‘వెలగపూడి దళితులపై కేసులు ఎత్తివేయాలి’

470

గుంటూరు, మార్చి 7 (న్యూస్‌టైమ్): గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో మాదిగ కులస్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయకపోతే ప్రజా సంఘాలతో ఉద్యమం తీవ్రతరం చేస్తామని, సదరు విషయంలో హోం మంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఈ విషయంలో ప్రభత్వం హోం మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని పీపుల్స్ యాక్షన్ ఫోరం ఇండియా అధ్యక్షుడు పులిగుజ్జు సురేష్ డిమాండ్ చేశారు. ఆదివారం మంగళగిరి పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో ప్రజాసంఘాలతో ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన తమ డిమాండ్లను మీడియాకు తెలిపారు.

2020 డిసెంబర్ 25వ తేదీన వెలగపూడి ఘటనలో చలివేంద్ర రాంబాబుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి, అవమాన పరిచిన ఎస్సై వెంకటరమణ ఆయన బృందాన్ని కాపాడుకోవడం కోసం హోం మంత్రితో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని కేసును తారుమారు చేశారని సురేష్ ఆరోపించారు. ఇతర ప్రాంతాల నుండి నేర చరిత్ర కలిగిన వారిని పిలిపించి వెలగపూడి మాదిగ కులస్థులని హతమార్చేందుకు 27వ తేదీన ప్రత్యర్ధులు దాడికి దిగారని అన్నారు. ఆ సమయంలో అక్కడ పోలీసులు గానీ లేకుండా ఉంటే, పెద్ద మారణహోమం జరిగేది అని, మరియమ్మ మరణాన్ని బూచిగా చూపి మాదిగ కులస్థులని అణచివేయడానికి ఎస్సై వెంకటరమణ పెద్ద కుట్ర పన్నారని ఆరోపించారు. హోం మంత్రి అండదండలతో అక్కడ విద్యార్థులను, ఉద్యోగులపై అక్రమ కేసులు పెట్టి భయానికి గురి చేసి భావితరాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కుటుంబాన్ని, కుటుంబ పెద్దకు సంబంధం లేకుండా చేసి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని, దళిత పెత్తందారీగా తయారయ్యిన హోం మంత్రి వర్గం వెలగపూడి మాదిగలపైన సాంఘిక బహిష్కరణ చేయడం తగదని అన్నారు. ఘటన జరిగి ఇన్నాళ్లు అయినా ఈ రోజు వరకు ఇరు వర్గాలను కూర్చోబెట్టి గ్రామంలో పీస్ కమిటీలు వేయకపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టి గొడవకు కారణమైన విషయంపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మాదిగ కులస్థులపై పెట్టిన అక్రమ కేసులు భేషరతుగా ఎత్తివేయాలని, ఈ ఘటనలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న హోం మినిస్టర్‌ని బర్తరఫ్ చేయాలని, వెలగపూడి గ్రామంలో మాదిగ కులస్థులకు భద్రత, రక్షణ కల్పించాలని సురేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వెలగపూడి బాధిత మాదిగ సంఘం కన్వీనర్ సర్వేపల్లి సుదర్శన రావు, శ్రీ లక్ష్మీ నరసింహ ఎడ్యుకేషన్ సొసైటీ అధినేత ప్రొఫెసర్ మోహనరావు, మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్యదర్శి ఇందుపల్లి రామారావు, మాదిగ రాజ్యాధికార వేదిక కన్వీనర్ వేణు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎంప్లాయిస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ నూతక్కి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.