షేమంలో ముందంజలో వున్నదని సీఎం తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ సెలవు దినంగా ప్రకటించినట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశాలు ఇచ్చారు.