కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట ఏర్పాట్లు

356

గుంటూరు, మార్చి 6 (న్యూస్‌టైమ్): గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసేలా కౌంటింగ్ సెంటర్లలో ఏర్పాట్లు పకడ్బందీగా సిద్ధం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాలలో, లయోల పబ్లిక్ స్కూల్లో గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న కౌంటింగ్ సెంటర్లను జిల్లా సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్ పరిశీలించారు. పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలోని ప్రభుత్వ జౌళి సాంకేతిక విద్యా శాఖ భవనంలోను, పాలిటెక్నిక్ కళాశాల పాత భవనంలోను, లయోల పబ్లిక్ స్కూలు మొదటి, రెండవ అంతస్తులలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే హాల్స్ను, స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేసే గదులను, కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు లే అవుట్ మ్యాప్లను సంయుక్త కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ వివరిస్తూ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో 34 డివిజన్లు, లయోల పబ్లిక్ స్కూల్లో 23 డివిజన్ల ఓట్లు లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కౌంటింగ్ గదిలో ప్రతి పోలింగ్ బూత్‌కు ఒక టేబుల్ ఏర్పాటు చేశామని, కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే దారికి ఇరువైపుల, కౌంటింగ్ జరిగే గదుల కారిడార్లోను, లోపల ఐరెన్మెస్తో పూర్తి స్థాయిలో బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఆర్వో పరిధిలోని అన్ని డివిజన్ల ఓట్లు లెక్కింపు గదులు పక్కపక్కనే ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాలలోను, వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ సెంటర్లోకి కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది రాక పోకలకు వేరువేరుగా మార్గాలు ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ సెంటర్లోను కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది సీట్లు వేరుగా ఉండేలా పటిష్టంగా బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల ఆవరణలోకి అనధికార వ్యక్తులు రాకుండా ప్రవేశ మార్గాల వద్ద, వెలుపల పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సమన్వయంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి భాస్కరరెడ్డి, డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీరు రవికృష్ణరాజు, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు శాంతిరాజు, దాసరి శ్రీనివాసరావు, గుంటూరు పశ్చిమ మండల తహశీల్దారు టి మోహనరావు, ఈస్ట్ మండల తహశీల్దారు శ్రీకాంత్, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.