ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమం

429

హైదరాబాద్, మార్చి 7 (న్యూస్‌టైమ్): దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారంనాడు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి ఆధ్వర్యంలో జల విహార్‌లో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు స్వయంగా చెక్కుల పంపిణీ చేసి వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని అన్నారు. వృత్తి నిర్వహణలో ప్రాణాలు కొల్పోయిన జర్నలిస్టులకు తన సంతాపాన్ని తెలిపారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలు ఎవ్వరూ రోడ్డున పడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంస్కారవంతమైనదని, కేసీఆర్ మనసున్న ముఖ్యమంత్రి అని అన్నారు.

వివిధ హోదాలలో జర్నలిస్టులుగా పని చేసిన వారందరికీ ముఖ్యమంత్రి, మంత్రులు సుపరిచితులేనని, కానీ వారు మరణించిన అనంతరం ఎవ్వరూ అనాధులుగా కాగూడదనే ఉద్దేశ్యంతో ఈ సంక్షేమ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమంలో మీడియా అకాడమీ ప్రశంసనీయ పాత్ర పోషిస్తుందని, సాధారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు చాలా ఉంటాయని, అకాడమీ చేస్తున్న కార్యక్రమాలు ఉదాత్తమైనదని ఈ కార్యక్రమాలను నిబద్దతతో చేపట్టాలని ఆయన సూచించారు. మీడియా అకాడమీ చైర్మన్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలు జర్నలిస్టులకు ఎంతో విలువైనవని, ఈ సంక్షేమంలో భాగమైన సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రెసిడెన్షియల్ పాఠశాలలలో ప్రవేశాలకు జిల్లా కలెక్టర్లకు తగు ఆదేశాలు జారీ చేస్తామని, ఎక్కడా లేని విధంగా రెసిడెన్షియల్ పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థికి ఒక లక్షా 20 వేల రూపాయలను ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలలో కులాలకు అతీతంగా విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. ఆందోల్ శాసనసభ్యుడు చంటి క్రాంతి కిరణ్ జర్నలిస్టు వృత్తి నుండే ఎదిగారని, జర్నలిస్టులకు ఎల్లవేళ్లలా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తారని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగానే సంక్షేమ నిధికి 34 కోట్ల 50 లక్షల రూపాయలను మంజూరు చేసిందని తెలిపారు. కేటీఆర్‌ను కలిసిన సందర్భంలో మీడియా అకాడమీ సంక్షేమ నిధి కార్పస్ ఫండ్ మంజూరుకు మరిన్ని నిధులు కేటాయించవలసిందిగా కోరిన వెంటనే స్పందించిన మంత్రి 17 కోట్ల 50 లక్షల రూపాయలను వెంటనే మంజూరు చేశారని ఆయన తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉందనడానికి ఇది నిదర్శనమని అన్నారు. ఇప్పటి వరకు 260 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున 2 కోట్ల 60 లక్షల ఆర్థిక సహాయం, తీవ్ర అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన 93 మంది జర్నలిస్టులకు 50 వేల చొప్పున 46 లక్షల 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించామన్నారు. ఈ రోజు 91 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు, 18 మంది తీవ్ర అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో సంక్షేమ నిధి ద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని అన్నారు. జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో మీడియా అకాడమీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

మంత్రి తారక రామారావు చేతుల మీదుగా సిరిసిల్లకు చెందిన వడ్డేపల్లి రాజేశం, నిజామాబాద్‌కు చెందిన కవిత, వరంగల్‌కు చెందిన ఆమంచి పద్మావతి, ఖమ్మంకు చెందిన హమీదా బేగం, సూర్యాపేటకు చెందిన సంధ్యారాణి, మహబూబ్‌నగర్‌కు చెందిన భాగ్యలక్ష్మీ, మెదక్‌కు చెందిన చంద్రకళ, అదిలాబాద్‌కు చెందిన రాజమణి, రంగారెడ్డికి చెందిన వెంకటమ్మ, హైదరాబాద్‌కు చెందిన హేమలత, సంగీతలకు ఒక లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆందోల్ శాసనసభ్యుడు చంటి క్రాంతి కిరణ్, మీడియా అకాడమీ కార్యదర్శి మహ్మద్ ముర్తుజా, మేనేజర్ లక్ష్మణ్ కుమార్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టెమ్జూ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, మీడియా అకాడమీ సిబ్బంది పూర్ణ చందర్ రావు, వనజ, ప్రసాద్, సిటీ ప్రెసిడెంట్ యోగానంద్, టియూడబ్ల్యూజె నాయకులు భాస్కర్, సూరజ్ కుమార్, నవీన్, అమిత్ బట్టూ, చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, జర్నలిస్టులు బారీ సంఖ్యలో హజరయ్యారు.