వ్యవసాయ రంగంలోకి స్టార్టప్ కంపెనీలు

322

హైదరాబాద్, మార్చి 8 (న్యూస్‌టైమ్): వ్యవసాయరంగంపై ఆరు స్టార్ట్ అప్ కంపెనీలు రూపొందించిన ప్రజెంటేషన్‌కు సంబంధించి సోమవారం బి.ఆర్.కె.ఆర్. భవన్‌లో జరిగిన సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనికతలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో వేగంగా అడుగులు వేసింది. సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుండి 2.11 కోట్ల ఎకరాలకు పెరిగింది. అదే విధంగా ఈ రబీ సీజన్లో తెలంగాణ లో మొత్తం దేశంలోనే అత్యధికంగా 51 లక్షల ఎకరాలలో వరి సాగులో ఉంది.

వ్యవసాయ రంగాన్ని మెరుగు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో అగ్రి-టెక్ స్టార్ట్ అప్‌లు రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. స్టార్ట్ అప్‌లకు సంబంధించి ప్రభుత్వం భాగస్వామ్యునిగా, వినియోగదారునిగా, మొదటి కస్టమర్‌గా ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకోవాలని, రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న అవరోధాలకు పూర్తి పరిష్కారాలను సాధించుటకై ప్రత్యేక ప్రతిపాదనలు రూపొందించాలని అగ్రి-టెక్ స్టార్ట్ అప్ కంపెనీలకు సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత అగ్రి-టెక్ స్టార్ట అప్‌లను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ఈకో సిస్టమ్‌లో డిజిటల్ పరివర్తనకు అనువైన స్టార్ట్ అప్‌లను గుర్తించుటకు, ఆ రంగంలో కృషి చేస్తున్న స్టార్ట్ అప్‌లకు మరిన్ని అవకాశాలను ఇవ్వడానికి ప్రభుత్వం చొరవచూపుతున్నట్లు తెలిపారు. స్టార్ట్ అప్‌లకు ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, డాక్టర్ ప్రవీణ్ రావు, పి.జె.టి.ఎస్.ఎ.యు, అగ్రి హబ్, సిఇఒ కల్పన శాస్త్రి, అగ్రి స్టార్ట్ అప్ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.