ఆశాజనకంగా తెలంగాణ బడ్జెట్

339

హైదరాబాద్, మార్చి 8 (న్యూస్‌టైమ్): తెలంగాణ రాష్ట్ర 2021-22 బడ్జెట్, ఆశాజనకంగా ఉండబోతున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సూచన ప్రాయంగా తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాల కోసం సీఎం ఇవాళ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థిక పద్దులో పొందుపరచాల్సిన శాఖల వారి బడ్జెట్ అంచనాలను, అధికారులు అందించిన ఆర్థిక నివేదికలను పరిగణలోకి తీసుకుని పరిశీలించారు. పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుతో పాటు, ఇప్పటికే అమలులో వున్న గొర్రెల పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా యాదవులు గొల్ల కుర్మల కుటుంబాలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నందున ఇప్పటికే పంపిణీ చేసిన మూడు లక్షల డెబ్బై వేల యూనిట్లకు కొనసాగింపుగా మరో 3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణికి గాను, రానున్న బడ్జెట్‌లో ప్రతిపాదనలను పొందుపరచనున్నామని సీఎం తెలిపారు.

గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నదని, దేశంలోనే అత్యంత అధికంగా షీప్ పాపులేషన్ వున్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నదని కేంద్రం గుర్తించిన నేపథ్యంలో, గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సీఎం తెలిపారు. అదే విధంగా ఇప్పటికే కొనసాగుతున్న చేపల పెంపకం కార్యక్రమం గొప్పగా సాగుతున్నదనీ, మంచి ఫలితాలు కూడా వస్తున్నందున దాన్ని కూడా కొనసాగిస్తామని సీఎం అన్నారు. కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు యాభై వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని దాని ప్రభావం లక్ష కోట్లకు చేరుకున్నదని సీఎం తెలిపారు. కాగా.. కరోనా అనంతర పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, వివిధ రూపాల్లో రాబడి పెరిగిందని, ఈ నేపథ్యంలో, గత బడ్జెట్ కంటే రాబోయే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగానే వుండే ఆస్కారమున్నదని సీఎం తెలిపారు.

నేటి ఉన్నత స్థాయి సమావేశంలో బడ్జెట్ అంచనాలు కేటాయింపులు కోసం విధి విధానాలు ఖరారయ్యాయని, రేపటినుంచి ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యా, ఇరిగేషన్ తదితర శాఖలను వరుసగా పిలిచి, ఫైనాన్స్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమావేశాలు నిర్వహిస్తారని సీఎం తెలిపారు. అన్ని శాఖలతో బడ్జెట్‌పై కసరత్తు ముగిసిన తరువాత తుది దశలో ముఖ్యమంత్రి అధ్యక్షతన బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దడం జరుగుతుంది. బడ్జెట్ సమావేశాలు మార్చి నెల మధ్యలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సీఎం తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ రావు, ఆర్థిక సలహాదారు జిఆర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణా రావు, కార్యదర్శి రోనాల్డ్ రాస్, సీఎంఓ అధికారులు భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.